ఎములాడ రాజన్న టెంపుల్​ రోడ్డుకు మోక్షం

ఎములాడ రాజన్న టెంపుల్​ రోడ్డుకు మోక్షం
  • 80 ఫీట్లుగా విస్తరించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం 
  • భూ సేకరణకు నోటిఫికేషన్ రిలీజ్‌.. రూ. 47 కోట్ల నిధులు
  • త్వరలోనే పనులు షురూ చేయనున్న అధికారులు

వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న టెంపుల్‌ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం ఇరుకుగా ఉన్న టెంపుల్‌ రోడ్డును 80 ఫీట్లకు విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎన్నో ఏండ్లుగా ఉన్న ట్రాఫిక్‌ కష్టాలకు త్వరలోనే తీరనున్నాయి. అమరవీరుల స్థూపం నుంచి రాజన్న ప్రధాన ఆలయం వరకు రోడ్డును విస్తరించేందుకు ఇప్పటికే భూ సేకరణకు కలెక్టరేట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారు.  రూ.47కోట్లతో పనులు చేపట్టనున్నారు. 

 వేలాది మంది భక్తుల రాకతో రద్దీ

రాష్ట్ర నలుమూలల నుంచి రాజన్న ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. బస్టాండ్‌ కు వచ్చిన భక్తులు టెంపుల్‌కు చేరుకోవాలంటే ఇరుకు రోడ్లతో నరకం చూస్తుంటారు.  రోడ్లలో వందలాది వాహనాలతో తీవ్ర ట్రాఫిక్‌ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎన్నో ఇండ్ల కింద వేసిన రోడ్లు.. ఇరువైపులా ఇండ్లు, షాపులు ఉండడం, పెరిగిన భక్తుల రద్దీతో రోడ్డు మరింత రద్దీగా మారిపోయింది.  ఆది, సోమవారాల్లో ఆలయం ముందు నుంచి నడిచేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.

 కాగా.. తొలుత అమరవీరుల స్థూపం నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణకు జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ అథారిటీ నుంచి 80 ఫీట్లకు  పర్మిషన్ వచ్చింది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా సుమారు 243 ఇండ్లు, షాపులో కోల్పోతున్నాయి. రెండో విడతలో ఆలయం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు విస్తరణ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు టెంపుల్​ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో కొలతలు వేసి మార్కింగ్​ చేశారు. 

భూ సేకరణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం

టెంపుల్​రోడ్డు విస్తరణకు భూసేకరణ చేసేందుకు నోటిఫికేషన్​ఇచ్చాం. రూ.47కోట్లతో పనులు ప్రారంభిస్తాం. ఇండ్ల, షాపులు కోల్పోతుండగా.. ఎంత నష్టం జరుగుతుందనే దానిపై ,  రెండు నెలల పాటు భూసేకరణ చేసి పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తాం. నష్టపోయిన వారికి పరిహారం చెల్లించిన తర్వాత పనులు చేపడతాం. 

రాజేశ్వర్, వేములవాడ ఆర్డీవో ​