30 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ!:సర్కార్ కసరత్తు

30 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ!:సర్కార్ కసరత్తు
  • ఎక్కడేం ఉండాలనే  దానిపై సర్కార్ కసరత్తు
  • దేనికెంత భూమి కేటాయించాలనే దానిపై ప్రణాళికలు
  • ఏఐ సిటీ, స్కిల్, ఫ్యాషన్, స్పోర్ట్స్ వర్సిటీలు, కంపెనీలకు భూకేటాయింపులు 
  • ఇన్ ఫ్రాస్ట్రక్చర్​పైనా ఫోకస్ 

హైదరాబాద్, వెలుగు: దాదాపు 30 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో ఎక్కడేం ఉండాలి? దేనికెంత భూమి కేటాయించాలి? అనే దానిపై కసరత్తు చేస్తున్నది. భూవినియోగంపై ముందుగానే ప్లాన్ ​రెడీ చేస్తున్నది. దీంతో క్లస్టర్ల వారీగా డెవలప్​మెంట్ ఈజీ అవుతుందని భావిస్తున్నది. గతంలో ఫార్మా సిటీ కోసం కేటాయించిన భూములను కూడా ఫోర్త్ సిటీలో భాగంగానే వాడుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 

ఆ భూముల్లో గ్రీన్ క్లస్టర్ పేరుతో కాలుష్య రహిత ఫార్మా కంపెనీలకు కేటాయింపులు చేయనుంది.అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్కిల్, ఫ్యాషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు ఫోర్త్ సిటీలో భూమి కేటాయించనుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న కంపెనీలకు ఆఫీస్​స్పేస్ కోసం ఫోర్త్ సిటీలోనే స్థలం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

తొలుత ఫార్మా భూములనే వాడుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేయడంతో వాటిని ఎలా వినియోగించుకోవాలనే దానిపై అధికారులు కొన్ని ప్రపోజల్స్ రెడీ చేసి పంపారు. అయితే ఆ తర్వాత గ్రీన్​ఫార్మా కంపెనీలను అక్కడే కొనసాగించాలని నిర్ణయించడం, ఫోర్త్​సిటీని దాదాపు 30 వేల ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించడంతో భూవినియోగ ప్రతిపాదనలు మళ్లీ మారుస్తున్నారు. 

దేనికి ఎంతంటే? 

ఫోర్త్ సిటీ కోసం ఇప్పటికే అనుకున్న ప్లాన్​ప్రకారం ఏఐ సిటీ,  స్కిల్, ఫ్యాషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఎలక్ట్రానిక్స్,ఇతర ఇండస్ట్రీలు, ఎంటర్​టైన్​మెంట్​జోన్, ఫర్నీచర్ పార్క్, హెల్త్​సిటీ, లైఫ్​సైన్సెస్​హబ్, స్పోర్ట్స్​హబ్, రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్ల వారీగా ప్రభుత్వం భూవినియోగ కేటాయింపులు చేయనుంది. తొలుత దాదాపు 14 వేల ఎకరాల్లో కేటాయింపులు చేశారు. 

అయితే గ్రీన్​ ఫార్మా కంపెనీలను అక్కడే కొనసాగించాలని నిర్ణయించడంతో లైఫ్ సైన్సెస్​ వంటి వాటికి చేసిన కేటాయింపుల్లో మార్పులు ఉండనున్నాయి. దాదాపు 6- వేల నుంచి 8వేల ఎకరాలు కాలుష్య రహిత ఫార్మా కంపెనీలకు ఇవ్వనున్నారు. ఆ కంపెనీలకు సంబంధించినోళ్లకు ఇండ్లు, స్కూల్స్, హాస్పిటల్, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం 4 వేల నుంచి 5 వేల ఎకరాలు కేటాయించనున్నారు. ఏఐ సిటీకి మొదట 297 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పుడు ఇంకో 250 ఎకరాలు ఇవ్వాలని యోచిస్తున్నారు. 

యూనివర్సిటీల జోన్​కు 600  ఎకరాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఇండస్ట్రీలకు 6 వేల  ఎకరాలు, ఎంటర్​టైన్​మెంట్​జోన్​కు 550 ఎకరాలు, ఫర్నీచర్​పార్క్​కు 450 ఎకరాలు, హెల్త్​ సిటీకి 550 ఎకరాలు, లైఫ్​ సైన్సెస్​ హబ్​లో ఫార్మా కంపెనీలు మినహాయించి 3 వేల ఎకరాలు, నివాస, వాణిజ్య ప్రాంతాలకు 3,500 ఎకరాలు, పూర్తి నివాస ప్రాంతా లకు 2 వేల ఎకరాలు, స్పోర్ట్స్​హబ్​కు 850 ఎకరాల మేర ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.