
ఎస్ఎల్బీసీ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్బీసీ ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వం, సీఎందేనని నిర్మల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్రెడ్డి, పాయల్ శంకర్పేర్కొన్నారు. టన్నెల్ లోపల చిక్కుకుపోయిన 8 మంది సురక్షితంగా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్ఎల్బీసీ టన్నెల్ నుసందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘటన జరిగిన విషయం తెలియగానే ప్రధాని మోదీ సీఎంతో మాట్లాడి అన్నిరకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు.
టన్నెల్పనులు చేస్తున్న జేపీ కంపెనీకి డబ్బులు మిగిల్చే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఏండ్ల తరువాత పనులు ప్రారంభించేపుడు టన్నెల్ లోపలి పరిస్థితిపై నిపుణులతో అధ్యయనం చేయించకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమన్నారు. సీఎం ఘటనా స్థలాన్ని సందర్శించకపోవడం బాధాకరమని, మంత్రులు పిక్నిక్కు వచ్చినట్లు వచ్చి వెళ్లిపోవడం బాగా లేదన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, హరీశ్ కుమార్ బాబు, ధన్పాల్ సత్యనారాయణ గుప్తా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిరెడ్డి మనోహర్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు ఉన్నారు.