ఒక్కో జిల్లాలో 500 ఎకరాలు..టార్గెట్ 30 వేల కోట్లు

  • భూములు అమ్మాలని సర్కార్ నిర్ణయం.. రూ.30 వేల కోట్లు టార్గెట్
  • అన్ని జిల్లాల్లో కలిపి 15 వేల ఎకరాలు 
  •  అసైన్డ్, ఇతర ల్యాండ్స్ ఏవైనా సరే అప్పగించాల్సిందే 
  • కలెక్టర్లకు సర్కార్ అల్టిమేటం   
  • అటు రైతులకు.. ఇటు కలెక్టర్లకు టెన్షన్​  

హైదరాబాద్, వెలుగు: అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములను భారీ ఎత్తున అమ్మాలని రాష్ట్ర సర్కార్​ డిసైడ్ అయింది. ఒక్కో జిల్లాకు కనీసం 500 ఎకరాలు టార్గెట్​గా పెట్టింది. ‘‘అసైన్డ్ ల్యాండ్ ఇస్తరా.. సర్కార్ భూమిని చూపెడుతరా.. ఏం చేస్తారో తెలువదు. ప్రతి జిల్లా నుంచి 400–500 ఎకరాల ల్యాండ్ అమ్మకానికి పెట్టి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తేవాల్సిందే” అంటూ కలెక్టర్లకు సర్కార్ అల్టిమేటం జారీ చేసింది. రెండు, మూడు నెలల్లోనే ఈ పక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. ఇటీవల సీఎం కేసీఆర్​తో భేటీ అనంతరం సీఎస్ సోమేశ్​ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. లేదు, కాదు, కష్టం.. అనే మాటలు రావద్దని, అలాంటివేమైనా చెప్పాలనుకుంటే కలెక్టర్ పోస్ట్ కాకుండా ఇంకోటి చూసుకోవాలని హెచ్చరికలు కూడా చేసినట్లు కలెక్టర్లు వాపోతున్నారు. మూడు నెలల్లోపు రూ. 30 వేల కోట్లు భూముల అమ్మకం ద్వారానే తేవాలని టార్గెట్ పెట్టినట్లు చెప్తున్నారు. జిల్లాల్లో భూముల అమ్మకానికి ఈ నెల 24, జూన్​ 12 తేదీల్లో నోటిఫికేషన్లు ఇచ్చేలా ప్లాన్​ చేశారు. ఇలా 500 ఎకరాల చొప్పున తీస్తే అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు 15 వేల ఎకరాల భూములు అమ్మకానికి సిద్ధం కానున్నాయి. 

నిరుడే గైడ్ లైన్స్ జారీ 

సర్కార్ భూములను అమ్మేందుకు, పూలింగ్​కు ప్రభుత్వం నిరుడే గైడ్ లైన్స్ జారీ చేసింది. తర్వాత జిల్లాల్లో భూములను గుర్తించి అమ్మకానికి రెడీ చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో అమ్మకానికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, రంగారెడ్డి వంటి జిల్లాల్లో అసైన్డ్ ల్యాండ్స్ సేకరించి, వాటిని లే అవుట్స్ చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గతంలో రాష్ట్రంలో దాదాపు 21.36 లక్షల ఎకరాల అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూమిని వివిధ దశల్లో పంపిణీ చేశారు. ఇప్పుడు ఆ సాగు భూములను లాక్కుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. కలెక్టర్లకు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో మొండిగా ముందుకు వెళ్తున్నారు. సాగుకు పనికిరాని అసైన్డ్ ల్యాండ్స్ తీసుకుంటే ఏ ఇబ్బంది లేదని, సాగు చేస్తున్న భూములను తీసుకుని ఎంతోకొంత గజాల్లో జాగా ఇస్తమని చెప్తున్నారని బాధితులు వాపోతున్నారు.  

లిటిగేషన్లు క్లియర్ చెయ్యాలె 

ప్రభుత్వ భూములకు లీగల్ లిటిగేషన్, కబ్జా వంటి సమస్యలు ఉంటే క్లియర్​ చేయాలని కూడా సీఎస్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో భూమి హక్కులు ఏ శాఖవి? సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విస్తీర్ణం, ఎప్పటి నుంచి స్వాధీనంలో ఉంది? భూమిని కేటాయించారా? లేక సేకరణ కింద ఇచ్చారా? వంటి వివరాలు సేకరిస్తున్నారు. 

డిమాండ్ ఉన్న భూములపై ఫోకస్  

జిల్లాల్లో ప్రజా అవసరాలకు ఉపయోగపడని భూములను కలెక్టర్లు సేకరించాల్సి ఉంటుందని గతేడాది ఇచ్చిన గైడ్ లైన్స్ లో ప్రభుత్వం చెప్పింది. కనీసం వెయ్యి ఎకరాలకు తగ్గకుండా ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ సిద్ధం చేయాలని ఆదేశించింది. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు సర్కార్ కు అప్పులు కూడా పుట్టకపోవడంతో భూముల అమ్మకంపైనే ఆధారపడుతోంది. దీంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధరలను బట్టి ఉపయోగంలో ఉన్న భూములను వేలం వేస్తున్నారు. గుర్తించిన భూములను వేలానికి ముందే లేఔట్లుగా మార్చి టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా అన్ని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్​లో రూ.60–70 లక్షలు వస్తాయని చెప్తూ అసైన్డ్ ల్యాండ్స్​ను ప్రభుత్వం తిరిగి తీసుకుంటోంది. నేషనల్ హైవేలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాల కోసం రెవెన్యూ అధికారులు దస్త్రాలు తిరగేస్తున్నారు. ప్రభుత్వ భూములు లేనిచోట ప్రైవేటు భూములనూ గుర్తిస్తున్నారు. 

టార్గెట్ చేరుకోవాల్సిందేనన్న సీఎస్ 

ఇప్పటికే ఇష్టారీతిన అప్పులు చేయడంతో రాష్ట్రానికి కొత్త అప్పులు పుట్టడం లేదు. దీంతో ఇటీవల సీఎం కేసీఆర్​తో సీఎస్ భేటీ అయి నిధుల సమీకరణపై చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా భూములు అమ్మితేనే ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉండటంతో అన్ని జిల్లాల్లో క్లియర్​గా ఉన్న భూముల అమ్మాలని, మిగతా భూములను గుర్తించాలని ఆదేశించారు. ఇలా భూములు అమ్మడం ద్వారా రూ.30 వేల కోట్లు రెండు, మూడు నెలల్లోనే సర్దుబాటు చేసేలా టార్గెట్ పెట్టుకున్నరు. ‘‘సీఎంకు ఎట్లయినా రూ. 30 వేల కోట్లు ఇస్తనని చెప్పిన. ఆ మొత్తం సమకూర్చాల్సిందే” అని ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎస్ తేల్చిచెప్పినట్లు తెలిసింది.