- టెండర్ల ప్రక్రియపై అధికారుల బిజీ
- దశాబ్దాల సమస్యకు చెక్
సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవరం వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు రూ.3 కోట్లను గ్రామీణ రహదారుల నిధుల కింద శాంక్షన్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టిమేషన్స్ పూర్తి చేసి టెండర్లు పిలిచారు. ఈ హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే ప్యాలవరం, దేవరంపల్లి గ్రామాల మధ్య నెలకొన్న రాకపోకల కష్టాలు తీరనున్నాయి.
వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల ఇరు గ్రామాల మధ్య ప్రజల రాకపోకలు సాగేవి కావు. తాజాగా బ్రిడ్జి నిర్మాణానికి ఫండ్స్ మంజూరు కావడంతో ఆ రెండు గ్రామాల ప్రజలు సంతోషిస్తున్నారు. బ్రిడ్జి పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు.
అంతకుముందు..
ప్యాలవరం గ్రామం అంతకుముందు దేవరపల్లి జీపీ పరిధిలో ఉండేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్యాలవరం ప్రత్యేక పంచాయతీగా మారింది. ఈ రెండు గ్రామాల మధ్య వాగు ఉండడంతో వర్షాకాలం వరద ఉధృతికి రాకపోకలు జరిగేవి కావు. చాలా రోజుల నుంచి ఈ రెండు గ్రామాల ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక జహీరాబాద్ఎంపీ సురేశ్షెట్కార్ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి ఫండ్స్ శాంక్షన్ చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెల 30న ఎంపీ సురేశ్ షెట్కార్ స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం టెండర్లు వేసి పనులు అప్పగించే పనిలో పంచాయతీరాజ్ అధికారులు బిజీగా ఉన్నారు.
సంతోషంగా ఉంది
చాలా కాలానికి ప్యాలవరం వాగుపై బ్రిడ్జి పనులు మొదలైతున్నయ్. ఇంతకాలం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వర్షాకాలం వాగు నిండి ప్రవహించడం వల్ల పొలం పనులు చేసుకోలేకపోయాం. బ్రిడ్జి పూర్తయితే మా కష్టాలు తొలిగినట్లే. చాలా సంతోషంగా ఉంది. బ్రిడ్జి నిర్మాణానికి సహకరించిన ఎంపీకి ధన్యవాదాలు.
- హనుమంతు, ప్యాలవరం
త్వరగా పనులు మొదలెట్టండి
ప్యాలవరం వాగు బ్రిడ్జి టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి పనులు మొదలెట్టాలి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వాన కాలంలో పొలం పనులు చేసుకోవచ్చు. రెండు గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారమవుతుంది. బ్రిడ్జి నిర్మాణానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.
- గుండప్ప, ప్యాలవరం