
- అటకెక్కిన యంత్రలక్ష్మి
- అందని సబ్సిడీ యంత్రాలు
- ఫసల్ బీమా పథకానికి రాష్ట్ర వాటా చెల్లిస్తలే
- పంటలు దెబ్బతిన్నా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తలే
- విత్తన రాయితీ ఆపేసిన్రు
రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 5 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తున్న రాష్ట్ర సర్కారు.. ఆ సాకుతో రైతు సంక్షేమానికి సంబంధించిన అనేక స్కీంలను, సబ్సిడీలను, ప్రోత్సాహకాలను బంద్పెట్టింది. కొన్నేండ్లుగా యంత్రలక్ష్మి, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, సీడ్ సబ్సిడీలను ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు చేస్తున్న స్కీంలకు కూడా రాష్ట్ర వాటా చెల్లించకుండా రైతులను ముంచుతోంది. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలో రైతులకు రైతుబంధు తప్ప మరో ఆధారం లేకుండా చేసింది.
మంచిర్యాల, వెలుగు: నిరుడు పునాస సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద రూ. 7,300 కోట్లు విడుదల చేసి.. రైతులకు సంబంధించిన మిగతా స్కీంలు అమలు చేయక రూ. 15 వేల కోట్లకుపైగా మిగుల్చుకుంది. ప్రతి సీజన్‌లో ఇట్లనే నడిపిస్తోంది. అన్నిటికీ రైతుబంధు ఒక్కటే పరిష్కారం అన్నట్లుగా మరిపిస్తోంది. యంత్రలక్ష్మి పథకాన్ని ఇట్ల అమలులోకి తెచ్చి అట్ల ఆపేసింది. ఫసల్ బీమాకు రెండేండ్లుగా తన వాటా చెల్లిస్తలేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఆరేండ్లుగా ఇచ్చుడు బంజేసింది. రుణమాఫీ కథ సాగుతనే ఉంది.
యంత్రలక్ష్మి.. రెండేండ్లకే ఆగింది
ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు రైతులను ప్రోత్సహించేందుకు, వ్యవసాయ రంగంలో కూలీల కొరతకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం 2016–-17లో యంత్రలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీం కింద రైతులకు ఇనుప నాగళ్లు మొదలుకొని ట్రాక్టర్ల వరకు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
రైతులు ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లుతున్న క్రమంలో రెండేండ్లకే ఈ పథకాన్ని నిలిపివేసింది. 2018-–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఫండ్స్ ఆపేసింది. అట్లనే 50 శాతం సబ్సిడీపై అందించే కేజ్‌వీల్స్, కలుపు యంత్రాలు, కల్టివేటర్లు, పవర్ స్ర్పేయర్లు వంటి పరికరాలను ఇస్తలేదు. దీంతో లక్షల విలువైన యంత్ర పరికరాల కొనుగోలు రైతులకు భారంగా మారింది. అయితే.. 2021-–22 బడ్జెట్లో ప్రభుత్వం తిరిగి యంత్రలక్ష్మి పథకానికి రూ. 1,500 కోట్లు కేటాయించింది. కానీ వానాకాలం సీజన్ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, ఇంతవరకు పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ రాలేదని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నారు. అంటే ఈసారి కూడా యంత్రలక్ష్మి స్కీం మూలకుపడ్డట్టేనని రైతులు అంటున్నారు. దీంతో నాలుగేండ్లుగా రైతులు సబ్సిడీ యంత్రాల కోసం ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం సగటున ఏటా రూ. వెయ్యి కోట్ల చొప్పున రూ. 4 వేల కోట్లు మిగుల్చుకున్నది.
ఆరేండ్లుగా నో ఇన్పుట్ సబ్సిడీ
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రతి సీజన్‌లో ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలి. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది తప్ప ఆ తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. గతేడాది వానాకాలం రైతులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 52 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇందులో సుమారు 30 లక్షల ఎకరాల్లో బీపీటీ, తెలంగాణ మసూరి లాంటి సన్నాలు వేశారు. భారీ వర్షాలు, చీడపీడల కారణంగా15 లక్షల ఎకరాల్లో కోటీ 50 లక్షల క్వింటాళ్ల పంట నష్టం జరిగింది. దాని విలువ దాదాపు రూ. 3 వేల కోట్లు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 60.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయగా, వరదల కారణంగా16 లక్షల ఎకరాల్లో, తెగుళ్ల కారణంగా మరో 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు తేల్చారు. చాలా జిల్లాల్లో ఫస్ట్ పికింగ్ చేతికే రాలేదు. దిగుబడి ఎకరానికి ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు తగ్గింది. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం 30 శాతం దిగుబడులు కోల్పోవడంతో రైతులకు ఏకంగా రూ. 9 వేల కోట్ల నష్టం జరిగింది. ఈ లెక్కన ఈ రెండు ప్రధాన పంటలపై గత వానాకాలం సీజన్‌లో రైతులు రూ. 12 వేల కోట్లకు పైగా నష్టపోయారు. ఈ మొత్తం రైతుబంధు కంటే రెట్టింపు కావడం గమనార్హం. అయినా రాష్ట్రంలోని ఏ రైతుకూ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత, గోదావరి వెంట 9 వేల ఎకరాల్లో పత్తి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్టు అగ్రికల్చర్ ఆఫీసర్లు రిపోర్టు ఇచ్చారు. రైతులు రూ. 45 కోట్లకు మునిగినా ప్రభుత్వం పైసా పరిహారం అందించలేదు.
