ఒక కర్మాగారంలోకి కార్మికుడు కాస్త ఆలస్యంగా వెళితే హాజరుపడదు. బోర్డింగ్ దగ్గర ఒక నిమిషం ఆలస్యమైతే విమానాశ్రయంలోకి వెళ్ళనివ్వరు. పరీక్షా కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వెళితే పరీక్ష రాసేందుకు అనుమతించరు. ప్రైవేటు కార్యాలయాలకు, పాఠశాలలకు, కళాశాలలకు ఆలస్యంగా వెళితే అక్కడా వేటు తప్పదు. ఉద్యోగులు క్రమశిక్షణతో తమ విధులకు హాజరుకాకపోతే వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేరు. ఇవన్నీ కూడా మన సమాజంలో మనం ఒక వైపు చూస్తూనే ఉన్నాం. చాలావరకు మన అనుభవంలోకి కూడా వస్తుంటాయి. మరోవైపు మనం నిత్యం ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదురవుతున్న సంఘటనలు కూడా చూస్తుంటాం.
రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నిత్యం సేవలందించడం వారి ప్రథమ కర్తవ్యం, వారి బాధ్యత. ఉద్యోగులు ప్రజల పన్నులతోనే జీతాలు పొందుతారు. ఉద్యోగ భద్రత కూడ ప్రభుత్వం కల్పిస్తోంది. తుది పనిరోజు వరకు అంటే తన పదవీకాలం వరకు ప్రతి నెల జీతం, దానితో పాటు ప్రయాణ, రోజువారీ భత్యాలతో పాటు, మెడికల్ అలవెన్సులు పొందుతారు. పదవీకాలం ముగిసిన తరువాత కూడా తన తుదిశ్వాస వరకు పెన్షన్ వస్తుంది. ఆ తరువాత ఉద్యోగి భాగస్వామికి కూడా తన తనువు చాలించేంతవరకు పెన్షన్ ఇవ్వడం మన ప్రభుత్వాలు కల్పిస్తాయి. ఈ సమాజంలో ఇటువంటి భద్రత ఏ ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులకూ లేవు. ఈనాడు ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగ భద్రత లేదు. కొన్ని ఐ.టి. రంగసంస్థలలో తప్ప ఇతర సంస్థలలో కనీస అవసరాలు తీర్చుకొనడానికి సరిపడా జీతాలు లేవు. ప్రైవేటు సంస్థలలో కనీసం 10 నుంచి 12 గంటలు ప్రతి రోజు పనిచేయాలి. ఒక పంచింగ్ మిషన్ ను కూడా ఉద్యోగుల పనివేళలు చెక్ చేయడానికి పొందుపరుస్తారు. దానికి అనుగుణంగా జీతాన్ని ఇస్తారు. ప్రభుత్వంలో ప్రజలకు ఉత్తమ సేవలందించడానికి సమాజంలో మంచిని పోషించేందుకు ఉద్యోగులకు ఎన్నో కఠినమైన రాత, ఇంటర్వ్యూ పరీక్షలు నిర్వహించి ఉత్తములను ఎంచుకొని ఉద్యోగం ఇస్తూ ఉద్యోగభద్రత కల్పిస్తోంది. వారి అర్హతను బట్టి పదోన్నతి కూడా లభిస్తుంది. మన సమాజం నుంచి ఇంత మంచి గౌరవం లభిస్తున్నప్పటికీ ఉద్యోగుల నుంచి ప్రజలకు అనుకున్నంతగా సేవలందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సిఫార్సులకే ప్రాధాన్యం
దాదాపు రాష్ట్ర బడ్జెట్ 40% వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు వెళుతుంది. మిగతా 60% అభివృద్ధి, అప్పులకు వడ్డీలు, సంక్షేమ పథకాలకు కేటాయిస్తారు. ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని తమ చిన్న చిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికివెళుతుంటే.. అధికారులు సమయానికి అక్కడ
అందుబాటులో ఉండక వెనుదిరిగి విసిగిపోతున్నారు. ఉద్యోగం పొందేవరకు ఒక లక్ష్యంతో ఉంటారు. కానీ, ఆ తరువాత కాలంలో ఉద్యోగులు మంచి జీతం, హోదా ఉన్నప్పటికీ ఏ గ్యారంటీ ఆదాయం లేని ఇతర జీవితాలతో పోల్చుకుని తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించలేక అవినీతికి పాల్పడుతున్నారు. అధికారులు ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా రాజకీయ నాయకుని సిఫారసు ఉంటేగాని పనులు చేయరనే అపవాదు సర్వత్రా ఉంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పాటైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలతో నిరంతరం ప్రజలకు పనిపడుతుంది. ప్రజలు తమ కనీసహక్కుగా పొందే ప్రతి చిన్న పని సేవలకు, ఉద్యోగులు తాము చేయాల్సిన పనులను కూడా రాజకీయ నాయకుల సిఫార్సు కోరడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఆత్మ
గౌరవాన్ని చంపుకోవడం తప్ప మరో మార్గం లేదు.
