- సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తర్వాత స్పీడందుకున్న పనులు
- ఆరు నెలల్లో కైటెక్స్ కంపెనీని ఓపెన్ చేసేలా చర్యలు
- పనులు, డీపీఆర్‌ల కోసం వారానికి రెండుసార్లు రివ్యూలు
- స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా ఆదేశాలు
వరంగల్, వెలుగు : వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ డెవలప్‌మెంట్‌పై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామన్న హామీతో రైతుల నుంచి భూములు తీసుకున్న బీఆర్‌ఎస్ సర్కార్ తర్వాత నిర్లక్ష్యం చేసింది. దీంతో టెక్స్‌టైల్ పార్క్‌లో ఒకటే కంపెనీ ఏర్పాటు కాగా, మిగతా రెండు కంపెనీల పనులు డెడ్‌స్లోగా నడుస్తున్నాయి.
వందలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు, ప్లాట్లు, ఇండ్లు ఇవ్వకపోగా, మరికొందరికైతే పరిహారమే చెల్లించలేదు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక తన మొట్టమొదటి జిల్లా పర్యటన ఇదే పార్క్ నుంచి ప్రారంభించారు. పార్క్ అభివృద్ధికి ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పనులు స్పీడందుకున్నాయి.
2017లో శంకుస్థాపన
బీఆర్‌ఎస్ హయాంలో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల మధ్యలో చింతలపల్లి చుట్టుపక్కల గ్రామాల రైతుల నుంచి దశల వారీగా 1,357 ఎకరాల భూములను సేకరించారు. తర్వాత టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం కోసం 2017 అక్టోబర్ 22న అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టడానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని, భూములు ఇచ్చిన రైతులకు ఏడాదిలో ఇంటికో జాబ్, మెయిన్ రోడ్డులో వెంచర్ చేసి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని హామీ చెప్పారు. పార్క్‌లో ఏర్పాటుచేసే కంపెనీల ద్వారా 65 వేల మందికి పైగా ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందన్నారు. యంగ్‍వన్ కంపెనీ ద్వారా 21 వేల మందికి, కైటెక్స్ ద్వారా 12 వేలు, గణేశా ఎకో ద్వారా 1000 మందికి డైరెక్ట్‌గా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.706.87 కోట్లు ఖర్చు చేశారు. శంకుస్థాపన జరిగి ఏడేండ్లు గడిచినా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు అందలేదు.
పార్క్ దగ్గర్లో కొత్త గ్రామం
సీఎం రేవంత్‌డ్డి జూన్ 29న వరంగల్ పర్యటన టైంలో టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించిన టైంలో, కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూలో ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. దీంతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ సత్య శారదాదేవి వివిధ శాఖల ఆఫీసర్లతో 15 రోజుల్లోనే నాలుగైదుసార్లు రివ్యూ చేశారు. పార్క్ కోసం భూములు ఇచ్చిన రైతులవి దాదాపు 1,360 ఇండ్లు ఉండగా ఉపాధి అవకాశాల కోసం వచ్చేవారు వేలల్లో ఉండే అవకాశం ఉంది.
దీంతో సీఎం సూచన మేరకు పార్క్ దగ్గర్లో కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టారు. భూనిర్వాసితుల కోసం తీసిన భూముల్లో రోడ్లు, వీధిదీపాలు, మంచినీటి సరఫరా, శానిటేషన్‌తో పాటు హెల్త్, ఎడ్యుకేషన్ కోసం కావాల్సిన డీపీఆర్‌లు రెడీ చేశారు. దీనికి తోడు మరికొందరికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉన్నందున కేసీఆర్ శంకుస్థాపన చేసిన పైలాన్ ఏరియాలో మరో 16 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ పథకంలో ఒక్కోక్కరికి రూ.5 లక్షలు కేటాయించేలా జాబితా రెడీ చేశారు.
రంగంపేట చెరువులోకి వరద నీరు
వర్షాకాలంలో పైభాగం నుంచి టెక్స్‌టైల్ పార్క్ ఏరియాకు భారీ ఎత్తున వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే కైటెక్స్ కంపెనీ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడి ప్రారంభం ఆలస్యమైంది. దీంతో వరద నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేట్టారు. పైనుంచి ఇక్కడికి వచ్చే వరద చుక్క కూడా ఆగకుండా నాలాల ద్వారా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఎల్గూర్ రంగంపేట చెరువులోకి పంపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక పార్క్ ఏరియాలో నీటి అవసరాల కోసం 15 నుంచి 20 ఎకరాల భూములు సేకరించి పార్క్‌కు ఎగువ, దిగువ భాగాల్లో రెండు చిన్న చెరువుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
80 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు పార్క్ పేరుతో రైతుల నుంచి వందల ఎకరాలు తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వలేదు. దీంతో ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో స్థానికేతరులకే ఉద్యోగాలు’ పేరున జూన్ 28న ‘వెలుగు’ పేపర్‌లో స్టోరీ పబ్లిష్ అయింది. గణేశ్ ఎకో టెక్ కంపెనీలో 1000 మందికి ఉద్యోగాలు ఇస్తే 800 మంది ఇతర ప్రాంతాల వారేనని, స్థానికులకు ఇచ్చిన మిగతా 200 ఉద్యోగాలు సైతం చెత్త మోసేవి, సెక్యూరిటీ గార్డువంటివేనని బహిర్గతం చేసింది.
ఆ తెల్లారే సీఎం రేవంత్‍రెడ్డి పార్క్ పర్యటనకు రావడంతో ఈ అంశం సైతం చర్చకు వచ్చింది. ఉద్యోగాల కల్పనలో తేడాలు ఉన్నది నిజమేనని తేలడంతో సీఎం ఆదేశానుసారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి గణేశా ఎకోటెక్ కంపెనీతో చర్చించారు. ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. త్వరలో ప్రారంభమయ్యే కైటెక్స్, యంగవన్ కంపెనీల్లోనూ 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించేలా చూడాలని హెచ్‌ఆర్‌డీ ఆఫీసర్లకు స్పష్టం చేశారు.
సీఎం ఆదేశాలతో పనులు స్పీడ్ చేసినం
మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు విషయంలో గత సర్కార్ నిర్లక్ష్యం వల్ల రైతు కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కలేదు. సీఎం రేవంత్‍రెడ్డి ఆదేశాలతో కంపెనీలతో మాట్లాడాం. ఆరేడు నెలల్లో కైటెక్స్ కంపెనీ ప్రారంభం అవుతుంది. యంగ్ వన్ కంపెనీలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. పనులను మరింత స్పీడప్ చేసి రైతు కుటుంబాలకు ఉద్యోగాలు, ప్లాట్లు, ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం.
- రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే