టౌన్, వెలుగు : జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు లేక ఓ పేషెంట్ ను నేలపై పడుకోబెట్టి డాక్టర్లు వైద్యం చేశారు. మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన మనోజ్ (18) గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో శుక్రవారం రాత్రి అడ్మిట్ అయ్యాడు. ఫీవర్ సీజన్ కావడంతో ఆస్పత్రిలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది.
బెడ్లు లేకపోవడంతో మనోజ్ ను సిబ్బంది నేల మీద పడుకోబెట్టారు. బెడ్ ఖాళీ అయితే ఇస్తామని చెప్పారు. అప్పటి వరకు మనోజ్ ను ఆరుబయటే పడుకోబెట్టారు. చలికి జ్వరం ఎక్కువ కావడంతో చివరకు బాధితుడిని కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే, హాస్పిటల్ లో ఒక రూమ్ లో నాలుగు బెడ్లు గత పది రోజులుగా ఖాళీగానే ఉన్నాయి. వాటిని క్లీన్ చేయకపోవడంతో వాడటం లేదు. దీంతో హాస్పిటల్ కి వచ్చిన రోగులు సిబ్బంది పనితీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.