ఇరిగేషన్ ఆఫీసర్ల సెలవులు రద్దు .. ఆదేశాలు జారీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇరిగేషన్ ఆఫీసర్ల సెలవులు రద్దు .. ఆదేశాలు జారీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. ఈ మేరకు శనివారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అధికారులెవరూ హెడ్ క్వార్టర్స్ దాటి బయటకు రావొద్దని, సెలవులు పెట్టొద్దని సూచించారు. హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లాల్సి వస్తే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువుల లెవెల్స్‌‌‌‌ను పర్యవేక్షించాలని సూచించారు.

 మీడియం ప్రాజెక్టుల్లో ఓవర్ ఫ్లో కాకుండా గేట్లు, స్పిల్ వేలను పరిశీలించాలన్నారు. డ్యామ్‌‌‌‌లు, కట్టలు, కెనాల్స్‌‌‌‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు. వాటి పటిష్టతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదం ఉందనుకున్న చోట అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ, వేగంగా స్పందించాలని ఉత్తమ్ సూచించారు.