అంకెల్లోనే కేటాయింపులు..అమల్లో చిత్తశుద్ధి లేదు

ప్రభుత్వ బడ్జెట్ ద్వారా అభివృద్ధి, సగటు మనిషి ఆదాయం, జీవన విధానం, నివాస యోగ్యమైన సొంత ఇల్లు పరిసరాలు మెరుగుపడాలి. అందుకు పూర్తి విరుద్ధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, పాత సీసాలో కొత్త సారా అన్నట్లుగా ఉన్నది. అంకెల గారడీలతో రైతులను, మహిళలను, యువతను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, బలహీన వర్గాలను ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఒక లక్ష్యం, దిశ లేదు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి అవాస్తవాలను బడ్జెట్​లో పొందుపరిచింది. కేవలం కాగితాల మీద వేసుకునే అంకెలు మాత్రమే తప్ప వాస్తవ ఆర్థిక స్థితికి విరుద్ధంగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాలు, కేటాయించిన నిధుల్లో కనీసం10 శాతం అమలు చేయని ప్రభుత్వం. మళ్లీ అదే గారడీలతో ప్రజలను మభ్యపెట్టింది. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందీ ప్రభుత్వం. నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపకపోవడం వంటి దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎందుకు నెలకొన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తమ వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై నెట్టి తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారే కానీ, ప్రజల సంక్షేమంపై, రాష్ట్ర అభివృద్ధిపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.

చెప్పేవి గొప్పలు చేసేవి శూన్యం

రాష్ట్రంలో వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతోందని ప్రకటనలు గుప్పిస్తూ దేశవ్యాప్త ప్రచారం చేస్తున్న కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో వేల మంది కౌలు రైతుల ఆత్మ హత్యలపై మాట్లాడక పోవడం విడ్డూరం. పోలీస్ శాఖ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 6,121 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) రిపోర్ట్ ప్రకారం.. రైతు ఆత్మ హత్యల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. గత నెల నుంచి ఇప్పటి వరకు 11 మంది అన్నదాతలు సూసైడ్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కావా? వీటికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తానని చెప్పిన ప్రభుత్వం అందుకోసం బడ్జెట్​లో అవసరమైన కేటాయింపులు చేయలేదు. కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజనను పక్కాగా అమలు చేసి రైతులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి బీమా పథకాన్నీ అమలు చేయడం లేదు. ఫసల్ బీమా యోజనను కూడా రాష్ట్రంలో వర్తింపజేయడం లేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందక అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

సుస్థిర అభివృద్ధిని మరిచి..

సుస్థిర అభివృద్ధి, హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్​లలో కీలకమైన విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం కనీస బాధ్యత చూపలేదు. ఈసారి మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.2,90,396 కోట్లలో విద్యారంగానికి రూ.19,093 కోట్లు(6.57%), వైద్య రంగానికి రూ.12,161 కోట్లు (4.18%) మాత్రమే కేటాయించింది. మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానలో ఏటా కుటుంబానికి రూ.5 లక్షల వైద్య సాయమందించే ఆయుష్మాన్ భారత్ స్కీం ద్వారా 22 లక్షల మందికి రాష్ట్రంలో అవకాశమిచ్చినా, ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. 

బీసీ సంక్షేమం పట్టింపే లేదు..

బీసీ సంక్షేమాన్ని కాగితాలకు, కేటాయింపులకే పరిమితం చేసింది కేసీఆర్ సర్కార్. జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు 2 శాతం నిధులు కేటాయించడం దారుణం. గడిచిన 9 ఏండ్లుగా రాష్ట్ర సర్కార్ అరకొర నిధులతో బీసీలను వంచిస్తున్నది. బీసీలకు ప్రత్యేక ప్రణాళికల ద్వారా నిధులు కేటాయిస్తామని నిరుడు అసెంబ్లీలో హామీ ఇచ్చిన కేసీఆర్ తాజా బడ్జెట్​లో కనీసం దాని ఊసే ఎత్తలేదు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్​మెంట్ స్కాలర్ షిప్​ల బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి. బీసీల వెల్ఫేర్ కోసం గత బడ్జెట్ లో రూ.5,698 కోట్లు కేటాయింపులు చేసినా బీసీ యువతకు కార్పొరేషన్ రుణాలు ఇంతవరకు విడుదల కాలేదు. వడ్డెర, రజక, నాయీ బ్రాహ్మణ తదితర ఎంబీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.  మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పులు పాలైంది. 2014లో రాష్ట్ర అప్పు రూ.67 వేల కోట్లు ఉంటే, అది రూ.5 లక్షల కోట్ల వరకు దాటింది. కాగ్ నివేదికతో సంబంధం లేకుండా ప్రజలను మభ్య పెట్టడానికి ప్రభుత్వం అప్పులు దాచిపెట్టి అసెంబ్లీలో గారిడి లెక్కలు చూపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు బాగా పెరుగుతూనే ఉన్నాయని ఇటీవల ఓ నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకున్న మార్కెట్ రుణాలు 2023 మార్చి నాటికి రూ.3.66 లక్షల కోట్లకు చేరుతున్నాయని తెలిపింది. కానీ బడ్జెట్​లో ప్రభుత్వం దీన్ని 3.22 లక్షలు కోట్లుగానే చూపింది. రాష్ట్ర బడ్జెట్ లో సింహభాగం వడ్డీలు, అసలు చెల్లించడానికే సరిపోతున్నది. గత ఎనిమిది ఏండ్లలో ప్రభుత్వం వడ్డీ చెల్లింపులకు కట్టిన లక్ష అయిదు వేల కోట్లలో సగం ఖర్చుపెట్టినా మన ప్రభుత్వ విద్యాసంస్థలు, దవాఖానాలు, డబుల్ బెడ్ రూమ్​ఇండ్లు పూర్తి అయ్యేవి.

నిరుద్యోగ భృతి ఏది?

2018 ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి అందలేదు. మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలకు రూ. 4 వేల కోట్లు కేటాయించి ఇప్పటివరకు వంద కోట్లు కూడా ఇవ్వలేదు. దళిత బంధుకు గతేడాది రూ.17,700 కోట్లు కేటాయించి, 10 శాతం కూడా ఖర్చు చేయలేదు. 2022లో 11వేల 800 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పి మోసం చేసింది. గొల్ల కురుమలకు రూ.11 వేల కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పి కనీసం వెయ్యి యూనిట్లు కూడా ఇవ్వలేదు. ములుగు గిరిజన యూనివర్సిటీకి ఏటా కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. ఇప్పటి వరకు క్లాసులు ప్రారంభించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు 2016 నుంచి లక్షల అప్లికేషన్లు వస్తే ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదు.2022 బడ్జెట్ లో బీసీలకు రూ.5600 కోట్లు, ఎస్టీలకు రూ.12 వేల కోట్లు కేటాయించి, పైసా ఇవ్వలేదు. ఎంబీసీలకు రెండేండ్లుగా రూ.2000 కోట్లు కేటాయించి కనీసం రూ.10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ‘గిరిజన బంధు’ ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదు. 2022–23లో రూ.3,415 కోట్లు ఎస్టీ డిపార్ట్​మెంట్ కు కేటాయిస్తే ఇందులో ఎస్టీల వెల్ఫేర్​కు ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ.100 కోట్లు కూడా దాటలేదు. ఇలా ఏటా వార్షిక బడ్జెట్ కేటాయింపులను ఏనుగు తొండంలా చూపించి నిధులు మాత్రం ఎలుక తోకలాగే తక్కువ ఇస్తూ వస్తున్నది. 

‑ డా. కె. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు