ఇక జిల్లాల్లో సీఎం ప్రజావాణి ..పైలెట్ ప్రాజెక్ట్​గా ఆదిలాబాద్

  • ప్రతి మండల కేంద్రంలో ఫెసిలిటేషన్ సెంటర్లు  
  • రెండు వారాలకోసారి దరఖాస్తులపై బహిరంగ విచారణ  
  • ఈ నెల 20 నుంచి అమలుకు శ్రీకారం చుట్టనున్న సర్కార్ 

ఆదిలాబాద్, వెలుగు: ఇకపై జిల్లాల్లో ‘సీఎం ప్రజావాణి’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఇందుకు ఆదిలాబాద్​ను పైలెట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇక్కడ ఈ నెల 20న సీఎం ప్రజావాణి కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్నది.  

దిలాబాద్​లో ఈ ప్రయోగం సక్సెస్​ అయితే  అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే  డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెలెక్టివ్ పర్సన్లు, ఎంపీవో, ఎంపీడీవో, సూపరింటెండెంట్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, విద్యుత్ శాఖ, ఆర్​డబ్ల్యూఎస్ ఏఈలు, కమ్యునిటీ కో ఆర్డినేటర్లు, సివిల్ సొసైటీ మెంబర్లు, తహసీల్దార్లు, గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారులు, కిసాన్ మిత్ర, ప్రత్యేకాధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో  రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.  

ప్రతి మండలంలో  గ్రీవెన్స్​ ఫెసిలిటేషన్ సెంటర్ 

ఆదిలాబాద్ లో  ‘సీఎం ప్రజావాణి’ కోసం  ప్రతి మండల కేంద్రంలో గ్రీవెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న  ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనే వీటిని ఏర్పాటు చేసి.. ప్రతిరోజూ అర్జీలు స్వీకరిస్తారు. 

ఇక్కడ ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతిరోజూ వచ్చిన  దరఖాస్తులను ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ లో నమోదు చేస్తారు. ఈ అర్జీలను పరిశీలించేందుకు  ఇద్దరు సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్లను నియమిస్తారు.  

మొదట  కీలకమైన శాఖలకు సంబంధించిన సమస్యలపై,  పథకాలు అందని అర్హులనుంచి మాత్రమే  దరఖాస్తులు తీసుకుంటారు.  పింఛన్లు, క్రాప్ లోన్, రైతు భరోసా, భూ భారతి, మీ సేవ, రెవెన్యూ, రూరల్ డెవలప్ మెంట్, విద్యుత్, మిషన్ భగీరథ, ఉపాధి హామీ, రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలపైనే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.  

స్టాండర్డ్​ ఆపరేటింగ్ ప్రొసిజర్ సిస్టం ద్వారా అర్జీదారుల సమస్యలను ఆయా  అంశాలవారీగా  నమోదు చేస్తారు. ఫిర్యాదు చేసిన వారికి  రశీదు అందజేస్తారు.  అర్జీలను అదేరోజు సంబంధిత  శాఖలకు ఫార్వర్డ్ చేస్తారు. ఆయా శాఖలు నెల రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్​ ఇవ్వాల్సి ఉంటుంది.  అర్జీ ఇచ్చి నెలదాటినా సమస్య పరిష్కారం కాకపోతే అధికారులు అర్జీదారుడికి ఫోన్ చేసి, అందుకు కారణం చెప్పాల్సి ఉంటుంది. 

2 వారాలకోసారి విచారణ 

గ్రీవెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్లలో వచ్చిన దరఖాస్తులపై  2వారాలకోసారి బహిరంగ విచారణ జరుపుతారు. ఈ కార్యక్రమానికి మండల, గ్రీవెన్స్ స్పెషల్ ఆఫీసర్లు హాజరవుతారు.

 సీఎం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఏ స్థాయిలో ఉన్నాయి? ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి?  అనేది  సంబంధిత శాఖ అధికారులు వివరిస్తారు. ఇలా ప్రజలకు వారి సమస్యలపై క్షేత్రస్థాయిలోనే పరిష్కారం దొరుకుతుంది. 

ప్రస్తుతం గ్రీవెన్స్ కోసం జిల్లా కలెక్టరేట్ లో,  ఐటీడీఏ పరిధిలోని ఉట్నూర్ లో ప్రజల నుంచి ప్రతి సోమవారం అర్జీలు స్వీకరిస్తున్నారు. ప్రతి వారం వందల సంఖ్యలో ప్రజలు గ్రీవెన్స్ కు తరలివస్తుంటారు. 

అయితే  దూర ప్రాంతాల నుంచి రావాలంటే బాధితులకు ఆర్థికంగానే కాకుండా కిలోమీటర్ల ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ వచ్చినా.. తీరా సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కావడం లేదనేది తెలియడం లేదు. ఇప్పుడు సీఎం ప్రజావాణితో నేరుగా మండల కేంద్రాల్లోనే అర్జీలు చేసుకోవడం.. పరిష్కారానికి గల కారణాలు తెలుసుకునే అవకాశం కలుగనున్నది.

కలెక్టర్ దిశానిర్దేశం 

సీఎం ప్రజావాణిపై కలెక్టర్ రాజర్షి షా గురువారం  అధికారులకు దిశానిర్దేశం చేశారు. 18 మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

సీఎం ప్రజావాణి జనవరి 20 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నామని,  ఇందులో వచ్చిన సమస్యలను  30 రోజుల్లో  పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు  పకడ్బందీగా నిర్వహించి, విజయవంతం చేయాలని ఆదేశించారు.