భద్రాచలం, వెలుగు: సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం కొన్ని క్వారీలను కేటాయించింది. గోదావరిలో పూడికతీత పేరుతో సర్కారు కాంట్రాక్టర్కు12,99,600 క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకోమని పర్మిషన్ఇచ్చింది. అయితే కాంట్రాక్టర్ మాత్రం కేటాయించిన చోట కాకుండా బ్యారేజీ నిర్మాణానికి దిగువన తవ్వుతున్నారు. దీన్ని అడిగేవారే లేకుండాపోయారు. కనీసం నిబంధనలను కూడా పాటించడం లేదు. డీసిల్టేషన్(పూడికతీత) పేరుతో గోదావరిలో ఇసుక తవ్వుకునేందుకు పర్యావరణ నిబంధనలను ఖాతరు చేయకుండా పర్మిషన్ఇవ్వడం గమనార్హం. గోదావరిలో పూడికతీతపై ఎలాంటి అధ్యయనం చేయకుండానే సర్కారు ఇలా అడ్డదారిలో కాంట్రాక్టర్కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి.
గత నివేదికలను కాదని..
గతంలో అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సమయంలోనూ గోదావరిలో పూడికతీత పేరిట సర్కారు ఇసుక తవ్వకాలకు అనుమతినిచ్చింది. దీనిపై రేలా అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జీటీని ఆశ్రయించింది. ఐఐటీ రూర్కెలా, ఖరగ్ పూర్ నుంచి వచ్చిన నిపుణులు, మరికొందరు పొల్యూషన్కంట్రోలు బోర్డు సైంటిస్టులు దీనిపై అధ్యయనం చేసి పూడికతీత పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతుందని ఎన్జీటీకి నివేదిక ఇచ్చారు. అసలు కట్టని బ్యారేజీలో పూడిక ఎక్కడిది..? అనే ప్రశ్న కూడా లేవనెత్తారు. ఇప్పుడు సీతమ్మసాగర్ బ్యారేజీ కట్టక ముందే గోదావరిలో పూడికతీత పేరుతో ఇసుక తవ్వకాలు జరపడం ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు అంటున్నారు.
ఈ విధంగా లోతుగా ఎక్కడ పడితే అక్కడ లోతుగా ఇసుకను తవ్వడం ద్వారా వరదల ప్రమాదం పొంచి ఉంటుంది. భూగర్భ జలాలు తగ్గిపోతాయి. నీరు నిల్వ ఉండే సామర్థ్యం తగ్గి ఎండిపోయే అవకాశం ఉంది. ప్రవాహంలో ఇసుక మేటలు ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని వారు చెబుతున్నారు. అయినా గత నివేదికలను తోసిరాజని సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన ఇసుక కోసం ఎగువ భాగంలో తవ్వుకునేందుకు డీసిల్టేషన్ పేరుతో ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇచ్చారు. అయితే ఇసుక తవ్వకాలకు పర్మిషన్లు ఇచ్చే సమయంలో సరైన అధ్యయనం జరగలేదనేది పర్యావరణవేత్తల ఆరోపణ.
పర్మిషన్లు ఇచ్చిందిక్కడ..!
సీతమ్మసాగర్బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన ఇసుకను మణుగూరు మండలంలోని చినరావిగూడెంలో1.80లక్షల క్యూబిక్మీటర్లు, మణుగూరులో1,35,200, రామానుజవరంలో 2,04,800, చర్ల మండలంలోని గోదావరి-తోపాటు తాలిపేరు నదులు కలిసే చోట ప్రాంతం జెట్టిగూడెంలో 2,04,800, చింతకుంటలో 2,04,800, గొమ్ముగూడెంలో 2.80లక్షలు, తేగడలో 90వేల క్యూబిక్ మీటర్ల చొప్పున తెచ్చుకోవచ్చని పర్మిషన్లు ఇచ్చారు. ఇక్కడ నుంచి తవ్వుకుని లారీల ద్వారా తెచ్చుకుని వాడుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఎగువన కాకుండా బ్యారేజీ నిర్మాణానికి దిగువన ఇసుకను తవ్వి అక్కడిక్కడే వినియోగించుకుంటున్నారు. రవాణా, లోడింగ్ఖర్చులు మిగుల్చుకునేందుకే నిబంధనలను పక్కనపెట్టి అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నట్లుగా స్పష్టం అవుతోంది. కాంట్రాక్టర్ స్వార్థం కారణంగా పర్యావరణ సమతుల్యతకు విఘాతం ఏర్పడుతోంది. దీనిని అరికట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.