- వివిధ పనుల కోసం టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.100కోట్లు రిలీజ్..
- వీటిలో రోడ్ల విస్తరణకేరూ.30 కోట్లు
- ఇప్పటికే మార్కింగ్పనులు షురూ
- అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపునకు చర్యలు
గోదావరిఖని, వెలుగు:రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మినగర్, కళ్యాణ్‌నగర్, మార్కండేయకాలనీ, గణేశ్ నగర్, తదితర ప్రాంతాలలో రోడ్ల విస్తరణకు మోక్షం లభించింది. ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు చేసేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో మార్కింగ్ మొదలు పెట్టారు.
ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన మేరకు కొలతలు పెట్టి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. రోడ్ల విస్తరణ పూర్తయితే మార్కెట్‌తోపాటు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. టీయూఎఫ్‌ఐడీసీ స్కీమ్ కింద విడుదలైన రూ.100 కోట్లను ఈ పనుల కోసం కేటాయించగా.. వీటిలో కేవలం రోడ్ల విస్తరణకే రూ.30 కోట్లు కేటాయించనున్నారు.
30 నుంచి 60 ఫీట్ల వరకు విస్తరణ...
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు కోసం సెప్టెంబర్11న నిర్వహించిన కౌన్సిల్ మీటింగ్‌లో తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఓల్డ్ అశోక్ టాకీస్ నుంచి సాయి జ్యువెల్లరీ వరకు, మార్కండేయకాలనీ గణేశ్‌నగర్ బోర్డు నుంచి విజయ పిల్లల హాస్పిటల్ వరకు, రీగల్ షూమార్ట్ నుంచి బాలాజీ స్వీట్ హౌస్ వరకు, కల్యాణ్‌నగర్ మెయిన్ రోడ్డు నుంచి ప్రాఫిట్ షూ మార్ట్ వరకు, స్వతంత్ర చౌక్ నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు, రీగల్ షూమార్ట్ జంక్షన్ విస్తరణ, అభివృద్ధి చేయడానికి నిర్ణయించగా, ఆ మేరకు పనులు మొదలు పెట్టారు.
రోడ్ల విస్తరణ ఆయా ప్రాంతాలను బట్టి 30 ఫీట్ల నుంచి 60 ఫీట్ల వరకు చేయనున్నారు. రోడ్ల విస్తరణతో పాటు డ్రైనేజీలు, ఇతర నిర్మాణల కోసం టీయూఎఫ్‌ఐడీసీ స్కీమ్ కింద విడుదలైన రూ.100 కోట్ల నిధులతో ఈ పనులు చేపట్టడానికి టెండర్లు చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మెయిన్ మార్కెట్ ఏరియాలో రోడ్ల విస్తరణ సమస్య కొన్నేళ్లుగా ఉండగా.. ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఎన్నికయ్యాక విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్న పలు సింగరేణి క్వార్టర్లను కూల్చివేశారు. ఓల్డ్ అశోక్ థియేటర్‌ను కూడా పూర్తిగా పడగొట్టారు. మొత్తంగా విస్తరణకు అడ్డుగా ఉన్న 72 సింగరేణి క్వార్టర్లు ఖాళీ చేసేలా వారికి అవగాహన కల్పించారు. తాజాగా మెయిన్ మార్కెట్ ఏరియాలో గల ఇరుకు రోడ్లను విస్తరించేందుకు మార్కింగ్ పనులు మొదలు పెట్టారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరామ్, ఇతర పరిశ్రమలున్నాయి. వీటిల్లో పనిచేసే ఆఫీసర్లు, ఉద్యోగులు, కార్మికులు వివిధ అవసరాలు, హాస్పిటళ్ల కోసం నిత్యం గోదావరిఖనిలోని లక్ష్మినగర్, కల్యాణ్‌నగర్, అశోక్‌నగర్, మేదరిబస్తి, తదితర ప్రాంతాలకు రావాల్సి ఉంటుంది. అయితే వారు తీసుకువచ్చిన వాహనాలను రోడ్డుపై నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు దొరకని పరిస్థితి. దూర ప్రాంతాలలో తమ వాహనాలను నిలిపి నడిచి వస్తుంటారు. అలాగే హాస్పిటళ్లకు రోగులు రావాలన్నా, ఇక్కడి నుంచి రోగులు కరీంనగర్, హైదరాబాద్తరలించాలన్నా అంబులెన్స్‌లకు కూడా దారి దొరకదు. రోడ్ల విస్తరణతో ఈ సమస్యలకు చెక్ పడనుంది.