వెలుగు ఓపెన్ పేజ్ : సమ్మెలు చేయడం నేరమా!

ఏప్రిల్14 న తెలంగాణలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. పక్షం రోజుల తేడాలో తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరును కూడా నామకరణం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారేమోనని తెలంగాణ సమాజం ఆశించింది. సెక్రటేరియట్​ప్రారంభం తర్వాత 8 రోజులకే అంబేడ్కర్ ఆశయాలకు విరుద్ధంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సమ్మె చేసే హక్కు లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.19(1) ఆర్టికల్ ప్రకారం సంస్థలను, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కులను రాజ్యాంగం కల్పించిన విషయం వాస్తవమే కాదా? సమ్మె హక్కును ఎందుకు గౌరవించరు?

పరీక్షలో నెగ్గి విధుల్లో చేరారు

రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తున్న వేలాది మంది ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలో మెరిట్ మార్కులు సాధించి నియామకమై విధుల్లో చేరారు. ఔట్ సోర్సింగ్ సంస్థల ద్వారా అక్రమ పద్ధతిలో పైరవీలు చేసుకొని పైసలు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నవారు కాదు. జేపీఎస్​లుగా నియమితులైన వారిలో 70 శాతానికి పైగా గ్రామీణ నేపథ్యం కలిగిన కుటుంబాల నుంచి వచ్చినవారే. వీరు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేస్తున్న విషయం ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదో అర్థమైతలేదు.

నచ్చినట్లుగా జీవోల సవరణ

మూడేండ్ల ప్రొబిషనరీ పీరియడ్ అనంతరం జూనియర్​పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్​చేస్తామని ప్రభుత్వం మొదలు చెప్పింది. మూడేండ్ల అనంతరం కూడా ప్రొబిషనరి పీరియడ్ కాలం మరో ఏడాది పెంచింది. అయినా వారు ఓపిక పట్టారు. నాలుగేండ్ల కాలం పూర్తయిన తర్వాత కూడా రెగ్యులరైజ్​చేయకుంటే, ఎప్పుడు చేస్తారని అడగకూడదా? మీరు జారీ చేసిన జీవోలను మీకు అనుకూలంగా ఎన్ని సార్లైనా సవరించుకోవొచ్చా! ఉద్యోగికి ఆశలు, ఆత్మగౌరవం ఉండదా?  ప్రభుత్వ అవసరాల దృష్ట్యా నాలుగేండ్లుగా ప్రభుత్వంలో భాగమైన 9000 మందికిపైగా జూనియర్​పంచాయతీ కార్యదర్శులు సుమారు 50 రకాల పనులను సమర్థవంతంగా చక్కదిద్దుతున్నారు. వారి కృషి, సేవల ఫలితంగా ఈరోజు తెలంగాణ పంచాయతీలు, పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా అవార్డులు గెలుచుకుంటున్నాయి. అలాంటప్పుడు వారి సేవలకు  గుర్తింపు ఉండాలి.

ప్రభుత్వం నియామకాల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రొబిషన్​ పీరియడ్​ తర్వాత వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్​చేసి, సర్వీస్​నిబంధనలు రూపొందించి సర్వీస్​బుక్​పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవెన్సులు, హెల్త్​కార్డులు వర్తిస్తాయి. పీఆర్సీలు అమలవుతాయి. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మరణిస్తే కుటుంబంలో మరొకరికి ఉపాధి/ఉద్యోగం దొరుకుతుంది. తద్వారా వారికి రక్షణ, భరోసా, భద్రత దొరికి కుటుంబం ధైర్యంగా నిలబడగలుగుతుంది. ఇవి కల్పించకుండా భరోసా లేని భద్రత లేని ఉద్యోగాలను వారిని ఎంతకాలం చేయమంటారు? 

యూనియన్లపై ఉక్కుపాదమేనా..

స్వరాష్ట్రం కోసం ఆర్టీసీ సైరన్ నుంచి మొదలుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వరకు కదం తొక్కిన సంగతి మరోసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వరాష్ట్ర ఉద్యమంలో వీరి పాత్ర ఏమీ లేదా?  రాష్ట్రం వస్తే మరింత స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంటదనుకున్న చోట గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే సంఘమే లేకుండా చేసిన తీరు ఎలాంటి ఆదర్శమే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సంఘంగా ఏర్పడి సమ్మె చేస్తుంటే మీకు సంఘం పెట్టుకునే హక్కే లేదని తెగేసి చెపుతున్న పరిస్థితి బాధాకరం. విధుల్లో చేరకపోతే సీరియస్ గా ఉంటదని హెచ్చరికలు జారీ చేస్తున్న తీరు దారుణం. ఇది ప్రజాస్వామికమైన పద్ధతి కాదు.

ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు విధుల్లో లేక చాలా పనులు పెండింగులో పడుతున్నాయి. చెత్త సేకరణ దగ్గరి నుంచి.. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, జనన, మరణ ధ్రువపత్రాల జారీ లాంటి కీలక పనులు వెనకబడిపోతున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలి. వారు సమ్మె చేస్తున్నారన్న కోపంతో కాకుండా.. వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నామనే దృక్పథంతో జూనియర్​పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్​చేయాలి. అడగక ముందే పెద్ద మనుసుతో అన్నీ ఇచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి.. తమకూ న్యాయం చేస్తారన్న సెక్రటరీల ఆశలను అడియాసలు చేయొద్దు.

బెదిరింపులతో విధులు చేయిస్తరా?

హక్కుల కోసం ప్రశ్నించడం, సమ్మె చేయడం శ్రామికుడి/ఉద్యోగి హక్కు. దశల వారీగా వారి డిమాండ్లను విజ్ఞాపనలు, నిరసనల రూపంలో ప్రభుత్వం ముందు పెడుతూనే చట్ట పరిధికి లోబడే జేపీఎస్​లు సమ్మె నోటీసులు ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతోనైనా, యజమాన్యంతోనైనా కొట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించిందే కదా! ప్రభుత్వం కూడా బాధ్యతతో ఉద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ పలు ధపాలుగా చర్చలకు పిలిచి వారి డిమాండ్లు ఎప్పుడు పరిష్కరిస్తారో చర్చించవచ్చు. అలాకాకుండా వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, వారిని విభజిస్తూ సమ్మెను విచ్చినం చేయడానికి ప్రయత్నించడం అంబేద్కర్​ అడుగుజాడల్లో నడిచినట్లు ఎలా అవుతుంది? ప్రజాస్వామ్యం లో అసమ్మతిని సహించరా.! అంతా నియంతృత్వమేనా!

- పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక