హైదరాబాద్, వెలుగు: జూబ్లీహాల్ లో కొనసాగుతున్న కౌన్సిల్.. అసెంబ్లీ బిల్డింగులోకి షిఫ్ట్ కానుంది. మూడు నెలల్లో అసెంబ్లీ బిల్డింగ్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆగాఖాన్ ట్రస్టును ప్రభుత్వం ఆదేశించింది. అసెంబ్లీ బిల్డింగ్ ను రూ.49 కోట్లతో ఆగాఖాన్ ట్రస్ట్ పునరుద్ధరిస్తున్నది. ఈ పనులపై మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విప్ లు ఆది శ్రీనివాస్, రాంచంద్రునాయక్.. ఆగాఖాన్ ట్రస్ట్ ప్రతినిధులు, ఆర్అండ్ బీ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీని అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ‘‘పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఉండేలా మార్పులు చేస్తున్నాం. అక్కడి లాగే సెంట్రల్ హాల్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికల్స్ లో వెళ్లాల్సి వస్తున్నది. ఒకే దగ్గర ఉంటే టైమ్ సేవ్ అవుతుంది” అని చెప్పారు. ఫిబ్రవరి వరకు పనులు పూర్తి చేయాలని, చారిత్రక వైభవం చెక్కుచెదరకుండా సర్వాంగ సుందరంగా బిల్డింగ్ ను తీర్చిదిద్దాలని ఆగాఖాన్ ట్రస్టు ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం టెండర్లు పిలవాలని.. పనులను పర్యవేక్షించేందుకు ఎస్ఈ స్థాయి అధికారిని నియమించాలని ఆర్అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనను ఆదేశించారు. ఆగాఖాన్ ట్రస్ట్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ. 2 కోట్ల బిల్స్ ను మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావును ఫోన్ లో కోరారు. పార్కింగ్ ఫెసిలిటీతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి రూమ్స్ నిర్మించాలని అధికారులకు సూచించారు.