వనపర్తి సర్కారు దవాఖానలో వైద్య సేవలు అంతంతే

వనపర్తి సర్కారు దవాఖానలో వైద్య సేవలు అంతంతే
  • పేషెంట్లను పట్టించుకోని డాక్టర్లు
  • సగం మెడిసిన్స్  ఇచ్చి పంపేస్తున్న పార్మాసిస్టులు
  • డెలివరీ, పోస్టుమార్టం కోసం డబ్బులు వసూలు

వనపర్తి/వనపర్తిటౌన్, వెలుగుః ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. వనపర్తి జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ జనరల్  ఆసుపత్రిలో డాక్టర్ల తీరుతో సరైన వైద్యం అందడం లేదనే విమర్శలున్నాయి. ఇక్కడ పనిచేసే కొందరు డాక్టర్లు  సొంతంగా ప్రైవేట్  క్లినిక్ లు పెట్టుకోవడం, మరికొందరు ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తుండడంతో సర్కారు దవాఖానలో మొక్కుబడిగా సేవలు అందిస్తున్నారు. 

ఓపీ చూశామా.. వెళ్లామా..

జిల్లా హెడ్​ క్వార్టర్​ హాస్పిటల్ లో పని చేసే కొందరు డాక్టర్లు ఓపీ టైమింగ్స్  మాత్రమే ఫాలో అవుతున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులను పరీక్షించి తిరిగి వెళ్తున్నారు. ఓపీ సమయంలో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను సైతం సరిగా చూడడం లేదనే విమర్శలున్నాయి. వారి సమస్య పూర్తిగా తెలుసుకోకుండానే టాబ్లెట్లు రాసి పంపిస్తున్నారని రోగులు వాపోతున్నారు.

మరికొందరు డాక్టర్లు వచ్చిన పేషెంట్లను కసురుకుంటున్నారని అంటున్నారు. ఇక డాక్టర్లు రాసిచ్చిన మందుల చీటీలో రెండు రకాల టాబ్లెట్లు ఇచ్చి, మిగిలిన వాటికి రెడ్  ఇంక్  పెన్ తో మార్క్  చేసి బయట కొనుక్కోవాలని చెప్పి పంపుతున్నారు. ఎవరైనా పేషెంట్లు ఎందుకు లేవని అడిగితే, ఫార్మసీ ఇన్​చార్జీలు మందుల కొరత ఉందని చెప్తున్నారు.

 కాన్పు కోసం వస్తే కాసులు ముట్టజెప్పాల్సిందే..

ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులను చేయించుకోవాలని, డాక్డర్ల సేవలు వినియోగించుకోవాలని చెబుతోంది. అయితే కాన్పు కోసం వచ్చిన వారి కుటుంబసభ్యులు మెటర్నటీ వార్డులో సిబ్బందికి పైసలు ఇవ్వకుంటే ఎలాంటి సర్వీస్  చేయడం లేదు. పైగా మగ పిల్లాడు పుడితే ఒక రేటు, ఆడపిల్ల పుడితే మరో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారని బంధువులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే పట్టించుకోరనే భయంతో ఊరుకుంటున్నారు. గతంలో ఇలాంటి ఫిర్యాదు వస్తే డబ్బులు అడిగిన వారిని తీసేసినా, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసుతో తిరిగి డ్యూటీలోకి వస్తున్నారు.

మృతుల కుటుంబాలకూ గోసే..

ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం వచ్చే బాధితుల గోస మరోలా ఉంది. ఎవరైనా చనిపోతే పోలీసులు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి  పోస్టుమార్టం కోసం డెడ్​బాడీని పంపిస్తారు. అక్కడి సిబ్బంది మృతుల కుటుంబ సభ్యుల నుంచి పోస్టుమార్టం మెటీరియల్  పేరుతో రూ.5 వేల వరకు డిమాండ్  చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వారినే మెటీరియల్ తెచ్చుకోవాలని కసురుకుంటున్నారు. బాధలో ఉన్న వారిని ఇలా డబ్బులు డిమాండ్​ చేస్తుండడంతో కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..

డెలివరీల సమయంలో పేషెంట్ల వద్ద డబ్బులు తీసుకున్నట్లు గతంలో ఫిర్యాదు వస్తే ఆ సిబ్బందిని తొలగించాం. ఇప్పుడు ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదు. పోస్టుమార్టం వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు గతంలో ఫిర్యాదులు వస్తే తీసుకోవద్దని హెచ్చరించాం. పైసలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. రంగారావు, హాస్పిటల్  సూపరింటెండెంట్