స్వరాష్ట్రంలో ఉద్యోగుల తిప్పలు

స్వరాష్ట్రంలో ఉద్యోగుల తిప్పలు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకటో తేదీన జీతాలు అందుకుని ఎన్ని నెలలైందో? ప్రతినెలా ఆలస్యమే. పెన్షనర్లకూ లేటే. నెలల తరబడి బిల్లుల పెండింగ్. డీఏలూ సకాలంలో చెల్లించడం లేదు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగులో పెట్టారు. వాటిని ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు మరో డీఏ వాయిదా ప్రకటించనుంది. ఉద్యోగులకు ఐదేండ్లుగా బదిలీలు లేవు. ఎనిమిదేండ్లుగా టీచర్లకు ప్రమోషన్లు సైతం కల్పించలేదు. ఇవీ సకల జనుల సమ్మె చేసి కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్లో కొన్ని. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకున్న నాథుడే లేడు.

గతంలో ఎప్పుడంటే అప్పుడు ముఖ్యమంత్రులను కలిసినట్టు కేసీఆర్​ను కలిసే అవకాశం సంఘాలకు లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి క్యాబినెట్ మంత్రుల సబ్ కమిటీ కూడా లేదు. అధికారులను ఎన్నిసార్లు కలిస్తే ఏం ప్రయోజనం? ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా, అధికారులు కొత్తవి సృష్టిస్తున్నారు. సంఘాలతో చర్చించకుండా ఆదరాబాదరాగా, అసంబద్ధంగా 317 జీవో జారీ చేసి వేలాదిమంది టీచర్లను పుట్టి పెరిగిన స్థానిక జిల్లాలకు శాశ్వతంగా దూరం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా ‘ఎన్నికలు అయిపోయిన తర్వాత కూర్చుండి మాట్లాడుకుందాం! సమస్యలు పరిష్కరించుకుందాం’ అని పాలకులు ప్రతీసారి చెప్పడమే కానీ, వాస్తవానికి ఇప్పటివరకు కూర్చున్నదీ లేదు, సమస్యలు పరిష్కరించిందీ లేదు. నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచన్‌‌‌‌గా జీతాలు, పెన్షన్ అందుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న 90వ దశకంలో కూడా ఒకటో తేదీనాడే వేతనాలు తీసుకున్నారు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న బంగారు తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు. రోజుకో జిల్లా చొప్పున వంతులవారీగా జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నారు.

బిల్లులు పెండింగ్!

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంవత్సరం చివర ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వ ఆదాయం-, ఖర్చులను దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల బిల్లులు మంజూరు చేయకుండా ఫ్రీజింగ్ లో పెట్టేవారు. శాలరీ బిల్లులు మాత్రం క్లియర్ చేసేవారు. ఈ మేరకు ముందే స్పష్టమైన లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేసేవారు. కాగా, తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో అధికారికంగా ఎప్పుడూ ఫ్రీజింగ్ ప్రకటించలేదు. కానీ, బిల్స్ మాత్రం మంజూరు కావు. సంపాదిత సెలవుల నగదు, మెడికల్ రీయింబర్స్‌‌మెంట్, పిల్లల ఫీజు రాయితీ, జీపీఎఫ్ అడ్వాన్సులు, పాక్షిక విత్ డ్రాయల్స్ తదితర బిల్లులు ఆరు నెలలు దాటినా శాంక్షన్ కావడం లేదు. ఈ–-కుబేర్‌‌లో నెలల తరబడి పెండింగులో పెడుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కూడా మంజూరు చేయకపోవడంతో సదరు బిల్లులన్నీ మురిగిపోతున్నాయి. 2021–-22, 2022–-23 ఆర్థిక సంవత్సరాల్లో ఈ-–కుబేర్ లో పెండింగులో పెట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేలాది బిల్లులు మురిగిపోయాయి. కూతురు పెండ్లికి జీపీఎఫ్ అడ్వాన్సు/పాక్షిక విత్ డ్రా కోసం దరఖాస్తు పెట్టుకుంటే మనుమరాలు బారసాలకి కూడా డబ్బు చేతికి వస్తుందో రాదో తెలియని దుస్థితి దాపురించింది. ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడబెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులపై అనుచిత కంట్రోల్ ఎందుకో అర్థం కాదు.

సీపీఎస్ తో అభద్రతాభావం!

2004 సెప్టెంబర్ తర్వాత ప్రభుత్వ కొలువులో చేరిన వారు సీపీఎస్ కారణంగా పూర్తి అభద్రతాభావంతో ఉన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వం కనికరం చూపడం లేదు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీంను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ సైతం సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. సీపీఎస్ విధానాన్ని తెలంగాణలో కూడా రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా, విడివిడిగా పలు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సీపీఎస్ సిస్టంలో కనీస పెన్షన్ కి గ్యారంటీ లేకపోవడం, పదిహేను, ఇరవై ఏండ్లు పనిచేసి రిటైరవుతున్న సీపీఎస్ ఉద్యోగులకు నెలకు వెయ్యి, రెండువేల రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తున్న వైనాన్ని చూస్తున్న సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సామాజిక భద్రత బొత్తిగా లేని సీపీఎస్ విధానాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్థికంగా తెలంగాణ కంటే ఎంతో దిగువన ఉన్న రాజస్థాన్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకనుగుణంగా ఓల్డ్ పెన్షన్ స్కీంని పునరుద్ధరిస్తుండగా, ఆర్థిక పరిపుష్టి, మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరం.

