- ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు కేటాయిస్తున్న సర్కారు
- మీటింగ్‌లు నిర్వహించని హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు
- అకౌంట్లలోనే ఫ్రీజ్ అవుతున్న ఫండ్స్
- నామమాత్రంగా మెడికల్ ఆఫీసర్లు
పెద్దపల్లి, వెలుగు: పబ్లిక్ హెల్త్ సెంటర్ల ( పీహెచ్ సీ) అభివృద్ధి కోసం ప్రభుత్వం హెల్త్ డెవలప్మెంట్ సొసైటీ(హెచ్‌డీఎస్) ద్వారా నిధులు సమకూర్చుతున్నా ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. పెద్దపల్లి జిల్లాలోని సర్కార్ దవాఖానాల్లో కనీస సౌకర్యాలు లేక పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో సర్కార్ ఏటా ప్రతీ పీహెచ్‌సీకి రూ.1.75 లక్షల నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులు ఖర్చుచేయడానికి స్థానిక ఎంపీపీ, చైర్మన్‌గా 10 మంది సభ్యులతో హాస్పిటల్ డెవలప్మెంట్సొసైటీలను ఏర్పాటు చేశారు. ఈ సొసైటీలు 3 నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించి దవాఖానా అభివృద్ధిపై చర్చించాలి. సర్కార్ మంజూరు చేసిన నిధులను సొసైటీ తీర్మానంతో రోగులకు సౌకర్యాలు, ఆస్పత్రిలో వసతులు కల్పించడం తదితర పనులు చేపట్టాలి. అయితే కరోనా టైం నుంచి హెచ్‌డీఎస్ ఫండ్స్ సక్రమంగా విడుదల కావడం లేదు. అప్పుడప్పుడు ఎన్నోకొన్ని నిధులు రిలీజైనా, హెచ్‌డీఎస్ సమావేశాలు నిర్వహించడంలేదు.
కోఆపరేషన్ లేకపోవడమే..
కమిటీ సభ్యుల మధ్య కో ఆపరేషన్ లేకపోవడంతో నిధులు ఖర్చు కావడం లేదు. నిధుల వినియోగంలో కమిటీ సభ్యులు ఎంపీపీ సూచనలు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కమిటీని ఒప్పించి నిధులు తీసి ఖర్చు చేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని, దీంతో కమిటీ సమావేశాలు నిర్వహించడంలేదని పలువురు ఎంపీపీలు పేర్కొన్నారు. దీంతో చాలా పీహెచ్సీలలో మంచినీటి సమస్య కూడా పరిష్కారం కావడంలేదని మెడికల్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేరే పనులకు నిధుల మళ్లింపు..
కొన్ని మండలాల్లో హెచ్‌డీఎస్ నిధులు నిరుపయోగంగా ఉండడంతో వాటిని వేరే పనులకు మళ్లించినట్లు తెలిసింది. ఈ ఏడాది పెద్దపల్లి జిల్లాలోని 24 పీహెచ్‌సీలకు హెచ్‌డీఎస్ ఫండ్స్ కేటాయించింది. అయితే ఫండ్స్ డైరెక్ట్‌గా మెడికల్ ఆఫీసర్లు తీసుకునే అవకాశం లేకపోవడంతో పీహెచ్‌సీలల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. జిల్లా వైద్యశాఖలో డ్రాయింగ్ అధికారులను ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరికి 5 పీహెచ్‌సీల బాధ్యత అప్పగించారు. కరోనా పాండమిక్ నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు మాత్రమే హెచ్డీఎస్మీటింగ్ లు జరిగాయి. దీంతో నిధులు సద్వినియోగం కావడంలేదని పలువురు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు.
ఫ్రీజ్ అవుతున్న హెచ్‌డీఎస్ నిధులు..
ఎంపీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ, మెడికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించకపోతుండడంతో ప్రభుత్వం విడుదల చేస్తున్న హెచ్‌డీఎస్ నిధులు ఫ్రీజ్ అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 24 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో పీహెచ్‌సీకి హెచ్‌డీఎస్ కింద ప్రభుత్వం రూ.1.75 లక్షలు రిలీజ్ చేస్తుంది. ఈ నిధులు గతంలో ఏటా రూ.50 వేలు ఉండేవి. తెలంగాణ సర్కార్ ఏర్పడిన తర్వాత ఆ నిధులను రూ.1.75 లక్షలకు పెంచింది. ఈ ఫండ్స్ ను పేషెంట్లకు కావాల్సిన ఫెసిలిటీస్ కోసం ఖర్చు చేస్తారు. మంచినీరు, శానిటేషన్, ఎమర్జెన్సీ అవసరాల కోసం ఉపయోగిస్తారు. హెచ్‌డీఎస్ ఫండ్స్ వినియోగం కోసం ఎంపీపీ చైర్మన్‌గా సొసైటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీడీఓ, తహసీల్దార్, మెడికల్ ఆఫీసర్, సర్పంచ్, ముగ్గురు ఎంపీటీసీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తప్పనిసరిగా మూణ్నెల్లకోసారి సమావేశం నిర్వహించి పీహెచ్సీ అవసరాలు గుర్తించి హెచ్‌డీఎస్ నిధులు డ్రా చేసుకునే విధంగా తీర్మానించాల్సి ఉంటుంది.