రాష్ట్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఉద్యోగులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. జగిత్యాల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. బిర్పూర్మండల ఎంపీడీవో ఆఫీస్2016 నుంచి ఓ పాత భవనంలో కొనసాగుతోంది. ఏడేళ్లుగా కురుస్తున్న వర్షాలతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. పైపెచ్చులు ఊడిపడిన ఘటనలూ చాలానే ఉన్నాయి.
దీనికి తోడు నీరు ఇళ్లలోకి రావడంతో ఫైళ్లు తడిచిపోవడం అధికారులకు తలనొప్పి వ్యవహారంలా మారింది. సాక్షాత్తు కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా వచ్చి కార్యాలయాన్ని వేరే చోటుకి తరలించాలని చెప్పినా పరిస్థితిలో మార్పు రాలేదు.
గతేడాది ఎంపీడీవో మల్లారెడ్డి కూర్చుని ఉండగా పెచ్చులూడి పడ్డాయి. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విషయం అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కార్యాలయాన్ని వేరే చోటుకి మారుస్తామని ప్రకటించారు.
అయినా మార్పు జరగలేదు. ఈ ఏడాది సైతం రెండు చోట్ల పెచ్చులూడిపడటం పరిస్థితి తీవ్రతకు అద్దం ప డుతోంది. ఉన్నతాధికారుల తీరుతో విసుగెత్తిన ఉద్యోగులు తమ సమస్యను వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ఆగస్టు 8న ఇలా హెల్మెట్లు పెట్టుకుని కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించారు. చాలా రోజులుగా హెల్మెట్లు ధరించే డ్యూటీ చేస్తున్నామని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఆఫీస్‌కి కొత్త బిల్డింగ్ నిర్మించాలని.. ఈ లోపు వేరే భవనంలోకి తరలించాలని డిమాండ్చేస్తున్నారు.