- రూ.50 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
- కామారెడ్డి జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణం
- దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు త్వరలో పనులు ప్రారంభం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు, వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల రిపేర్లకు ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. గ్రామీణ రోడ్లను మెరుగు పర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో ఆయా గ్రామాలను, మండలాలు, జిల్లా కేంద్రాన్ని లింక్ చేస్తే మొత్తం రోడ్ల పొడవు 3,436 కిలో మీటర్లు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 2,263, ఆర్అండ్బీ పరిధిలో 924 కిలో మీటర్లు విస్తరించి ఉంది. పంచాయతీ రాజ్ పరిధిలో 185 కి.మీ., సిమెంట్ రోడ్డు, బీటీ రోడ్డు 828 కి.మీ., మెటల్రోడ్డు 327 కి.మీ., మట్టి రోడ్డు 921 కి.మీ. మేర ఉంది.
భారీ వర్షాలు కురిసినప్పుడు, ఏండ్ల తరబడి రిపేర్లకు నోచుకోకపోవడంతో జిల్లాలోని పలు రోడ్లు దెబ్బతిన్నాయి. గుంతలు పడి, బీటీ కొట్టుకుపోయిన రోడ్లు ప్రయాణించడానికి ఇబ్బందిగా మారాయి. వెహికల్స్వెళ్లటానికి కూడా కష్టమవుతోంది. ఈ వానా కాలం సీజన్లో కురిసిన వానలకు కూడా పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాల్లోని పలు ఏరియాల రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ఆయా గ్రామాలకు ప్రజాప్రతినిధులు వెళ్లినప్పుడు రోడ్లకు రిపేర్లు చేయించాలని, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేసింది.
నిధులు మంజూరు
జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇందులో బాన్సువాడ నియోజక వర్గం సగం ఏరియా నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉంది. ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాలకు రూ.15 కోట్ల చొప్పున, కామారెడ్డి నియోజక వర్గానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. అన్ని నియోజక వర్గాలకు రూ.15 కోట్ల చొప్పున కేటాయిస్తే కామారెడ్డికి రూ.5 కోట్లు కేటాయించారు. మిగతా రూ. 10 కోట్లు త్వరలో వచ్చే అవకాశముందని సమాచారం.
కామారెడ్డి నియోజక వర్గంలోని అడ్లూర్ నుంచి బతుకమ్మ కుంట రోడ్డుకు రూ.కోటి, పాల్వంచ మండలం వెల్పుగొండ నుంచి ఫరీద్పేట కు రూ. 50 లక్షలు, మాచారెడ్డి మండలం కేంద్రం నుంచి అక్కాపూర్ రోడ్డుకు రూ. కోటి, దోమకొండ మండలం సంగమేశ్వర్ నుంచి సీతరాంపల్లి రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్లు, రాజంపేట మండలం శివాయిపల్లి నుంచి తలమడ్లకు రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని గాంధారి, తాడ్వాయి, లింగంపేట, సదాశివనగర్ , రాజంపేట, రామారెడ్డి, ఎల్లారెడ్డి మండలాల్లో దెబ్బతిన్న రోడ్లు రిపేర్లు చేయనున్నారు.