- రైతులు చెరుకు పండిస్తే మిల్లుకు పూర్వవైభవం
- గవర్నమెంట్ సలహాదారుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి
(ఎడపల్లి) నిజామాబాద్, వెలుగు: నిజాం చక్కెర ఫ్యాక్టరీలు పునరుద్ధరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రైతులు చెరుకు సాగుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఏడాదిలో రెండు పంటలు వరి వేస్తున్న అన్నదాతలు ప్రత్యామ్నాయంగా చెరుకు ఎంచుకొని 7 లక్షల టన్నుల సరఫరాకు సిద్ధం కావాలన్నారు. అప్పుడే ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తుందన్నారు. నిజాం షుగర్‌ఫ్యాక్టరీ పరిధిలోని రైతులతో చెరుకు సాగుపై అభిప్రాయాల సేకరణకు శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని సరయూ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన స్పెషల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
చెరుకు పండించే రైతులకు సర్కారుపరంగా ప్రోత్సాహకాలు ఇవ్వడానికే సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. విత్తన సబ్సిడీ, అధిక దిగుబడి వచ్చే వంగడాలు, మద్ధతు ధర, హార్వెస్టింగ్ సమస్య, పది రోజుల్లో బిల్లుల చెల్లింపు, డ్రిప్ సబ్సిడీని ఇప్పించడానికి తమ పరిధిలో ప్రయత్నిస్తామన్నారు. మహారాష్ట్రలో రైతులు ఎకరానికి 80 నుంచి 100 టన్నుల దిగుబడినిచ్చే చెరుకు సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారని ఇక్కడ ఆ పరిస్థితి రావాలన్నారు.
ALSO READ : నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపుపై కేంద్రం ఫోకస్
తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడితో ఎకరానికి కనీసం రూ.1.50 లక్షలు మిగిలినా రైతులు చెరుకు సాగు వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయన్నారు. ఫ్యాక్టరీ మనుగడను రైతు కాపాడేలా చెరుకు పండించే రైతుకు మేలు చేసేలా పరస్పర నిర్ణయాలు ఉంటేనే జోడెడ్ల బండిలా ముందుకు వెళ్లొచ్చన్నారు. అత్యంత కీలకమైన మిషనరీ వ్యవస్థను వంద శాతం అప్‌గ్రేడ్ చేసి క్రషింగ్ కెపాసిటీ పెంచే నిర్ణయాలు అవసరమన్నారు. అదనపు ఆదాయం రాబట్టేందుకు ఇథనాల్ సేకరణపై లోకల్ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఫోకస్ పెట్టాలన్నారు.
చెరుకు లేక ఈ ఏడాది ఫ్యాక్టరీ స్టార్ట్ కాలే
ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఫ్యాక్టరీల తరపున ఉన్న బాకీ రూ.190 కోట్లను బ్యాంకులకు గవర్నమెంట్‌తో కట్టేయించామన్నారు. అయితే ఈ యాసంగి ఫ్యాక్టరీ పరిధిలోని మండలాల్లో ఎకరం కూడా వదలక రైతులంతా దాదాపు వరి పంట వేశారన్నారు.
15 నుంచి 18 వేల ఎకరాలలో చెరుకు సాగైతేనే ఏడాది సీజన్‌కు కావల్సిన ముడిసరుకు మిల్లుకు అందే వీలుంటుందన్నారు. ఇప్పుడా పరిస్థితిలేనందున ఈ ఏడాది ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదన్నారు. వచ్చే ఏడాది కోసమైనా రైతులు సన్నద్ధం కావాలన్నారు. ఇంతకు ముందులా చెరుకు ముక్కలను సీడ్‌గా వాడడంలేదని, వేర్లతో కూడిన మొలకలు అందుబాటులో ఉన్నాయన్నారు.
రైతుల అంతరంగంపై ఆందోళన ఉంది
రైతులు చెరుకు పంట వైపు ఆసక్తి చూపకపోవడం ఆందోళన కలిగిస్తోందని స్టేట్ షుగర్ కేన్ కమిషనర్ డాక్టర్ డి.మల్సూర్ అన్నారు. రైతుల నిర్ణయంపైనే ఫ్యాక్టరీ భవిష్యత్ ఆధారపడి ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఫ్యాక్టరీ నడిచిన కాలంలో చెరుకు సాగు చేసిన ఏడు మండలాల్లోని 85 గ్రామాల రైతుల అభిప్రాయాలు తెలుసుకోడానికి ఆఫీసర్లతో కూడిన ప్రత్యేక టీంను పంపుతామన్నారు. మిల్లు నడుపాలా? వద్దా? అనే సంగతి అప్పుడే స్పష్టమవుతుందన్నారు.
ఇథనాల్ యూనిట్ పెట్టాలి
చక్కెర ఫ్యాక్టరీతో పాటు దండిగా లాభాలు తెచ్చే ఇథనాల్ యూనిట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు కోరారు. వరి పంట సాగు విస్తీర్ణం తగ్గి చెరుకు పంట పెరిగేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. వరికి ఇస్తున్నట్లు చెరుకు పంటకు టన్నుకు రూ.500 రూపాయల బోనస్ ప్రకటించాలని కోరారు.
మొదట రేట్ స్పష్టం చేయాలి
చెరుకు ధర మొదట ప్రకటిస్తే నిర్ణయం తీసుకోడానికి ఈజీ అవుతుందని పలువురు రైతులు మీటింగ్‌లో అభిప్రాయపడ్డారు. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ మందు 50 శాతం సబ్సిడీపై అందించాలని, బ్యాంకు నుంచి పంట పెట్టుబడి రుణాలు విరివిగా ఇప్పించాలని కోరారు. తోలిన చెరుకు బిల్లు పది రోజులలో అందేలా గవర్నమెంట్ నుంచి భరోసా ఇప్పించాలన్నారు.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఉర్దూ అకాడెమీ చైర్మన్తాహెర్, స్టేట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీబీ ప్రెసిడెంట్ కుంటాల రమేశ్‌రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్తారాచంద్నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులు పాల్గొన్నారు.