పెద్దపల్లి జిల్లాలో బుద్ధవనం పరిరక్షణకు పైసా ఇవ్వని సర్కార్​

  • పెద్దపల్లి జిల్లాలో బుద్ధవనం పరిరక్షణకు పైసా ఇవ్వని సర్కార్​
  • 2018లోనే  ఫండ్స్​శాంక్షన్​ చేస్తామన్నరు 
  • పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపని లీడర్లు, ఆఫీసర్లు
  • కబ్జాకు గురవుతున్న బుద్ధవనం భూములు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో పర్యాటక ప్రాంతాలు, చారిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధిపై సర్కార్​ నిర్లక్ష్యం వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని పురాతన ఆనవాళ్లను గుర్తించి వాటిని  పర్యాటక కేంద్రాలుగా చేస్తామని సర్కార్​ప్రకటించింది. దీనిలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట, వడ్కాపూర్​ మధ్యనున్న బుద్ధవనాలను  పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సర్కార్​ ఫండ్స్​కేటాయిస్తామని చెప్పింది. ఇప్పటికీ నయాపైసా విడుదల చేయలేదు.  రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్ట, ఫణిగిరి(సూర్యాపేట), నేలకొండపల్లి(ఖమ్మం) బుద్ధవనాల పరిరక్షణకు ప్రభుత్వం ఫండ్స్​కేటాయిస్తామని చెప్పింది. అందుకనుగుణంగా ఆయా జిల్లాల్లో పనుల్లో కొంత పురోగతి ఉన్నా.. ధూళికట్టలోని బుద్ధవనం పరిరక్షణకు నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 

2018లోనే సర్కార్​ గ్రీన్​ సిగ్నల్​

తెలంగాణ సర్కార్​ ఏర్పాటయ్యాక పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూలికట్ట సమీపంలోని బౌద్ధస్తూపాన్ని ప్రభుత్వం గుర్తించి  పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది.  2018లో అప్పటి పెద్దపల్లి ఎంపీ సుమన్​, ఎమ్మెల్యే దాసరి మనోహర్​రెడ్డి బౌద్ధస్తూపాన్ని సందర్శించారు. బుద్ధవనం డెవలప్​మెంటు కోసం రూ.5 కోట్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. రిపేర్ల కోసం అప్పటికప్పుడు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

బౌద్ధస్తూపం చేరేందుకు రోడ్డే లేదు.. 

ధూళికట్ట, వడ్కాపూర్​ మధ్యలో ఉన్న బౌద్ధస్తూపం చూసేందుకు టూరిస్ట్ ‌‌లు, ఆర్కియాలజీ స్కాలర్స్​వస్తున్నారు. అయినా నేటికీ స్తూపం వరకు రోడ్డు వేయలేదు. ఇటీవల మట్టి రోడ్డు వేయించారు. ఆ రోడ్డుపై భారీ వాహనాలు వెళ్లడానికి అవకాశమే లేదు. ఇక్కడికి వస్తున్న టూరిస్ట్ ‌‌లు కిలోమీటర్ల పరిధిలో కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలం అక్కడకు పోవడం చాలా కష్టం, దారి మొత్తం బురదమయమవుతోంది. అలాగే ధూళికట్ట బుద్ధవనం మొత్తం భూమి 9 ఎకరాలు, బౌద్ధస్తూపం 19 గుంటల పరిధిలో ఉంటుందని ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్​చెప్తుంది. కానీ ఇప్పటికే బుద్ధవనానికి చెందిన చాలా భూమి కబ్జాకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. సర్కార్​ బుద్ధవనం భూమి చుట్టూ బౌండరీలు నిర్ణయించాలని డిమాండ్​చేస్తున్నారు. మరోవైపు ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు ముందుకు వచ్చి బుద్ధవనాలను డెవలప్​చేయాలని కోరుతున్నారు. 

చరిత్రను కాపాడుకోవాలి...

ధూళికట్ట, నేలకొండపల్లి(ఖమ్మం జిల్లా)లో ఉన్న బౌద్ధస్తూపాలు ఎంతో చరిత్ర కలిగినవి. వాటిని సర్కార్​ నిర్లక్ష్యం చేయొద్దు. జిల్లాలో ఉన్న ఎన్టీపీసీ, సింగరేణి లాంటి సంస్థలు ప్రభుత్వంతో సహకరించి ఇలాంటి చారిత్రక ఆధారాలను కాపాడే ప్రయత్నం చేయాలి. ధూళికట్ట బుద్దవనం డెవలప్​మెంటు కోసం సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు ముందుకు రావాలి.
- కుందారపు సతీశ్, ఆర్కియాలజీ స్కాలర్​, పెద్దపల్లి

బుద్ధవనం భూములను పరిరక్షించాలి 

ఎలిగేడు మండలం ధూలికట్ట బుద్ధవనం భూములను పరిరక్షించాలి. కబ్జా కాకుండా బౌండరీలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే కొంతభూమి కబ్జా అయినట్లు కన్పిస్తోంది. వెంటనే పర్యాటక శాఖ బుద్ధవనం భూముల పరిధిని గుర్తించి ఫెన్సింగ్​ఏర్పాటు చేయాలి. బుద్ధవనం డెవలప్​మెంటుకు కృషి చేయాలి.
- అడ్డగుంట శ్రీనివాస్​,  ఎలిగేడు