- వెరిఫికేషన్‌కు ఇతర శాఖల అధికారుల నియామకం
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 87 వేల దరఖాస్తులకు మోక్షం
- లబ్ధిదారుల సందేహాలకు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు
ఆదిలాబాద్, వెలుగు: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం ప్రక్రియను సర్కార్ వేగవంతం చేసింది. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. మూడు నెలల్లో దరఖాస్తులు పరిశీలించి క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రక్రియ ముందుకు కదిలింది. 2020 ఆగస్టు 26లోపు రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా జరిగిన నాన్‌లే అవుట్ వెంచర్లు, ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ వర్తింపజేయనున్నట్లు అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల నుంచి దరఖాస్తులు చేసుకున్నారు.
2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్31 వరకు రెండు నెలలపాటు ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 87 వేల దరఖాస్తులకు మోక్షం కలగనుంది. అప్పట్లో కోర్టు కేసులతో ప్రక్రియ ఆగిపోగా.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు నెలల్లోనే పరిష్కరించనున్న నేపథ్యంలో ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇతర శాఖల అధికారులను నియమించుకోవాలని ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది.
క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్..
ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుదారుల్లో ఉన్న సందేహాలు తీర్చి.. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల మున్సిపల్ ఆఫీసులు, కలెక్టరేట్లలో వీటిని ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసేందుకు మున్సిపల్ అధికారులతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించుకోనున్నారు. దీనికి సంబంధించి సోమవారం రాష్ట్ర శాఖ అధికారులు జిల్లా, మున్సిపల్ అధికారులతో రివ్యూ నిర్వహించి సూచనలు చేశారు.
దరఖాస్తుల సమయంలో పూర్తి వివరాలు అందించని వారికి సైతం అన్ని పత్రాలు సమర్పించేందుకు మరో అవకాశం కల్పించింది. అన్ని విధాలుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మూడు శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. పరిశీలనలో చూడాల్సిన అంశాలపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో సేల్ డీడ్ ఈసీ, మార్కెట్ వాల్యూ ధ్రువీకరణ పత్రం, లేఅవుట్ కాపీ వంటి డాక్యుమెంట్స్‌ను ఇవ్వని వారు.. ఇప్పడు వాటిని అప్లోడ్ చేసేందుకు అవకాశమిచ్చింది.
ఆరు స్పెషల్ టీమ్‌లు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో భాగంగా స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఆరు టీమ్‌లు ఏర్పాటు చేసి ఒక్కో టీమ్‌లో ఒక రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారిని నియమించనున్నారు. ఈ ముగ్గురు ఒకేసారి దరఖాస్తుదారుల సైట్ కు వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక యాప్ ను సైతం రూపొందించారు. ఎల్ వన్ లాగిన్ ఓపెన్ చేసి డీటైల్స్ చెక్ చేయాల్సి ఉంటుంది.
అందులోని డీటైల్స్ ను బట్టి దరఖాస్తుదారుడి వివరాలు చెక్ చేస్తారు. ఈ ముగ్గురు ఆఫీసర్లలో ఒక్కరు లేకపోయినా వెరిఫికేషన్ ఆగిపోతుంది. పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీ మెంబర్ గా ఉంటారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ఎలా వినియోగించాలనే దానిపై వీరికి అవగాహన కల్పించనున్నారు. మరో రెండు రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్ ను ప్రారంభించనున్నట్లు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ వెల్లడించారు.