ఉద్యోగాల పేరుతో 40 కోట్లు వసూలు చేసిన ప్రభుత్వ ఉద్యోగి

వరంగల్ క్రైం, వెలుగు: హైవేకు దగ్గర్లో ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి అమాయకులను మోసగించి రూ. 40 కోట్ల వరకు వసూలు చేసిన ప్రభుత్వ ఉద్యోగి దంపతులను సుబేదారి పోలీసులు అరెస్ట్​ చేశారు. సీఐ రాఘవేందర్​ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ టీచర్స్​కాలనీ -2కు చెందిన గంగసాని ప్రమోద్​ కుమార్​ రెడ్డి ఏటూరునాగారంలోని ఐటీఐ కాలేజ్​ ప్రిన్సిపల్​ గా చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్​లో పెట్టుబడులు పెట్టి సంపాదించాలనే ఉద్దేశంతో రఘునాథపల్లి శివారులో నేషనల్​హైవే పక్కన భూములు కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా మార్చాలనుకున్నాడు. కానీ ఆయన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బంధువులు, కాలనీవాసులు, పరిచయస్తుల  నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. ఇలా 2015 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.40 కోట్లు పోగు చేశారు.

డబ్బులు ఇచ్చినవారికి సంబంధిత మొత్తానికి  ప్రామిసరీ నోట్లు, చెక్కులు కూడా రాసిచ్చారు. ఆ డబ్బులో కొంత మొత్తాన్ని భూమి కొనుగోలు కోసం, మిగతా మొత్తాన్ని వారి కొడుకు, తమ్ముడు సొంత ఖర్చులకు వాడుకున్నారు. అప్పు ఇచ్చినవారు  డబ్బు అడగగా బెదిరింపులకు దిగారు. డబ్బు ఇచ్చేది లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నారు. రెండు నెలల కిందట బాధితులు సుబేదారి పోలీసులను ఆశ్రయించడంతో  కేసు దర్యాప్తు చేశారు. ప్రమోద్​ కుమార్​ రెడ్డి, భార్య సునీత రెడ్డిని అరెస్ట్​ చేసి రిమాండ్​ కు తరలించారు.