
- నారాయణ ఖేడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఘటన
నారాయణఖేడ్, వెలుగు: తన భార్యకు ట్రీట్మెంట్ చేయమన్న భర్తపై ఓ ప్రభుత్వ డాక్టర్ ఇనుపరాడుతో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. మనూర్ శల్గిరా గ్రామానికి చెందిన రోజి అనారోగ్యం కారణంగా ఆమె భర్త ప్రసాద్ ఖేడ్ ఏరియా హాస్పిటల్ తీసుకువచ్చాడు. తన భార్య రోజి సీరియస్ గా ఉన్నందున రక్త పరీక్షలు చేయాలని అక్కడున్న డాక్టర్ రాజ్ కుమార్ ను కోరాడు.
డాక్టర్ టైం అయిపోయింది రేపు పరీక్షలు చేస్తామని చెప్పాడు. కనీసం చీటీ రాసిస్తే బయట చేయించుకుంటామని ప్రసాద్ ప్రాధేయపడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రసాద్ పై డాక్టర్ రాజ్ కుమార్ ఇనుప రాడ్ తో దాడి చేసి గాయపరిచాడు. విషయం తెలుసుకున్న ఖేడ్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.