టూరిజం స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రామగిరి ఖిల్లా

టూరిజం స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రామగిరి ఖిల్లా
  • పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ ప్రణాళికలు 
  • శిల్ప కళ, ప్రకృతి సోయగాలకు కేంద్రం రామగిరి
  • టూరిస్ట్​ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లాను టూరిజం స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.  ఖిల్లా శిల్పకళ, ప్రకృతి సోయగాలకు నెలవు. ఇటీవల పెద్దపల్లి కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు, ఫారెస్ట్​ అధికారులతో  రామగిరి అభివృద్ధిపై రివ్యూ చేశారు. రామగిరి ఖిల్లా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు, రామగిరి ఖిల్లా చరిత్ర, ప్రాముఖ్యత తదితర అంశాలపై ఆరా తీశారు. రామగిరిని టూరిస్టు స్పాట్​గా అభివృద్ది చేయనున్నట్లు ప్రకటన రావడంతో తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఖిల్లా అభివృద్ధితో ఉపాధి అవకాశాలు 

రామగిరి ఖిల్లాను టూరిస్టు స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి  చేయడం ద్వారా  స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీంతోపాటు పెద్దపల్లి జిల్లాలో పలు ప్రాంతాలకు రోడ్డు, రవాణా అందుబాటులోకి వచ్చే చాన్స్​ ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి రామగిరి ఖిల్లా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖిల్లా బేగంపేట, రత్నాపూర్​, కల్వచర్ల  గ్రామాల మధ్య విస్తరించి ఉంది.

 ప్రతీ ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్, ఆయుర్వేద డాక్టర్లు, సైంటిస్టులు బొటానికల్​ టూర్​ కోసం ఇక్కడకు వస్తుంటారు. రామగిరి చేరుకొని ఖిల్లా ఎక్కేందుకు ఎలాంటి రోడ్డు మార్గాలు లేవు. ఖిల్లాపైకి చేరుకోవడానికే దాదాపు 10 కి.మీకు పైగా ఉంటుంది. బేగంపేట నుంచి రోడ్డు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ట్రాన్స్​పోర్ట్​ పెరిగితేనే..

గతంలో రామగిరి ఖిల్లా మావోయిస్టులకు షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్​గా ఉండేది. రామగిరి ఖిల్లాకు చుట్టుపక్కల ఉన్న బేగంపేట, రత్నాపూర్, మచ్చపేట, మైదబండ, లక్కారం లాంటి గ్రామాలకు ఎలాంటి రవాణ సౌకర్యాలు లేవు. దీంతో మావోయిస్టులు రామగిరిని సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్​గా చేసుకున్నారు. రామగిరి ఖిల్లోపై మావోయిస్టు పార్టీలోనే మొట్టమొదటి కోవర్టు ఆపరేషన్​ జరిగింది. ఈ కోవర్డు ఆపరేషన్​తో రామగిరి ఖిల్లా గురించి దేశం మొత్తం చర్చించుకుంది. 

ఆ తర్వాత చాలా కాలం తర్వాత రామగిరి ఖిల్లా నలువైపులా రోడ్డు సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. కానీ ఖిల్లా కింది భాగం వరకు రోడ్డు లేకపోవడంతో దాదాపు 10 కిలోమీటర్లు కాలినడక తప్పడం లేదు. రామగిరిని టూరిస్ట్​ స్పాట్​గా డెవలప్​ చేయడంతో ఖిల్లాకు పర్యాటకుల తాకిడితో పాటు సమీప మండలాలకు కూడా అభివృద్ధి చెందే అవకాశముంది.