- టూరిజం సర్య్కూట్ల ఏర్పాటుకు సర్కారు కసరత్తు
- నల్లమల, కోయిల్‌సాగర్, కురుమూర్తిలో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
- ప్రాధాన్యతను బట్టి కాటేజీలు, గెస్ట్ హౌస్‌ల నిర్మాణాలకు నిధులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సంస్థానాధీశులు నిర్మించిన కోటలు, ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, ప్రాజెక్టులు, నల్లమల అటవీ సంపదకు ఈ ప్రాంతం నెలవు కావడంతో రెండు సర్క్యూట్లుగా విభజించి డెవలప్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను ‘నల్లమల టూరిజం హబ్’గా, నారాయణపేట, గద్వాల, మహబూబ్నగర్ప్రాంతాలను కలిపి ‘ఏకో టూరిజం హబ్’గా అభివృద్ధి చేయనుంది.
మహబూబ్‌నగర్, వెలుగు: పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన సొంత జిల్లా కావడంతో ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు. ఆయనదీ పాలమూరు జిల్లానే కావడంతో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి టూరిజం స్టడీ టూర్లను ప్రారంభించారు. ప్రతి నెలా ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ కార్యక్రమాన్ని జులై 5న నల్లమల నుంచి శ్రీకారం చుట్టారు. రెండు రోజులపాటు నల్లమలలో పర్యటించి అక్కడి పర్యాటక ప్రాంతాలు, వాటి అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలు, టూరిస్టులను ఆకర్షించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆఫీసర్లతో చర్చించారు. గీసుగండి వద్ద బోటింగ్, మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.
దేవరకద్ర ఇవీ ప్రపోజల్స్
ఈ నెల 4న దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించారు. కోయిల్‌సాగర్, సరళాసాగర్ ప్రాజెక్టులతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరొందిన కురుమూర్తి క్షేత్రాన్ని సందర్శించారు. కురుమూర్తి వద్ద వీవీఐపీల కోసం గెస్ట్ హౌస్‌లు, భక్తుల కోసం కల్యాణ కట్ట, వసతి గృహాలు, గుట్ట కింద నుంచి గుట్ట పైకి లిఫ్ట్‌ల ఏర్పాటు, కల్యాణ మండపం, లడ్డూల తయారీ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. కోయిల్ సాగర్, సరళా సాగర్ వద్ద రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కోయిల సాగర్ వద్ద గెస్ట్ హౌస్, కాలేజీల నిర్మాణంతోపాటు స్పీడ్ బోట్లు, రెండు మినీ బోట్ల ఏర్పాటుకు ప్రపోజల్స్ రెడీ చేశారు.
ప్రాధాన్యత క్రమంగా నిధులు
త్వరలో జడ్చర్ల, గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, నారాయణపేట, మక్తల్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో 700 ఏండ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి, మన్యంకొండ, మక్తల్అభయాంజనేయ స్వామి టెంపుల్, చంద్రఘడ్ కోట, కోయిల్ కొండ ఖిల్లా, పాన్‌గల్, ఖిల్లాఘణపురం ఖిల్లాలు, వనపర్తి రాజప్రసాదం, శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి ఆలయం, బీచుపల్లి క్షేత్రం, జూరాల, 5వ శక్తి పీఠమైన జోగులాంబ, 300 ఏండ్ల నాటి నారాయణపేట జిల్లాలోని ఔదుంబరేశ్వర టెంపుల్, జైనుల కాలంలో నిర్మించిన జడ్చర్లలోని గొల్లత గుడిని విజిట్ చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి, రాష్ర్ట సర్కారుకు నివేదికలను అందించనున్నారు. ప్రాధాన్యత క్రమంగా వీటికి నిధులు విడుదల చేయనున్నారు.
పంద్రాగస్టున పిల్లలమర్రి రీ ఓపెన్
ఆరున్నర సంవత్సరాల తర్వాత పిల్లలమర్రి పర్యాటకులకు దర్శనం ఇవ్వనుంది. దాదాపు 700 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ మహా వృక్షం 2018లో క్షీణించే దశకు చేరుకుంది. అయితే, టూరిజం, అటవీ శాఖలు సంయుక్తంగా ఈ మహా వృక్షానికి తిరిగి ప్రాణం పోశారు. సెలైన్లు, క్రిమి సంహారక మందులు అందించి చెట్టును బతికించారు. ప్రస్తుతం ఈ మహావృక్షం ఆరోగ్యంగా ఉండడంతో పాటు, కొత్త ఊడలకు జీవం ఇస్తోంది. దీంతో పంద్రాగస్టున ఈ పర్యాటక ప్రదేశాన్ని తిరిగి ఓపెన్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.