- పదేండ్లుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు
- కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకూ ఫండ్స్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గానికి రూ. 50 కోట్ల నిధులు కేటాయించాలని యోచిస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవర్గాల్లో రిపేర్లు చేపట్టాల్సిన రోడ్ల పనుల ప్రపోజల్స్ పంపాలని ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేలను కోరింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రద్దీ ఎక్కువ ఉండి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న రోడ్లకు సంబంధించిన ప్రపోజల్స్ పంపినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం 100 నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, తొలి దశలో 50 నుంచి 60 నియోజకవర్గాలకు ఫండ్స్ కేటాయించనున్నట్లు తెలుస్తున్నది.
ఆ నిధులు చాలవంటున్న ఎమ్మెల్యేలు
గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రోడ్ల రిపేర్లకు నిధులు ఇవ్వలేదని, దీంతో రోడ్లు చాలా వరకు ధ్వంసమయ్యాయని ఆర్అండ్బీకి ఎమ్మెల్యేలు తెలిపినట్టు సమచారం. అలాగే ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు వందల కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, బ్రిడ్జిలు, కల్వర్టులు కొట్టుకపోయాయని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రూ.50 కోట్ల ఓ ఎమ్మెల్యే సుమారు రూ.200 కోట్లతో ప్రపోజల్స్ పంపినట్టు అధికారులు తెలిపారు. నిధులు సరిపోవని వాటిలో ప్రయారిటీ ప్రకారం పంపాలని కోరటంతో తగ్గించి మళ్లీ పంపారు.
రోడ్ల రిపేర్లకు స్టేట్ ఫండ్స్, సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) ఎన్డీఆర్ఎఫ్, జిల్లా కలెక్టర్లకు ఇటీవల వరదల సమయంలో సీఎం శాంక్షన్ చేసిన రూ.5 కోట్లు ఇలా అందుబాటులో ఉన్న అన్ని నిధులను ఉపయోగించనున్నారు. త్వరలో కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ నుంచి మరి కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.
మంత్రులకు భారీగా వినతులు
రోడ్ల రిపేర్లకు ఫండ్స్ ఇవ్వాలని కొన్ని నెలల నుంచి ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, పంచాయతీ రాజ్ రోడ్ల రిపేర్లకు ఆ శాఖ మంత్రి సీతక్కకు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు భారీగా వినతులు ఇస్తున్నారు. అన్ని ప్రతిపాదనలను తీసుకొని ఈఎన్సీ, సీఈలకు పంపిస్తూ నిధులు అందుబాటులో ఉన్నంత వరకు మంజూరు చేయాలని మంత్రులు చెబుతున్నారు. మంత్రులను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉండడం గమనార్హం.
ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోడ్ల రిపేర్లపై ప్రతిపాదనలతో సెక్రటేరియెట్లో సీతక్కకు లేఖ అందించారు. మంత్రి వెంటనే ఈఎన్సీకి ఫోన్ చేసి ప్రపోజల్స్ లేఖ పంపుతున్నానని, నిధులు ఉన్న ప్రకారం శాంక్షన్ చేయాలని ఆదేశించారని పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
రోడ్ల పనులకు టెండర్లు
నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో రూ.356.97 కోట్లతో రోడ్ల రిపేర్లకు ఆర్ అండ్ బీ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 28 లోగా ఆయా జిల్లాల్లో రోడ్ల రిపేర్ల పనులకు టెండర్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది. వచ్చే ఏడాది జూన్ వరకు రోడ్ల పనులు పూర్తి చేయాలని అందులో స్పష్టం చేసింది.
రోడ్ల రిపేర్ల కోసం జపాన్, అమెరికా నుంచి తెప్పించిన ఎయిర్ ఫ్రెషర్ జెట్ ప్యాచర్, పాట్ హోల్ అండ్ రోడ్ మెయింటెనెన్స్ మిషనరీను ఇటీవల ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ పరీక్షించింది. వీటి సాయంతో రోడ్లు రిపేర్ చేస్తే.. పని పూర్తయిన అరగంటలోనే వాహనాలను అనుమతించ వచ్చు.