గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ డెవలప్ మెంట్​పై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా మూసీ డెవలప్ మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైనా ఆరా తీసింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తుంది. రాబోవు ఆర్నెళ్లు, ఏడాదిలోపు పనులు, వచ్చే 5 ఏళ్ల పాటు చేయాల్సిన వర్క్స్ పైనా దృష్టి సారించింది. అదేవిధంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ కు నిధులు ఎలా సమకూర్చాలనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డో రోస్ రెండు రోజులుగా సెక్రటేరియట్ కు వెళ్తున్నారు. అక్కడ ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల్లో పూర్తి ప్లాన్ తయారు చేసి, ఆ తర్వాత డెవలప్ మెంట్ పనులపైనా దృష్టి పెట్టనుంది. వాటికి సంబంధించిన నిధులపై కూడా చర్చించినట్లు తెలిసింది. అవసరమైతే ప్రభుత్వం నిధులను ఇచ్చి వెంటనే పనులు పూర్తి చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి. 

 జీహెచ్ఎంసీ అధికారులతో రివ్యూ..
 

జీహెచ్ఎంసీలో చేపట్టాల్సిన పనులపై కూడా ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే వాటిపై జీహెచ్ఎంసీ  ఉన్నతాధికారులతో కమిషనర్ రోనాల్డ్ రోస్ సమీక్షించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే పనులకు కావలసిన నిధులు, ఏడాదిలో పూర్తయ్యే పనులకు అవసరమయ్యే  ఫండ్స్ కు సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. మౌలిక వసతుల అభివృద్ధి, జంక్షన్ల ఇంప్రూవ్ మెంట్, ట్రాఫిక్ కంట్రోల్ అంశాలపైనా ఇంజనీరింగ్ విభాగం చేపట్టాల్సిన పనులపై ప్లాన్ రూపొందించాలని స్పష్టంచేశారు. కొత్త పనులతో పాటు ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగం ప్రారంభించిన ప్రాజెక్టులు, మెయింటెనెన్స్ పనులకు కావలసిన నిధులపైనా చర్చించారు. సిటీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రీనరీ డెవలప్ మెంట్ పార్కు అభివృద్ధిపై డిస్కషన్ చేశారు. యూసీడీ, ఫైనాన్స్ విభాగం, రెవెన్యూ, శానిటేషన్, స్పోర్ట్స్, నాలా, లేక్స్ తదితర విభాగాల హెచ్ఓడీలు రూపొందించిన డ్రాఫ్ట్ లపై కూడా చర్చించారు. 

వరదలపైనా కూడా.. 

గ్రేటర్ సిటీలో వరదలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వరదల నివారణకు ఇదివరకు జీహెచ్ఎంసీ చేసిన పనులు, ప్రస్తుతం పెండింగ్ లో వాటిని వెంటనే పూర్తి చేసేందుకు తీసుకునే చర్యలపైనా కమిషనర్ దృష్టి పెట్టారు. ప్రధానంగా నాలాలు, బాక్స్ డ్రెయిన్, రిటైనింగ్ వాల్ తదితర పనులను కొద్దిరోజుల్లోనే కంప్లీట్ చేయనున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లను, ట్రాఫిక్ కంట్రోల్, అందుకు అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు తొలగింపుపై ట్రాన్స్ కో  సీఎండీ ముషారఫ్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డేవిడ్ డానియల్ తో రోనాల్డ్ రోస్ సమీక్షించారు. మొత్తంగా వర్షాలు కురిసినా కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని పనులు పూర్తి చేయడంపైనే ప్రస్తుతం జీహెచ్ఎంసీ బిజీగా ఉంది. ఇందుకు సంబంధించిన నిధులను ఎలా సేకరించాలనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు.