- ఏడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు అదర్ డ్యూటీ
- ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 7 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం అదర్ డ్యూటీ(ఓడీ) సౌకర్యం కల్పించింది. 2024 సంవత్సరానికి గానూ ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జీవోనెంబర్ 1014ను రిలీజ్ చేశారు. గతంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్యులుగా ఉన్న సంఘాలకు మాత్రమే ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది.
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీఓ), తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవో), తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్), ప్రొగ్రెసీవ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ), స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ), తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్), తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ తదితర ఏడు సంఘాలకు ఓడీ సౌకర్యం ఇస్తున్నట్టు ప్రకటించింది.
ఆయా సంఘాల్లోని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఓడీ ఫెసిలిటీ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుమారు 15 టీచర్ల సంఘాలకు ఓడీ ఫెసిలిటీ ఇచ్చింది. కనీసం గుర్తింపు లేని సంఘాలకు ఓడీ ఫెసిలిటీ ఇవ్వడంపై విమర్శలు వచ్చినా.. వాళ్లు పట్టించుకోలేదు. అయితే, కాంగ్రెస్ సర్కారు టీచర్ల సంఘాలను స్ర్టీమ్ లైన్ చేయాలని భావిస్తోంది.