మహబూబ్‌నగర్‌లో గోదాములు అంతంతే.. వడ్లు ఎక్కడ పెట్టాలో ?

మహబూబ్‌నగర్‌లో గోదాములు అంతంతే.. వడ్లు ఎక్కడ పెట్టాలో ?
  • చాలీచాలని గోదాములతో అధికారులు పరేషాన్

నాగర్​కర్నూల్/వనపర్తి,​ వెలుగు: వానాకాలం వడ్లను గోదాముల్లో నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గోదాముల కోసం అధికారులు పరేషాన్​ అవుతున్నారు. సీఎంఆర్​ పెండింగ్​ పంచాయితీ, కొత్త సన్న వడ్లకు బియ్యం ఇచ్చే విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనతో ఈసారి కొనుగోలు చేసిన వడ్లను గోదాముల్లో భద్రపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికారులు ఖాళీ గోదాముల వేటలో పడ్డారు. 

నాగర్​ కర్నూల్​ జిల్లాలో ఈ వానాకాలంలో 2.20 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. దీనికి తగ్గట్టుగా సివిల్​ సప్లై అధికారులు 244 కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రతిపాదించారు. ఇప్పటికే 26 కేంద్రాలు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు పూర్తి స్థాయిలో వడ్లు రావడానికి మరో 15 రోజులు పట్టే అవకాశం ఉంది. 

2.20 లక్షల మెట్రిక్​ టన్నుల్లో 40 వేల మెట్రిక్​ టన్నుల దొడ్డు వడ్లు రావచ్చని భావిస్తున్నారు. వీటిని నేరుగా రైస్​ మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన 1.80 లక్షల మెట్రిక్​ టన్నుల సన్న వడ్లను మాత్రం నేరుగా గోదాములకు తరలించాలని ఆదేశాలు వచ్చాయి.

గోదాములు అంతంతే..

నాగర్​ కర్నూల్​ జిల్లాలో మార్కెటింగ్​ డిపార్ట్​మెంట్​కు చెందిన 40 గోదాములు ఉన్నాయి. వీటి కెపాసిటీ 1.18 లక్షల మెట్రిక్​ టన్నులు కెపాసిటీ కాగా, ప్రస్తుతం 46.399 మెట్రిక్  టన్నుల వడ్లు నిల్వ ఉన్నాయి.

 71.699 వేల మెట్రిక్​ టన్నుల మేరకు మాత్రమే వడ్లు నిల్వ చేసే అవకాశం ఉంది. పీఏసీఎస్​ గోదాములు ఉన్నా అవి ఫర్టిలైజర్, సీడ్స్,ఫెస్టిసైడ్స్​​నిల్వ చేసేందుకు మాత్రమే సరిపోతాయి. దీంతో సన్నవడ్లను జిల్లాలోని గోదాములకు తరలించిన అనంతరం ఉమ్మడి జిల్లాలోని సెంట్రల్,​ స్టేట్​ వేర్​ హౌజ్​​గోదాములకు తరలిస్తారని సమాచారం.

వనపర్తి జిల్లాలో..

వనపర్తి జిల్లాలో 2.25లక్షల టన్నులు సీఎంఆర్  పెండింగ్​లోనే ఉంది. వనపర్తి జిల్లాలో 172 రైస్  మిల్లులు ఉండగా, వీటిలో సీఎంఆర్​ బకాయి పడ్డ మిల్లర్లకు వడ్లు కేటాయించడం లేదు. ఈ ఏడాది1.84 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. ఇందులో 70శాతం సన్నాలే ఉన్నాయి. జిల్లాలో 4.50లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని, 4 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలో మార్కెటింగ్​ శాఖ ఆధ్వర్యంలో 60 వేల మెట్రిక్​ టన్నుల కెపాసిటీ ఉన్న గోదాములు ఉన్నాయి. మిగిలిన వడ్లను నిల్వ చేసేందుకు అవసరమైన గోదాములు, వాటి కెపాసిటీ, జిల్లాలో గోదాములు సరిపోకపోతే ఏం చేయాలనే విషయంపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టారు. ఇదిలాఉంటే వనపర్తి జిల్లాలో గోదాములకు కొరత లేదని జిల్లా మార్కెటింగ్​ ఆఫీసర్​ స్వర్ణ్​ సింగ్ తెలిపారు. వేరే వారికి ఇచ్చిన గోదాములను ఖాళీ చేయిస్తున్నాని చెప్పారు.