సీడ్ సబ్సిడీ ఇస్తలే
గతంలో వరి, సోయాబీన్, శనగ, పల్లి తదితర విత్తనాలను రైతులకు సబ్సిడీపై సప్లయ్ చేసిన సర్కారు క్రమంగా సీడ్ సబ్సిడీకి మంగళం పాడింది. కేవలం పచ్చిరొట్ట విత్తనాలనే రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది వరి విత్తన ధరలు పెరగడంతో రైతులపై భారం కోట్లలో పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 41.85 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుందని అంచనా. ఎకరానికి 25 కిలోల సీడ్ అవసరం. గతంలో ప్రభుత్వం కిలోకు రూ. 5 నుంచి రూ.10 సబ్సిడీ ఇచ్చేది. సగటున రూ. 5 చొప్పున లెక్కగట్టినా రూ. 52.31 కోట్లు ప్రభుత్వం మిగిల్చుకుంది. కంది 20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున 1.60 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం. కంది సీడ్ క్వింటాల్‌కు రూ. 9,500 ఉంది. దీనిపై 25 శాతం సబ్సిడీ ఇచ్చినా రైతులకు రూ. 40 కోట్లకు పైగా ఆదా అయ్యేది. 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఎకరానికి రెండు ప్యాకెట్ల లెక్కన 1.60 కోట్ల విత్తన ప్యాకెట్లు అవసరం. బీజీ2 విత్తనాలు 450 గ్రాముల ప్యాకెట్‌కు ప్రభుత్వం రూ. 767 ధర నిర్ణయించింది. ఒక్కో ప్యాకెట్‌పై 25 శాతం సబ్సిడీ ఇవ్వాలని రైతులు కొన్నేండ్లుగా డిమాండ్చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే రైతులకు రూ. 300 కోట్ల వరకు మిగిలేది. అలాగే పంటల సాగులో మెలకువలు, నూతన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘మన తెలంగాణ –-మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించింది. అగ్రికల్చర్, అనుబంధ శాఖల ఆఫీసర్లు 15 రోజుల పాటు గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులను చైతన్యపర్చడానికి ఇది దోహపడింది. కానీ నాలుగేండ్లుగా ఈ కార్యక్రమాన్ని సర్కారు బంద్ చేసింది.
ఫసల్ బీమా నుంచి పక్కకు
వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తుల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకునేందుకు కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టింది. ప్రీమియంలో 50 శాతం రైతుల వాటా కాగా, మిగతా 50 శాతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25 శాతం చొప్పున భరించాలి. రెండేండ్లుగా రాష్ట్ర సర్కారు తన వాటా ప్రీమియం కింద రూ. 513.50 కోట్లు కట్టక స్కీం అమలైతలేదు. ఫలితంగా వరదలకు నష్టపోయిన రైతులకు బీమా కంపెనీల నుంచి రెండేండ్లలో అందాల్సిన రూ. 989.67 కోట్ల క్లెయిమ్స్ ఆగిపోయాయి. ప్రభుత్వం వాటా నిధులు చెల్లించి ఉంటే ఈ మొత్తం రైతులకు అందేది. ప్రభుత్వం ఫసల్ బీమా పథకం నిలిపేయడంతో తమకు పరిహారం రావట్లేదని గతేడాది డిసెంబర్లో ఆదిలాబాద్ జిల్లా రైతులు ప్రగతిభవన్‌ను ముట్టడించినా సర్కారులో స్పందన కనిపించలేదు.
రుణమాఫీ చేసేది ఇంకెప్పుడు?
2018 డిసెంబర్ 11 లోపు రైతులు తీసుకున్న రూ. లక్ష, ఆలోపు క్రాప్‌లోన్లను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించింది. గత మూడేండ్లలో పంట రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ. 17,225 కోట్లు కేటాయించినా.. ఇప్పటిదాకా కేవలం రూ. 409 కోట్లు ఖర్చుచేసింది. రూ. 25 వేల లోపు లోన్లు తీసుకున్న 2.96 లక్షల మంది రైతుల రుణాలను మాత్రమే ఈ మొత్తంతో మాఫీ చేశారు. రూ. 25,936 కోట్ల పంట రుణాల్లో కేవలం 1.57 శాతం మాఫీ కాగా, మిగిలిన 37.70 లక్షల మంది రైతులకు బ్యాంకర్ల నుంచి వేధింపులు తప్పట్లేదు. పంటను అమ్మేయగా వచ్చిన పైసలు, రైతు బంధు పైసలు అకౌంట్లలో పడగానే హోల్డ్‌లో పెట్టి వడ్డీ కట్టించుకుంటున్నారు. ప్రభుత్వం సకాలంలో క్రాప్‌లోన్ మాఫీ చేయకపోవడం వల్ల ఏటా రూ. 1,786 కోట్ల మేర రైతులు నష్టపోతున్నారు.
ఎకరాకు ఐదు వేలు ఇస్తే చాలదు..
రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఇచ్చి ముఖ్యమంత్రి చేతులు దులుపు కుంటుండు. రైతులకు అక్కరకు వచ్చే పనిముట్ల పంపిణీ, యంత్రలక్ష్మి లాంటి పథకాలను నాలుగేండ్ల నుంచి మరిచిపోయిండు. ఎకరాకు ఐదు వేలు ఇస్తే ఏం చాల్తది. ఏడెనిమిది వేల రూపాయలు పెట్టి ట్రాక్టర్లను కిరాయికి తెచ్చుకొని పొలాలు దున్నిపిస్తున్నం. పనిముట్ల పథకాలు ఉంటే ఎంత మేలు జరుగుతదో అర్థం చేసుకుంటే బాగుంటది.
- పనాస మల్లేశ్, మంచిర్యాల జిల్లా