నారాయణపేట–కొడంగల్ స్కీముల్లో.. టన్నెళ్ల బదులు ప్రెజర్ పైపులు!​

నారాయణపేట–కొడంగల్ స్కీముల్లో.. టన్నెళ్ల బదులు ప్రెజర్ పైపులు!​
  •     ఇంజినీర్ల న్యూ ప్రపోజల్స్​కు సర్కారు ఓకే
  •     టన్నెళ్ల వల్ల పనులు ఆలస్యం ​కావద్దనే!
  •     వారంలో రాడార్​ సర్వే కొలిక్కి
  •      పెరిగిన ఆయకట్టు.. అంచనా వ్యయం
  •     రెండేండ్లలో పనులు పూర్తయ్యేలా సర్కారు చర్యలు

మహబూబ్​నగర్​, వెలుగు : పాలమూరు వలసలను నివారించే లక్ష్యంతో చేపట్టిన ‘నారాయణపేట–-కొడంగల్​' స్కీం పనుల్లో వేగం పెంచాలని రాష్ర్ట సర్కారు భావిస్తోంది. రెండేండ్లలో పనులు పూర్తి చేయాలని టార్గెట్​ పెట్టుకోవడంతో.. ఇరిగేషన్​ ఆఫీసర్లు సూచించిన ప్రకారం స్కీమును టన్నెల్స్​ ఆధారంగా కాకుండా ప్రెజర్​ మెయిన్​ (పైపులైన్​) ద్వారా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు డిజైన్​లో మార్పులు, చేర్పులు చేయడంతో పాటు అడిషనల్​ ఫండ్స్​ కూడా కేటాయించింది. మూడు రోజుల కింద ప్రారంభించిన రాడార్ సర్వే త్వరలో పూర్తి కానుండగా, ఈ రిపోర్టు సర్కారుకు చేరిన వెంటనే పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

గుట్టలు ఉండడంతో టన్నెల్స్​కు ఇబ్బంది..

జీవో 14 ప్రకారం  నారాయణపేట-- –కొడంగల్ స్కీముకు భీమా ప్రాజెక్టులో భాగమైన భూత్పూర్​ రిజర్వాయర్​ నుంచి 7 టీఎంసీల నీటిని కేటాయించారు. మొదట అనుకున్న ప్రకారం ఫస్ట్​ లిఫ్ట్​ భూత్పూర్ రిజర్వాయర్​​ నుంచి ఊట్కూరు వరకు.. రెండో లిఫ్ట్​ ఊట్కూరు నుంచి జాజాపూర్​కు, మూడో లిఫ్ట్​ జాజాపూర్​ నుంచి జమమ్మ చెరువు, 4వ లిఫ్ట్​ జమయ్య చెరువు నుంచి కానుకుర్తి చెరువుకు నీటిని ఎత్తిపోసేలా అండర్​ టన్నెల్స్​, గ్రావిటీ కెనాల్స్​తో డిజైన్​ రూపొందించారు. కానీ, ఆ రూట్​లో గుట్టలు ఎక్కువగా ఉన్నాయి. 

రైతుల భూములూ ఉన్నాయి. దీంతో స్కీం గురించి రాష్ర్ట సర్కారు ఇటీవల ఇరిగేషన్​ ఆఫీసర్లతో సమావేశమైంది. ఈ మీటింగ్​లో ఇరిగేషన్​ ఆఫీసర్లు టన్నెల్స్ బదులు  ప్రెషర్​ మెయిన్స్​ నిర్మిస్తే టైం సేవ్​ కావడంతో పాటు  భూ సేకరణ సమస్య కూడా తీరుతుందని చెప్పినట్లు సమాచారం. టన్నెల్స్​ బదులు ప్రేషర్​ మెయిన్ ​ఏర్పాటుచేస్తే ప్రస్తుతం కేటాయించిన రూ.2,945 కోట్లకు అదనంగా రూ.500 
కోట్లు అవసరం అవుతాయని ఆఫీసర్లు  

చెప్పినట్లు తెలిసింది. ఇంజినీర్ల సూచనలకు ఆమోదం తెలిపిన రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రెషర్​ మెయిన్​ ఎక్కడెక్కడ నిర్మించాలనే దానిపై నాలుగు రోజుల కింద కొడంగల్​, నారాయణపేట, మక్తల్​ ప్రాంతాల్లో లైట్​ డిటెక్షన్ అండ్​ రేంజింగ్​​ సర్వే (రాడార్​ సర్వే)ను ప్రారంభించింది. మరో ఆరు రోజుల్లో సర్వే పూర్తి కానుండగా, రిపోర్టును రాష్ర్ట సర్కారుకు అందించనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. ప్రస్తుతం భూత్పూర్​ రిజర్వాయర్​ నుంచి దామరగిద్ద మండలంలోని కానుకుర్తి వరకు 55 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలో అండర్​​ టన్నెల్​ సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రెషర్​ మెయిన్ ఆధారంగా రిజర్వాయర్లను నిర్మించనున్నట్లు సమాచారం.

స్కీములో మార్పులు.. చేర్పులు..

నారాయణపేట–-కొడంగల్​ స్కీం కింద మొదట 1.05 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. కానీ, మరో 25 వేల ఎకరాలు పెంచి 1.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని కొత్త టార్గెట్​ పెట్టుకున్నారు. మండలాల వారీగా పెంచిన ఆయకట్టు ప్రకారం.. ఊట్కూరు మండలంలో 19 వేల ఎకరాలు, మక్తల్​లో ఆరు వేలు, నారాయణపేటలో తొమ్మిది వేలు, ధన్వాడలో 1,100, దామరగిద్ద, దౌల్తాబాద్​లో మండలాల్లో పది వేల ఎకరాల చొప్పున, కోస్గిలో 14,600, మద్దూరులో 16,700, కొడంగల్​ నాలుగు వేలు, బొంరాస్​పేటలో ఏడు వేల ఎకరాలను కలుపుకొని 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. 

అంచనా వ్యయం కూడా రూ.2,945 కోట్ల నుంచి రూ.3,445 కోట్లకు పెంచారు. నారాయణపేట-–కొడంగల్​గా ఉన్న ఈ స్కీం పేరును ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి ‘మక్తల్–​-నారాయణపేట–-కొడంగల్​’ గా మార్చారు. ఈ స్కీం కింద ఊట్కూరు, జాజాపూర్​, కాన్​కుర్తి, లక్ష్మీపూర్​, ఈర్లపల్లి, దౌల్తాబాద్​, కొడంగల్​, బొంరాస్​పేట, జయమ్మ చెరువులను బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్లుగా డెవలప్​ చేయనున్నారు.