- పడావు పెట్టిన భూములు, బిల్డింగుల లెక్కలు తీస్తున్న రాష్ట్ర సర్కార్
- ఇండస్ట్రీస్‌తో పాటు ఆఫీసులకు ఇచ్చిన జాగాలపై నజర్
- హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వివరాల సేకరణ
- వినియోగించని ఆస్తులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిశ్రమలు, ఆఫీసులు, ఇతర అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు, భవనాలు, ఇతర ఆస్తులపై సర్కారు దృష్టి సారించింది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఏయే అవసరాల కోసం, ఎవరెవరికి, ఎంత భూమి ఇచ్చారు? అది వినియోగంలో ఉందా? పడావు పడిందా? ఎందుకు వాడుకోలేదు? అనే వివరాలను సేకరిస్తోంది. వీటిపై నివేదికలు అందగానే వివిధ సంస్థలకు, వ్యక్తులకు కేటాయించిన భూముల్లో వినియోగించకుండా పక్కన పెట్టిన భూములను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేటాయించిన బిల్డింగ్ లన్నీ ఇప్పుడు ఖాళీగా ఉండడం, జిల్లాల్లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, పోలీసు కమిషనరేట్లు నిర్మించడంతో పాత భవనాలను ఎలా వాడుకోవాలనే విషయంపైనా మల్లగుల్లాలు పడ్తోంది. ప్రైమ్ ఏరియాల్లో ఉన్న బిల్డింగ్‌లను వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం రెంట్కిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు చెప్పారు. అలా వీలుకాకుంటే ప్రభుత్వం చేపట్టే కొత్త కార్యక్రమాలకు వాడుకోవాలనే ఆలోచన కూడా చేస్తోందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు, వివిధ అవసరాలకు ఇచ్చి వెనక్కి తీసుకోవాలనుకుంటున్న భూములపై స్పష్టత వచ్చాక వాటన్నింటికీ ఫెన్సింగ్ వేసి, జియోట్యాగింగ్‌చేసి రక్షించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఖాళీ బిల్డింగులన్నింటికీ కో ఆర్డినేట్స్‌తో జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వందల ఎకరాలు ఉత్తగనే పెట్టిన్రు..
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో గత ఐదు దశాబ్దాలుగా వివిధ కార్యాలయాలకు, దేవాలయాలకు, కమ్యూనిటీ హాళ్లకు, పరిశ్రమలకు ప్రభుత్వం వేల ఎకరాలు కేటాయించింది. ఇందులో వందల ఎకరాల్లో ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు164 ఎకరాలకు సంబంధించి 138 కంపెనీలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ప్రాథమికంగా ఇప్పటికే స్థిరాస్తుల పేరిట ఎంత విస్తీర్ణంలో, ఎన్ని బిల్డింగులు, కార్యాలయాలు ఉన్నాయనే వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు వీటిలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? ఎక్కడ ఎంత అవసరం? అదనంగా ఎంత ఉందనే వివరాలను తీసుకుంటున్నది. స్థిరాస్తుల కింద రాష్ట్రవ్యాప్తంగా 4 కోట్ల చదరపు గజాల్లో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వీటిలో దాదాపు కోటి చదరపు గజాల్లో ఉన్న ఆఫీసుల బిల్డింగులు ఖాళీగా ఉన్నాయని, హైదరాబాద్‌లోని ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌తో సహా మాసాబ్ ట్యాంక్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేటలాంటి ముఖ్యమైన చోట్ల కూడా పలు భవనాలు ఉన్నాయని చెప్తున్నారు.