- రూ.158 కోట్లతో నాలా అభివృద్ధికి ప్లాన్
- పనులు వెంటనే మొదలుపెట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశం
- రూ.60 కోట్లతో వడ్డేపల్లి చెరువు నుంచి గోపాలపూర్ ఊర చెరువు వరకు డ్రైన్
హనుమకొండ, వెలుగు: గ్రేటర్లో ముంపు సమస్యపై సర్కారు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హనుమకొండలోని నయీంనగర్ నాలా పనులు నడుస్తుండగా, వరంగల్లో ముంపునకు కారణమవుతున్న బొందివాగు నాలా అభివృద్ధికి కూడా లైన్ క్లియర్ అయింది. ఆక్రమణలతో, పూడిక నిండడంతో నాలా పరివాహక కాలనీలు వరదపోటుకు గురవుతున్నాయి. దీంతో బొందివాగు పనులు ప్రారంభించాల్సిందిగా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ ఆఫీసర్లను ఆదేశించారు. వరద నీళ్లు కాలనీల్లోకి రాకుండా ఎర్త్ వర్క్ స్టార్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. మొత్తంగా వరంగల్ నగరంలో వరద నివారణకు దాదాపు రూ.508 కోట్లతో పనులు చేపడుతుండగా, తొందర్లోనే ఓరుగల్లు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది.
బొందివాగుకు మోక్షం..
నగరంలో బొందివాగు, భద్రకాళి, నయీంనగర్ నాలాలు ప్రధానమైనవి. ఈ నాలాలు ఆక్రమణలతో చాలా వరకు కుచించుకుపోయాయి. దీంతో 2020లో కురిసిన వర్షాలకు నాలాలు ఉప్పొంగి వరంగల్ నగరం నీట మునిగింది. దీంతోనే గ్రేటర్ వరంగల్ అధికారులు గత ప్రభుత్వ హయాంలోనే నాలాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినా.. ఆమోదం లభించక పనులన్నీ పెండింగ్ పడిపోయాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరంగల్ వరద ముంపుపై సీరియస్ ఫోకస్ పెట్టింది.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో నయీంనగర్ నాలా డెవలప్ మెంట్కు శ్రీకారం చుట్టగా, మార్చి 10న స్థానిక మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర నాయకులు బొందివాగు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.158 కోట్లతో పనులు చేపట్టేందుకు రెడీ కాగా ఆ తరువాత ఎంపీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో బొందివాగు పనులకు బ్రేకులు పడ్డాయి.
కానీ సమస్య తీవ్రత దృష్ట్యా ఇక్కడి ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. కానీ టెండర్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో పనులు మొదలు కాలేదు. రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ జీడబ్ల్యూఎంసీ, ఇరిగేషన్, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో మొన్న రివ్యూ నిర్వహించారు. ముంపు సమస్యను తీవ్రంగా పరిగణించి వెంటనే పనులు చేపట్టాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అగ్రీమెంట్ ప్రక్రియ వెంటనే పూర్తి చేసి, వర్క్స్ స్టార్ట్ చేయాలని సూచించడంతో వరంగల్ లో ముంపునకు కారణమవుతున్న బొందివాగు నాలాకు ఎట్టకేలకు మోక్షం కలిగినట్లయ్యింది.
20 మీటర్ల మేర విస్తరణ!
తిమ్మాపూర్, కొండపర్తి, అమ్మవారిపేట, భట్టుపల్లి, రంగశాయిపేట చెరువుల నుంచి వచ్చే వరదంతా బొందివాగు గుండానే ప్రవహిస్తుంటుంది. ఉర్సు రంగ సముద్రం నుంచి దాదాపు 2.5 కిలోమీటర్లు ఉండే ఈ నాలా చుట్టుపక్కల ఆక్రమణల వల్ల కుచించుకుపోయింది. దీంతో ఆ పక్కనే ఉన్న సాయినగర్, సంతోషిమాత కాలనీ, బృందావన కాలనీ, ఎన్టీఆర్ నగర్, బీఆర్నగర్ కాలనీలన్నీ వర్షాలు పడినప్పుడల్లా మునుగుతున్నాయి.
కాగా బొందివాగు నాలాను భద్రకాళి చెరువు వరకు 20 మీటర్ల మేర విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. పైనుంచి వచ్చే వరదను నియంత్రించడానికి రామన్నపేట, గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలో రెండుచోట్ల ఇన్ ఫ్లో రెగ్యులేటర్లు, అలంకార్ వైపు ఔట్ ఫ్లో రెగ్యులేటర్, పద్మాక్షి టెంపుల్ వైపు మరో ఇన్ ఫ్లో రెగ్యులేటర్ ఏర్పాటు చేయనున్నారు. నాలా పొడవునా ప్రొటెక్షన్ వాల్స్ కూడా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు.
అదనంగా మరో రూ.260కోట్లు..
రూ.90 కోట్లతో ఇప్పటికే నయీంనగర్ నాలా పనులు నడుస్తుండగా, రూ.158 కోట్లతో బొందివాగు వర్క్స్ కూడా తొందర్లోనే ప్రారంభం కానున్నాయి. వీటికి అదనంగా అవసరమైతే మరిన్ని పనులు ప్రతిపాదించాలని ఆఫీసర్లకు మంత్రి సూచించారు. దీంతో గ్రేటర్, ఇరిగేషన్ ఆఫీసర్లు భద్రకాళి నాలాకు కొనసాగింపుగా పోతన రోడ్డు నుంచి అలంకార్, గంగా గార్డెన్స్, పెద్దమ్మగడ్డ మీదుగా కాకతీయ కెనాల్ వరకు నాలా డెవలప్ మెంట్ పనులకు ప్రతిపాదనలు పెట్టారు.
దాదాపు రూ.200 కోట్లు నాలా డెవలప్ మెంట్ అవసరం అవుతాయని అంచనా వేశారు. దీంతోనే ఆ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని, సీఎం దృష్టికి తీసుకెళ్లి అప్రూవల్ తెచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మరో రూ.60 కోట్లతో వడ్డేపల్లి చెరువు నుంచి గోపాలపూర్ ఊర చెరువు వరకు డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలకు కూడా రెడీ చేస్తున్నారు. అనుకున్నట్టుగా ఆ పనులన్నీ పూర్తయితే వరంగల్ నగరంలో వరద ముప్పు తొలగిపోనుంది.