హైదరాబాద్: గోదావరి ఫేజ్–2లో భాగంగా తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనుల డిజైన్ ను ప్రభుత్వం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పనులు పొందిన మెఘా సంస్థ కాంట్రాక్టును కూడా రద్దు చేసింది. గత ప్రభుత్వం కొండ పోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్ కు నీటిని తరలించి.. అక్కడి హైదరాబాద్ తాగు అవసరాలకు నీటిని వినియోగించుకోవాలని భావించింది. గత ప్రభుత్వం చేసిన ఈ డొంక తిరుగుడు నిర్ణయం వల్ల రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి ఫేజ్ 2 ను పొడిగించి మల్లన్నసాగర్ నుంచి నీటిని నేరుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు నీటిని మళ్లించాలని భావిస్తోంది. హైదరాబాద్ కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవాపురం చెర్వు నింపుతారు. కేశవాపురం చెర్వును 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ గా నిర్మిస్తారు. అక్కడి నుంచి ఘన్పూర్ మీదుగా హైదరాబాద్ కు 10 టీఎంసీల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఆరేండ్లయినా ఈ పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు.
ALSO READ : సీఎం రిలీఫ్ ఫండ్‌కి..అపెక్స్ బ్యాంక్ పాలకవర్గం కోటిన్నర విరాళం
గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంచుకున్న పైపులైన్ రూట్ సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం హయంలో ఈ టెండర్లను దక్కించుకున్న మెఘా కంపెనీ ఈ పనులు చేపట్టకుండా వదిలేసింది. 2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పనులు చేపట్టలేమని, 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని మెఘా కంపెనీ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా మెఘా కంపెనీకి కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.