ప్రజలకు సేవలు అందట్లే..
వారంలో ఒక ఉద్యోగి కనీస పనివేళలు 40-–45 గంటలు ఆరు పనిదినాలలో పనిచేయాలి. అన్ని ప్రపంచ దేశాలలో ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. అయితే, ఈ పద్ధతిని ప్రభుత్వ అధికారులు అందరూ పాటిస్తే ప్రజలకు సేవలు నిర్విరామంగా అందజేయవచ్చును. జిల్లా, మండల స్థాయిలో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు పనివేళలు సరిగా పాటించకపోవడం, జవాబుదారీతనం లోపించడం వలన ప్రజలకు సేవలు సరిగా అందడంలేదు. ప్రజలు తమ నిత్య పనులకు కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో లంచాలు ఇచ్చి పని చేయించుకోవడం పరిపాటిగా మారిపోయింది. మన రాబోయే తరాలకు మంచి సంకేతాలను పంపలేమని తెలుసుకున్నప్పుడే అవినీతి నిరోధక శాఖ అవినీతి కట్టడికి చేసే ప్రయత్నాలు సాధ్యమవుతాయి.
సిటిజన్ చార్టర్ బోర్డు ఉన్నప్పటికీ ..
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్టర్ బోర్డు ఉన్నప్పటికీ దానికి చట్టబద్ధత లేకపోవడంతో పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు తమ పనులు పూర్తికాక తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురవుతున్నారన్న విషయం ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నేరుగా ఎంతోమందిని సంప్రదించి తెలుసుకుంది. అధికారులలో అలసత్వం, అవినీతి, పక్షపాత ధోరణి, తాత్సారం పోవాలంటే ఒక సమర్థవంతమైన బలమైన నాయకత్వ లక్షణాలు గల ఆదర్శవంతమైన పాలన అందించే నాయకులు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం.
ఉద్యోగుల టైమ్ టేబులే వేరు!
రాష్టంలో ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్ళి పరిశీలించినా 50% ఉద్యోగులు 10.30కు కార్యాలయానికి రారు. మధ్యాహ్నం 12- గంటల వరకు మెల్లిమెల్లిగా తమ సీట్లలో ఆశీనులై కనబడతారు. మళ్ళీ కాసేపట్లో భోజన విరామం పేరుతో 3.30 గంటల వరకు తిరిగిరారు. అయితే, సాయంత్రం 4.45 నిమిషాలకే తమ తమ స్థానాలు ఖాళీ చేసి వెళతారు. దాదాపు కొన్ని శాఖలు మినహాయిస్తే తప్ప అన్ని శాఖలలో ఇదే పరిస్టితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఆ పని సమయం సరిపోక ఏదో ఒక సాకుతో కొర్రీలు పెడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.
- సోమ శ్రీనివాసరెడ్డి,
కార్యదర్శి,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్