యాదగిరిగుట్ట పాలకమండలిపై నేతల కన్ను

యాదగిరిగుట్ట పాలకమండలిపై నేతల కన్ను
  • చోటు కోసం జోరుగా ప్రయత్నాలు
  • విప్​ఐలయ్య చుట్టూ ప్రదక్షిణలు 
  • ఈనెల 4న కేబినెట్​ మీటింగ్​లో  నిర్ణయం తీసుకునే అవకాశం

యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి టెంపుల్​ధర్మకర్తల పాలక మండలిపై సర్కారు దృష్టి సారించింది. దీంతో పాలకమండలిలో చోటు కోసం స్థానిక నాయకులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఐలయ్య చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నెల 4న జరిగే కేబినెట్​ మీటింగ్​లో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో పాలకమండలి ఏర్పాటుపై జిల్లాలో చర్చ మొదలైంది. 

ధర్మకర్తల మండలి లేకుండా 15ఏండ్లు..

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి టెంపుల్​ధర్మకర్తల మండలి లేకుండా సాగుతోంది. గతంలో మూడేండ్లకు ఒకసారి ధర్మకర్తలను నామినేట్ చేసేవారు. ఈ మండలిలో వంశపారంపర్య ధర్మకర్త సహా 9 మంది మెంబర్లు ఉండేవారు. ధర్మకర్తల మండలి పదవీకాలం 2009లో ముగిసిపోయింది. అప్పటి నుంచి 15 ఏండ్లుగా ధర్మకర్తల మండలి లేకుండా ఆఫీసర్ల చేతుల్లోనే టెంపుల్​ కార్యకలాపాలు సాగుతున్నాయి. 

2014 బీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మకర్తల మండలి మెంబర్ల సంఖ్యను 9 నుంచి 14కు పెంచుతున్నామని ప్రకటించింది. ఆ తర్వాత టెంపుల్​పునర్నిర్మాణం కోసం వైటీడీఏ ఏర్పాటు చేశారు. 2009 నుంచి ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం పలుమార్లు నోటిఫికేషన్లు వేశారు. నోటిఫికేషన్​వేసిన ప్రతిసారి అనేకమంది ఆశావహులు అప్లయ్ చేసుకున్నారు. కానీ ధర్మకర్తల మండలి మాత్రం ఏర్పాటు 
చేయలేదు. 

ప్రభుత్వ విప్​ చుట్టూరా..

గుట్ట ధర్మకర్తల మండలిలో చోటు కోసం అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఐలయ్యను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. తాము పార్టీకి ఎంతోకాలంగా సేవ చేస్తున్నామని.. గుట్ట పాలకమండలిలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 

Also Read :- ప్రాణాల మీదికి తెస్తున్న పతంగుల మాంజా

సేవా నిరతి కలిగిన వారికే..

గుట్ట ధర్మకర్తల పాలక మండలిలో పదవుల కోసం ఆరాటపడే వారికి బదులు సేవా నిరతి కలిగిన వారికే ప్రయారిటీ ఇస్తారని తెలుస్తోంది. టెంపుల్​ డెవలప్​మెంట్​ కోసం సొంతగా నిధులు ఖర్చు చేయగల స్థోమత కలిగిన వారిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతోపాటు టెంపుల్ డెవలప్​మెంట్​కోసం ఫండ్స్​సాధించే శక్తి ఉన్న వారిని మెంబర్లుగా నియమించాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. 

దృష్టి సారించిన సీఎం రేవంత్​.. 

టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి గతంలో ప్రకటించారు. గతేడాది నవంబర్​ 8న సీఎం రేవంత్​ రెడ్డి యాదగిరిగుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వ హించిన రివ్యూ మీటింగ్​లో ధర్మకర్తల మండలి ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో స్థానికంగా చర్చ మొదలైంది. 

ఈనెల 4న జరిగే కేబినెట్ సమావేశంలో ధర్మకర్తల మండలి ఏర్పాటుపై చర్చ జరుగనుందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో డెవలప్​మెంట్ వర్క్స్ కోసం ఫండ్స్ కోరడంతోపాటు ధర్మకర్తల మండలి విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.