కొత్తగా మరో 10 వేల ఇంజినీరింగ్ సీట్లు 

కొత్తగా మరో 10 వేల ఇంజినీరింగ్ సీట్లు 

హైదరాబాద్, వెలుగు : ఇంజినీరింగ్ కోర్సుల్లో సుమారు పదివేల కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 7,024 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. శనివారం నుంచి ఎప్​సెట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలు కానున్నది. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో తాజాగా పెరిగిన వాటితో కలిపి మొత్తం 1,11,480 సీట్లున్నాయి. వీటిలో 70 శాతం కన్వీనర్ కోటా కింద, 30 శాతం మేనేజ్​మెంట్ కోటా కింద భర్తీ చేయనున్నారు.

కాగా, ఎప్ సెట్ ఫస్ట్ ఫేజ్​లో కన్వీనర్ కోటాలో 78,694 సీట్లలో 75,200 సీట్లు నిండిపోయాయి. ఈ క్రమంలో సెకండ్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఆప్షన్లు పెట్టుకున్న 20వేల మంది స్టూడెంట్లకు సీట్లు రాలేవు. కాగా, 3,494 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం శుక్రవారం కొత్తగా సుమారు 10వేలకు పైగా సీట్లకు అనుమతి ఇచ్చింది.

వీటిలో ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చిన కొత్త సీట్లతో పాటు గ్రూపుల కన్వర్షన్​ సీట్లూ ఉన్నాయి. గతేడాది అర్బన్ ఏరియాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 90శాతానికి పైగా, రూరల్ లో 50శాతానికి పైగా సీట్లు నిండిన కాలేజీలకు మాత్రమే కొత్త సీట్లకు సర్కారు పర్మిషన్ ఇచ్చింది. అయితే, కొత్తగా అనుమతిచ్చిన సీట్లన్నీ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ సీట్లే ఉండటం గమనార్హం.

ఫస్ట్​ ఫేజ్​లో 75,200 సీట్లు అలాట్

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమై ఆదివారంతో ముగుస్తుంది. 29,777 సీట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఫస్ట్ ఫేజ్​లో 75,200 మందికి సీట్లు అలాట్ కాగా, దీంట్లో 55,941 మంది మాత్రమే ఫీజు చెల్లించి, ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేశారు. 22,753 మంది సీట్లను వదులుకున్నారు. దీంతో కొత్త సీట్లు 7,024తో కలిసి.. సెకండ్ ఫేజ్​కు 29,777 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఈనెల 31లోపు చేయనున్నారు.

గుట్టుగా జీవోలు

ఇంజినీరింగ్ సీట్లకు సంబంధించిన సర్కారు ఇచ్చే జీవోలన్నీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు బయటకు రిలీజ్ చేయడం లేదు. ఏ కాలేజీలో ఎన్ని సీట్లు పెరిగాయనే వివరాలూ వెల్లడించడం లేదు. ఫస్ట్ ఫేజ్​లో కన్వీనర్ కోటాలో 78,694 సీట్లకు అనుమతివ్వగా, దానికి సంబంధించిన జీవో బయటకు రాలేదు. దీంతో కొత్తగా పర్మిషన్ ఇచ్చిన రెండు వేల సీట్ల వివరాలూ బహిర్గతం చేయలేదు. తాజాగా కన్వీనర్ కోటాలో 7వేల సీట్లకు సర్కారు అనుమతి ఇచ్చింది. దీంట్లో కన్వర్షన్ సీట్లు ఎన్ని? కొత్త అనుమతి ఇచ్చింది ఎన్ని? ఏ కోర్సులో పెరిగాయనే వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు గుట్టుగా 
ఉంచుతున్నారు.