- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు
- ఎలిగేడు మండలంలో ఇప్పటికే 500 ఎకరాల గుర్తింపు
- యూనిట్ ఏర్పాటుతో వందలాది మందికి ఉపాధి
- ఇటీవలే ఆయిల్‌ఫామ్ ఇండస్ట్రీకి శంకుస్థాపన
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఇండస్ట్రీస్ ఏర్పాటుపై సర్కార్ ఫోకస్ చేసింది. ఇప్పటికే జిల్లాలో రామగుండం ఇండస్ట్రియల్ ఏరియాగా కొనసాగుతుండగా, మిగతా జిల్లాను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే ఎలిగేడు మండలంలో 500 ఎకరాలను అధికారులు గుర్తించారు.
ఈ ఇండస్ట్రీ ఏర్పాటైతే వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పటికే కాల్వశ్రీరాంపూర్ మండలం పెదరాత్‌పల్లి వద్ద ఆయిల్‌ఫామ్ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేశారు. మంథని మండలంలో కోకకోలా కంపెనీ ఏర్పాటుకు భూ సర్వే కూడా జరుగుతోంది.
పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈక్రమంలో గతంలో ఆగిపోయిన పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు దాదాపు 500 ఎకరాలు అవసరం ఉండగా జిల్లాలో ఎక్కడా ఇంత భూమి ఒక్కచోట లేదు. దీంతో అధికారులు ఎలిగేడు మండలంలో సుమారు 1200 ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించారు. కానీ ఆ భూములను వివిధ సామాజిక వర్గాలకు పంపిణీ చేయగా, వాటిలో కొన్ని సాగులో ఉన్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం అధికారులు సర్వే చేయగా అందులో 102 ఎకరాలు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వీటి స్వాధీనానికి అధికారులు ప్లాన్ రెడీ చేశారు. మిగతా వారికి పరిహారం ఇచ్చి తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది.
మిగతా భూములకు పరిహారం ఇస్తామని చెప్పడంతో రైతులు అంగీకారానికి వచ్చారు. దీంతో చాలావరకు సమస్య పరిష్కారమైంది. ఈక్రమంలో రానున్న రోజుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కార్ చొరవ చూపుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.