హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లాలోని మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల నిర్మాణానికి సర్కారు నిధులను మంజూరు చేసింది. 4,241 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ హైలెవెల్ కెనాల్‌పై చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు రూ.44 కోట్ల నిధులను మంజూరు చేస్తూ బుధవారం ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
పొనుగోడు గ్రామం వద్ద నిర్మించనున్న పొనుగోడు లిఫ్ట్ స్కీమ్‌కు రూ.6.83 కోట్లు మంజూరు చేయగా.. దీని ద్వారా 510 ఎకరాలకు నీళ్లివ్వనున్నారు. 2,484 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా నల్గొండ మండలంలో తలపెట్టిన నర్సింగ్‌బట్ల–దోమలపల్లి లిఫ్ట్ స్కీమ్‌కు రూ.16.95 కోట్లు, 1,237 ఎకరాలకు నీళ్లిచ్చేందుకు కంచనపల్లి–బక్కతాయికుంట లిఫ్ట్‌కు రూ.20.22 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఆయా ప్రాజెక్టులకు అదనంగా భూసేకరణ లేకుండా చూసుకోవాలని ఉత్తర్వుల్లో నల్గొండ సీఈని ఆదేశించారు.