- గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో డ్యూటీల ఎగవేతపై వైద్య శాఖ సీరియస్
- ప్రతిరోజు ఉదయం 11 గంటల వరకు మానిటరింగ్
నిర్మల్, వెలుగు : గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్ లో కొంతకాలంగా బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేస్తున్నప్పటికీ.. సరైన మానిటరింగ్ లేక కొన్నిచోట్ల కొంతమంది డాక్టర్లు, సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అనుమతి తీసుకోకుండా సెలవులు పెట్టడం, డ్యూటీల సమయం ముగియకముందే వెళ్లిపోవడం, లేట్‌గా రావడం పరిపాటిగా మారింది.
ఫలితంగా చాలా హాస్పిటల్స్‌లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు అందుబాటులో లేక దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ.. డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ పై దృష్టి పెట్టింది. డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్‌ను ట్రాక్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేకంగా మానిటరింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతి రోజు ఉదయం 11 గంటలకు బయోమెట్రిక్ అటెండెన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను హెడ్ ఆఫీస్ కు ఆన్లైన్లో పంపించాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
పర్మిషన్ లేకుండా లీవ్ పెట్టడం, ఆలస్యంగా విధులకు వచ్చే వారితోపాటు మధ్యలో వెళ్లిపోయేవారి వివరాలను తమకు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. డుమ్మాలు కొట్టేవారికి, ఆలస్యంగా వచ్చేవారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది.