2037 నాటికి వన్ ట్రిలియన్ .. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం అంచనా 

2037 నాటికి వన్ ట్రిలియన్ .. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం అంచనా 
  • 2036 నాటికి రాష్ట్ర ఆదాయం రూ.12.34 లక్షల కోట్లు 
  • వచ్చే పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ టాప్ 
  • ‘తెలంగాణ గ్రోత్​ స్టోరీ.. ది రోడ్ టు వన్​ట్రిలియన్ రిపోర్టు’లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: 2037 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ కు చేరుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది. దేశ జీడీపీతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం టాప్​ప్లేస్​లో ఉందని తెలిపింది. ఫోర్త్ (ఫ్యూచర్) సిటీ నిర్మాణం, రీజినల్​రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్, అర్బన్, సెమీఅర్బన్​ఇండస్ట్రియల్ క్లస్టర్లు, మెట్రో రైలు కనెక్టివిటీ, యంగ్ ఇండియా స్కిల్​ యూనివర్సిటీ వంటివన్నీ తెలంగాణ గ్రోత్​ను మరింతగా పెంచనున్నాయని చెప్పింది. ‘

తెలంగాణ గ్రోత్​ స్టోరీ.. ది రోడ్ టు వన్​ట్రిలియన్’ పేరుతో గురువారం ఏఐ గ్లోబల్​సమిట్ లో ప్రభుత్వం రిపోర్టు రిలీజ్ చేసింది. రానున్న కొన్నేండ్లలో దేశంలో అనేక రంగాల్లో తెలంగాణ కీరోల్ పోషించనున్నట్టు అందులో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం రూ.2.39 లక్షల కోట్లు ఉండగా, 2036 నాటికి అది రూ.12.34 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపింది. దేశ జీడీపీలో ప్రస్తుతం తెలంగాణ వాటా 5 శాతం ఉండగా, 2037 నాటికి అది 10 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.  

పక్కా ప్రణాళిక..  

రాష్ట్రంలో ఉన్న వాతావరణం, సదుపాయాలు, లోకాస్ట్​లివింగ్​, ఐటీ, ఇండస్ర్టీలతో పాటు  ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఎకో ఫ్రెండ్లీ విధానాలు ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి. హైదరాబాద్​నుంచి నాగ్​పూర్, వరంగల్, పుణె, బెంగళూర్, శ్రీశైలం, విజయవాడకు హైవేలు, 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్, 347.6 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ రాష్ట్రానికి మణిహారం అవుతాయని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న 70 కిలోమీటర్ల మెట్రోను కూడా మరింత విస్తరిస్తున్నారు. తెలంగాణ నుంచి మచిలీపట్నంకు హైస్పీడ్​ఎక్స్​ప్రెస్​వే నిర్మాణ  ప్రతిపాదన, నల్గొండ జిల్లాలో డ్రైపోర్ట్ సిటీ ఏర్పాటు, నిజామాబాద్, మహబూబ్​నగర్, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త ఎయిర్​పోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ లో ఇప్పటికే ఉన్న ఎయిర్​పోర్ట్​లను పునరుద్ధరించాలనే ప్లాన్స్ డెవలప్​మెంట్​లో కీలకం కానున్నాయి.

నాగ్​పూర్–విజయవాడ ఎక్స్​ప్రెస్​ వే (405 కిలోమీటర్లు) 2027లో అందుబాటులోకి రానుంది. సనత్​ నగర్ లో ఇన్​ల్యాండ్​కంటైనర్ డిపో, అర్బన్, సెమీ అర్బన్​ క్లస్టర్ల ఏర్పాటు వంటివన్నీ అభివృద్ధికి కలిసివస్తాయని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రతిపాదిత ఫోర్త్​సిటీలో దాదాపు 14వేల ఎకరాల్లో ఏఐ సిటీ, హెల్త్​సిటీ, లైఫ్ సైన్సెస్​హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్​ అండ్​ యూనివర్సిటీ జోన్ తదితరాల ఏర్పాటు... మూసీ రివర్​ఫ్రంట్​డెవలప్​మెంట్ ప్రాజెక్టు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకం కానున్నాయని వెల్లడించారు. .

ఇదీ రోడ్ మ్యాప్..  

ప్రస్తుతం రాష్ట్ర జీఎస్​డీపీ 176 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏటా 12.5 శాతం గ్రోత్​ రేట్​ఉంటున్నది. రాష్ట్ర జీఎస్​డీపీని వన్ ట్రిలియన్​కు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకువెళ్తున్నది. వచ్చే నాలుగేండ్ల నుంచి ఆరేండ్లలో రాష్ట్ర జీఎస్ డీపీ డబుల్​ కానుంది. అంటే 2030  నాటికి 350 బిలియన్​డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2032 నాటికి 502 బిలియన్​డాలర్లకు, 2038–-39 నాటికి వన్ ట్రిలియన్​కు చేరుకుంటుందని రిపోర్టులో అంచనా వేశారు. అయితే అంతకంటే ఒక్క ఏడాది ముందే ఈ మార్క్​ను చేరాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 

స్టార్టప్​లకు కేరాఫ్​.. ఐటీలో మేటి

స్టార్టప్​లకు ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్, వాటికి బూస్టింగ్​గా మారిందని రిపోర్టులో పేర్కొన్నారు. టీహబ్, వీహబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ వంటివి యాక్టివ్​గా పని చేస్తున్నాయని తెలిపారు. దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 15 శాతం ఉన్నదని, 2030 నాటికి ఇది మరింత పెరుగుతుందని అంచనా వేశారు. ‘‘హెల్త్​కేర్, రిటైల్ అండ్ ఈ–కామర్స్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, లాజిస్టిక్స్ అండ్​సప్లయ్ చైన్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, మ్యాన్​ఫ్యాక్చరింగ్​వంటివన్నీ రాష్ట్రంలో ఉన్నాయి. గూగుల్, మైక్రోసాప్ట్, అమెజాన్​, యాపిల్ వంటి పెద్ద కంపెనీలు సైతం తెలంగాణలో తమ సెంటర్లను విస్తరిస్తున్నాయి.

రాష్ట్రం నుంచి ప్రతిఏటా 27 వేల నుంచి 31 వేల మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ​ మ్యాథమేటిక్స్ గ్రాడ్యుయేట్స్​బయటకొస్తున్నారు. లివింగ్​కాస్ట్ లో తెలంగాణ టాప్ 3లో ఉన్నది. దేశవ్యాప్తంగా ఫార్మా ఎగుమతులు 27.85 బిలియన్​ డాలర్లు ఉంటే, అందులో  తెలంగాణ వాటా 4.4 బిలియన్ డాలర్లు. ఏరో, డిఫెన్స్ లోనూ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రంగంలో 25 పెద్ద కంపెనీలతో పాటు వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈలు పని చేస్తున్నాయి” అని రిపోర్టులో వెల్లడించారు.