- తొలగిన అడ్డంకులు.. రూ.13 కోట్లు విడుదల
- కొత్త సర్కారు చొరవతో పనుల ముందడుగు
- పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్కూ మోక్షం
- రూ.58.95 కోట్లు మంజూరు
- రెండు పథకాలతో 22 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో ఏండ్ల కాలంగా పెండింగ్లో బ్యారేజీ పనులకు మోక్షం లభించింది. మామడ మండలంలోని సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులు, లోకేశ్వరం మండలంలోని పిప్రి ఎత్తి పోతల పథకం పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న సదర్మాట్ బ్యారేజీ ఎలక్ట్రిఫికేషన్ పనుల కోసం రూ.13 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నిధులు మంజూరు కావడంతో గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యారేజీ పనులు పూర్తయితే నిర్మల్ జిల్లాలో 13 వేలు, జగిత్యాల జిల్లాలో 5 వేల ఎకరాలకు అదనంగా సాగు నీరందనుంది. అలాగే పిప్రి ఎత్తిపోతల పథకంతోమరో 4 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలు ఏర్పడతాయి. ఏడాదిలోగా ఈ రెండు పథకాల పనులు పూర్తయితే నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 22 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందనుంది.
రూ.676 కోట్లతో సదర్ మాట్ నిర్మాణం
13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో జిల్లాలోని మామడ మండలం పొనకల్ వద్ద సదర్ మాట్ బ్యారేజీ నిర్మిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.676.50 కోట్లతో నిర్మాణ అంచనాలు రూపొందించింది. ఇందులో నుంచి రూ.398 కోట్లు బ్యారేజీ నిర్మాణ పనుల కోసం కేటాయించగా.. ఇప్పటివరకు రూ.320 కోట్లతో పనులు చేపట్టారు.
అలాగే భూసేకరణకు రూ.120 కోట్లు ఖర్చు చేశారు. బ్యారేజీకి సంబంధించి ఇప్పటికే 55 గేట్లను నిర్మించి, వాటిని బిగించే ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఎలక్ట్రిఫికేషన్ పనులకు నిధులు విడుదల కాకపోవడంతో ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. ఎలక్ట్రిఫికేషన్ కోసం అప్పటి ప్రభుత్వానికి అధికారులు పంపిన ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. కాగా కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఇటీవలే ఆ పనుల కోసం రూ.13 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాబోయే అక్టోబర్ లోగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎట్టకేలకు పిప్రికి మోక్షం
పిప్రి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 2021లో అప్పటి ప్రభుత్వం అంకురార్పణ చేసి వదిలేసింది. రూ.77 కోట్లకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు పంపగా రూ.58.95 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందే తప్పా నిధులు విడుదల చేయలేదు. ఆ ప్రకటన కేవలం కాగితాలకే పరిమితమైపోయింది. ఫలితంగా పనులు మొదలుకాలేదు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పిప్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించి నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. సదర్ మాట్, పిప్రి ఎత్తిపోతల పథకాల పనులను వెంటనే చేపట్టి పూర్తిచేయాలని సీఎం ప్రకటించడంతో ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ రెండు ప్రాజెక్టుల సమస్యకు పరిష్కారం లభించింది