కేజీబీవీకి కొత్త టీచర్లు..ఖాళీల భర్తీకి సర్కార్ నిర్ణయం

కేజీబీవీకి కొత్త టీచర్లు..ఖాళీల భర్తీకి సర్కార్ నిర్ణయం
  • కొత్తగా వెయ్యి మంది కేజీబీవీ టీచర్లు
  • ఖాళీల నేపథ్యంలో భర్తీకి సర్కారు నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సర్కారు చర్యలు ప్రారంభించింది. గతేడాది నిర్వహించిన రిక్రూట్మెంట్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఆయా పోస్టులను నింపేందుకు నిర్ణయం తీసుకున్నది. జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి.. డీఈవోలకు ఆదేశాలు జారీచేశారు. 

రాష్ట్రంలో 495 కేజీబీవీలున్నాయి. వాటిలో ఇటీవల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు నిర్వహించారు. సుమారు 450 మందికి స్థానచలనం జరిగింది. వారందరినీ పాత స్కూళ్లలో సోమవారం రిలీవ్ చేసి.. మంగళవారం కొత్త స్కూళ్లలో జాయిన్ చేసుకోవాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు తదితర ఖాళీలు ఏర్పడ్డాయి. 

Also Read:-మహానగరి... ఫుట్​పాత్​లకు ఉరి

జూన్​లోనే వీటిని భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీచేసినా.. వివిధ కారణాలతో ఆగిపోయింది. తాజాగా బదిలీలు పూర్తికావడంతో, ఆయా ఖాళీలను భర్తీ చేసుకోవాలని డీఈవోలకు మరోసారి ఆదేశాలు జారీచేశారు. 2023–24లో నిర్వహించిన పరీక్షలో క్వాలిఫై అయిన వారిలో మెరిట్, రోస్టర్ ఆధారంగా ఖాళీలను నింపుకోవాలని సూచించారు. 

త్వరలోనే ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో.. త్వరగా ఈ భర్తీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్, మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ల అనుమతితో ఆయా పోస్టులను నింపుకోవాలని ఆదేశాలిచ్చింది.