ఉస్మానియా మెడికోలకు కొత్త హాస్టల్

ఉస్మానియా మెడికోలకు కొత్త హాస్టల్
  • నెరవేరనున్న జూడాల పదేండ్ల కల
  • నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి దామోదర రాజ నర్సింహా
  • రూ.121 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం రెండు కొత్త హాస్టల్ బిల్డింగ్స్‌‌‌‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. కోఠిలోని కాలేజీలో ఈ రెండు బిల్డింగుల నిర్మాణ పనులకు హెల్త్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ దామోదర రాజనర్సింహా శుక్రవారం ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా రెండు హాస్టల్ భవనాలను నిర్మించేందుకు రూ.115 కోట్లు, డెంటల్ స్టూడెంట్ల హాస్టల్ భవన విస్తరణకు మరో రూ.6 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 8 అంతస్తుల్లో 1,80,760 స్క్వేర్ ఫీట్ల సామర్థ్యంతో అమ్మాయిల హాస్టల్ నిర్మించనుండగా, 4 అంతస్తుల్లో 74,696 స్క్వేర్‌‌‌‌‌‌‌‌ ఫీట్ల సామర్థ్యంతో బాయ్స్‌‌‌‌ హాస్టల్ నిర్మించనున్నారు.

10,286 స్క్వేర్ ఫీట్ల సామర్థ్యంతో డెంటల్ హాస్టల్ విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ బిల్డింగుల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఏడాదిలోగా బిల్డింగుల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. దశాబ్దాల కిందట కట్టిన బిల్డింగుల్లోనే ఇప్పటికీ ఉస్మానియా, గాంధీ మెడికోల హాస్టళ్లు కొనసాగుతున్నాయి. వాటిల్లో సౌకర్యాలు లేకపోవడంతో కొత్త హాస్టల్ బిల్డింగులు కావాలని మెడికోలు, సంబంధిత అధికారులు సుమారు పదేండ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.

బిల్డింగులు కట్టిస్తామని జూడాలకు హామీ ఇచ్చిన గత ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్య శాఖ మంత్రి దామోదరకు బిల్డింగుల కోసం జూడాలు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి.. గాంధీ, ఉస్మానియా మెడికోలకు కొత్త బిల్డింగులను మంజూరు చేయించారు.

ఎల్టీలకు నియామక పత్రాలు..

హాస్టల్ బిల్డింగుల శంకుస్థాపన అనంతరం ఉస్మానియా సెమినార్ హాల్‌‌‌‌లో జరిగే కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహా పాల్గొననున్నారు. కొత్తగా రిక్రూట్ అయిన ల్యాబ్ టెక్నీషియన్ల (ఎల్టీ)కు మంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం మెడికోలు, ల్యాబ్ టెక్నీషియన్లను ఉద్దేశించి మంత్రి ప్రసంగించనున్నారు.