నవంబర్18నుంచి కొత్త ఈవీ పాలసీ అమలు

  • ఎలక్ట్రిక్​ వెహికల్స్​కు రోడ్డు, రిజిస్ట్రేషన్​ ట్యాక్సుల్లో 100% మినహాయింపు
  • లిస్టులో బైక్​లు, కార్లు, ఆటోలు, లైట్​ గూడ్స్​ వాహనాలు
  • 2026 డిసెంబర్​ 31 వరకుపాలసీ అమలు
  • ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ స్పెషల్​ సీఎస్​
  • త్వరలో హైదరాబాద్​ మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులు: మంత్రి పొన్నం

హైదరాబాద్​, వెలుగు:రాష్ట్రంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త  ఎలక్ట్రిక్​ వెహికల్స్​(ఈవీ) పాలసీని తీసుకువచ్చింది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇది అమలులోకి రానుంది. ఈ మేరకు రవాణా శాఖ స్పెషల్​ సీఎస్ వికాస్​రాజ్​ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఈవీ పాలసీ 2026 డిసెంబర్​ చివరి వరకు అమల్లో ఉంటుంది. 

పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు రోడ్డు ట్యాక్స్​, రిజిస్ట్రేషన్​ ట్యాక్స్​లో వంద శాతం పన్ను మినహాయింపు ఇస్తారు.ఈ లిస్టులో టూవీలర్స్,  ఆటోలు, కార్లు (ఇండివిజువల్), టాక్సీ కోసం వాడే  కమర్షియల్​ ఫోర్​ వీలర్స్​, లైట్ గూడ్స్​ వెహికల్స్​(టాటా ఏసీ లాంటివి), ట్రాక్టర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్​ వాహనాలై ఉంటే.. వాటికి రోడ్డు, రిజిస్ట్రేషన్​ ట్యాక్స్​లలో వంద శాతం పన్ను మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. 

ఇక ఆర్టీసీ సంస్థ ఈవీ బస్సులను కొనుగోలు చేస్తే వాటికి కూడా లైఫ్​ టైం వంద శాతం ట్యాక్స్​ ఫ్రీ  ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్​ కంపెనీలు తమ సిబ్బంది ట్రాన్స్​పోర్ట్​ కోసం ఈవీ బస్సులు కొంటే వాటికి కూడా ట్యాక్స్​ ఫ్రీ అమలవుతుంది. గత ప్రభుత్వం 2020–30 ఈవీ పాలసీని తీసుకువచ్చింది. అయితే దాంట్లో ఈవీ వాహనాల కొనుగోళ్ల విషయంలో పరిమితులు విధించింది. 

దీంతో ఎలక్ట్రిక్​ వెహికల్స్​ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. అదే సమయంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్​ వంటి రాష్ట్రాల్లో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్​ వెహికల్స్​ను ఇంకింత ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం నిర్ణయించి.. జీవో 41 కింద కొత్త ఈవీ పాలసీని తెచ్చింది. 

ఢిల్లీలాంటి పరిస్థితి రావొద్దనే..

ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్​లో కాలుష్యం పెరగకుండా ఉండేందుకే కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. రవాణా శాఖకు కొత్త లోగో తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. సెక్రటేరియెట్​లో ఆదివారం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్  పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. 

హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. ఢిల్లీలా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని వివరించారు.  హైదరాబాద్ లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.  త్వరలోనే సిటీ లో మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులు నడుస్తాయని, కొంత ఇన్​ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉందన్నారు. 

15 ఏండ్లు దాటిన వాహనాల కోసం  స్క్రాప్ పాలసీ తెచ్చామని.. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ తెస్తున్నామని వివరించారు. దేశంలో రోజుకు లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో  చనిపోతున్నారని.. తెలంగాణలో రోజుకు 20 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  ఎలక్ట్రిక్ వాహనాలకు తగ్గట్టు చార్జింగ్​ కంపెనీలు చొరవ తీసుకొని చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ సూచించారు.  

ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని.. రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయని చెప్పారు. రవాణా శాఖ ప్రమోషన్ల విషయంలోనూ ప్రాసెస్​ నడుస్తున్నదని.. అన్ని క్లియర్ చేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో స్పెషల్​ సీఎస్​ వికాస్​రాజ్​, రవాణ శాఖ కమిషనర్​ జ్యోతి బుద్ధ ప్రకాశ్​ ఇతర అధికారులు పాల్గొన్నారు.