హెల్త్ కార్డ్‌‌లపై నిర్లక్ష్యం!

ఉద్యోగి రిటైరయ్యే రోజే రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని స్వయంగా సీఎం పలుమార్లు ప్రకటించారు. ఆచరణలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. నగదు రహిత వైద్యం అందించేందుకు జారీ చేసిన హెల్త్ కార్డ్స్ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. హెల్త్ కార్డ్స్ పై వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ససేమిరా అంటున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతినెలా తమ వంతు వాటాగా కొంత మొత్తం చందా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని మెజారిటీ సంఘాలు లిఖితపూర్వకంగా తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హెల్త్ కార్డ్స్ విధానాన్ని పటిష్టపరచడంపై పట్టనట్లు వ్యవహరిస్తోంది. పోనీ, మెడికల్ రీయింబర్స్​మెంట్ పరిమితి పెంచారా అంటే, అదీ లేదు. ఎప్పుడో 2005లో నిర్ధారించిన రెండు లక్షల రూపాయల గరిష్ట పరిమితే నేటికీ అమల్లో ఉంది. పైగా, కొన్ని జబ్బులకు రీయింబర్స్ మెంట్ లిమిట్ రూ.లక్షకు తగ్గించి, ఆర్థిక సమస్యలు మరింత పెంచారు. 

ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు లేవు!
.
ఉమ్మడి రాష్ట్రంలో ఏటా బదిలీలు జరిగేవి. స్వరాష్ట్రంలో మాత్రం ఈ తొమ్మిదేండ్లలో ఉద్యోగులకు ఎనిమిదేండ్లు, ఉపాధ్యాయులకు ఏడేండ్లు బదిలీలే లేవు. దీర్ఘకాలంగా బదిలీలు చేయకపోవడంతో దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, స్పౌజ్ కేటగిరీ ఉద్యోగ, ఉపాధ్యాయులు అనుభవిస్తున్న బాధలు అన్నీఇన్నీ కావు. 317 జీఓతో ఈ సమస్య ఇంకా ఎక్కువైంది. ఎనిమిదేండ్లుగా టీచర్లకు ప్రమోషన్లే ఇవ్వలేదు. పండిట్, పీఈటీ పోస్టులను అప్‌‌గ్రేడ్ చేస్తూ జీఓ జారీ చేశారు, అమలు మరిచారు. 23 కొత్త జిల్లాలకు డీఈవో పోస్టులు,47 కొత్త మండలాలకు ఎంఈవో పోస్టులే మంజూరు చేయలేదు. సర్వీస్‌‌లో ఉండి మరణించినవారి కుటుంబ సభ్యుల్లో అర్హతలు ఉన్న వారిలో ఒకరికి పది రోజుల్లో కారుణ్య నియామకం చేస్తామని సీఎం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. 2018 జులై నుంచి అమల్లోకి వచ్చిన పీఆర్సీ పలు హేతుబద్ధమైన సిఫారసులు చేసింది. ఏండ్లు గడుస్తున్నా వాటిపై జీవోలు జారీ చేయలేదు. ప్రస్తుత పీఆర్సీ గడువు ఈ నెలతో ముగుస్తుంది. ఫస్ట్ జులై 2023 నుంచి కొత్త పీఆర్సీ సిఫారసులు అమల్లోకి రావాల్సి ఉంది. అయినా, ప్రభుత్వం ఇప్పటి వరకు వేతన సవరణ సంఘాన్నే నియమించలేదు. ఇప్పటికిప్పుడు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసినా, అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి కనీసం ఐదారు నెలల సమయమైనా పడుతుంది. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కారు అని మాటల్లో చెప్తూ, ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్ర సాధనలో తనతో కలిసి నడిచిన ఉద్యోగ, ఉపాధ్యాయులను దూరం పెట్టడం సీఎం కేసీఆర్ కి తగదు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలి. వెంటనే నూతన పీఆర్సీ కమిషన్ ఏర్పాటు వేయాలి. మూడు డీఏలను విడుదల చేయాలి. బదిలీలు, ప్రమోషన్లు వెంటనే కల్పించాలి. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలి. ఈ– -కుబేర్ లో బిల్లులు పెండింగులో పెట్టకుండా వెంటనే మంజూరు చేయాలి. 317 జీవోతో స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను ఒకేసారి కాకున్నా, కనీసం దశల వారీగానైనా సరే, స్థానిక జిల్లాల బదిలీకి ఉత్తర్వులు జారీ చేయాలి. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగానైనా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి. తమది నిజంగానే ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కారు అని చేతల్లో చూపాలి. 

- మానేటి ప్రతాపరెడ్డి,గౌరవాధ్యక్షుడు,  టీఆర్ టీఎఫ్