సర్కార్ దవాఖాన్లలో ఆపరేషన్లు చేస్తలేరు!

సర్కార్ దవాఖాన్లలో ఆపరేషన్లు చేస్తలేరు!
కిడ్నీ, హార్ట్, బొక్కల సర్జరీలకు దిక్కులేదు మెషీన్లు పనిచెయ్యవు.. మందులూ ఉండవు పది టీచింగ్​ హాస్పిటళ్లున్నా నామ్​కేవాస్తేనే.. ఉస్మానియాలో ఆపరేషన్‌  థియేటర్ల కొరత కరోనా పేరుతో గాంధీలో అన్నీ బంద్ ఉస్మానియాలో ల్యాబ్​ కూడా మూత లక్షల్లో ఖర్చుపెట్టలేక లబోదిబోమంటున్న జనం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గరీబోళ్లకు పెద్ద రోగమొస్తే ఆదుకునే దిక్కు లేకుంట పోయింది. పేరుకు పది సర్కారీ టీచింగ్ హాస్పిటళ్లు ఉన్నట్టేగానీ.. అవి ఇప్పటికీ జిల్లా హాస్పిటళ్ల లెక్కనే పనిచేస్తున్నాయి. ఉస్మానియా, గాంధీ దవాఖాన్లలో పెద్ద డాక్టర్లు ఉన్నా.. సర్కారు నిర్లక్ష్యంతో వారు ఓపీ ట్రీట్​మెంట్​కే పరిమితం అయితున్నరు. పెద్ద దవాఖాన్లకు పెద్ద పెద్ద బిల్డింగులే తప్ప.. అవసరమైన మెషీన్లు, మందులు మాత్రం ఉంటలెవ్వు. కిడ్నీ, గుండె జబ్బులు, కీళ్ల రోగాలతో నిత్యం పదుల సంఖ్యలో రోగులు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్  వంటి హాస్పిటళ్లకు వస్తున్నారు. అందులో సగం మందికి కూడా సరైన ట్రీట్​మెంట్​ అందట్లేదు. ఉస్మానియా దవాఖానలో ఆపరేషన్ థియేటర్లు లేక ఇబ్బంది అవుతోంది. చిన్న చిన్న సర్జరీల కోసం కూడా నెలల తరబడి వెయిటింగ్‌‌లో ఉంచుతున్నారు. పాత బిల్డింగ్ ఖాళీ చేసినప్పటి నుంచి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఒకే ఆపరేషన్ థియేటర్‌‌‌‌ ను రెండు, మూడు డిపార్టుమెంట్లు పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త బిల్డింగ్‌‌లోని ప్లాస్టిక్ సర్జరీ థియేటర్‌‌నే.. అటు ప్లాస్టిక్ సర్జరీ, ఇటు జనరల్ సర్జరీ డిపార్టుమెంట్లు వాడుకుంటున్నాయి. న్యూరో సర్జరీ థియేటర్‌‌‌‌ను.. న్యూరో, ఆర్థో సర్జరీ డిపార్ట్‌‌మెంట్లు పంచుకుంటున్నాయి. గాల్‌‌ బ్లాడర్ స్టోన్స్‌‌, ల్యాప్రో స్కోపీతో చేయాల్సిన ఆపరేషన్లు మొత్తానికే నడవట్లేదు. ఇక కరోనా సెంటర్​ పేరుతో గాంధీ హాస్పిటల్లో పది నెలలుగా అన్ని సేవలూ బందైనయి. ఈ మధ్యనే జనరల్​ ట్రీట్​మెంట్లు మొదలుపెట్టినా.. సర్జరీలు మాత్రం చేయడం లేదు. కీళ్లనొప్పులతో రోజూ పదుల సంఖ్యలో పేషెంట్లు గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లకు వస్తున్నారు. ఇందులో మోకాలు మార్పిడి, తుంటి మార్పిడి వంటి సర్జరీలు అవసరమైన వాళ్లు కూడా ఉంటున్నారు. కానీ ఒక్కరికి కూడా ఆపరేషన్​చెయ్యడం లేదు. ఆపరేషన్​ థియేటర్లు లేవని, కరోనా ఉందని రోగులను తిప్పి పంపిస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో వాటికి ట్రీట్​మెంట్​ తీసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో అటు ప్రైవేట్‌‌‌‌కు పోలేక.. ఇటు గవర్నమెంట్‌‌‌‌లో పట్టించుకోక రోగులు, వారి ఫ్యామిలీ మెంబర్స్​ కుమిలిపోతున్నరు. అసలు చాలా రకాల ఆపరేషన్లు గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో తప్ప మరెక్కడా అందుబాటులో లేవు. ఈ రెండు చోట్లా ఆపరేషన్లు చేయకపోవడంతో పేద రోగులకు దిక్కుతోచడం లేదు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలకు ఆయా సర్జరీలు చేసేందుకు ప్రైవేట్ హాస్పిటళ్లు ముందుకు రావడం లేదు. అదనంగా లక్షల రూపాయలు చెల్లించాలని కోరుతున్నయి. ముఖ్యమైన మందులన్నీ బయటనే.. సర్కారీ దవాఖాన్లకు వచ్చే రోగులందరికీ అవసరమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని చాలా హాస్పిటళ్లలో కొన్ని మందులే ఇచ్చి మిగతావి బయట కొనుక్కొమ్మని చెప్తున్నారు. దవాఖాన్లకు మందులు కొనేందుకు టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీకి ఇచ్చే బడ్జెట్‌‌‌‌  మామూలు మందులకే సరిపోతోందని, స్పెషాలిటీ ట్రీట్​మెంట్​కు ఖరీదైన మందులు కొంటే.. సాధారణ రోగులకు మెడిసిన్ ఇవ్వలేమని అధికారులు చెప్తున్నారు. దవాఖాన్లకు ఇచ్చే బడ్జెట్లో మెడిసిన్‌‌‌‌, ఇంప్లాంట్స్‌‌‌‌ కొనుగోలు అవకాశం ఉంటుంది. కానీ పెద్ద దవాఖాన్లలో ఇవేమీ జరగడం లేదు. పేషెంట్లకు చిట్టీ రాసిచ్చి బయట తెచ్చుకొమ్మని చెప్తున్నారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌‌‌‌‌‌‌‌ సహా చాలా దవాఖానాల్లో ప్రైవేట్ మెడికల్ షాపులు వెలిశాయి.  నిత్యం రోగులతో కిక్కిరిసి ఉంటున్నాయి. కొత్త కొత్త రోగాలు, కొత్త మందులు వస్తున్నాయని.. కానీ సర్కారు పాత మందులనే తప్ప, తాము సూచించిన మెడిసిన్‌‌‌‌  కొనట్లేదని డాక్టర్లు  అంటున్నారు. పేషెంట్ల మంచి కోసమే బయటికి నుంచి మందులు తెచ్చుకోవాలని పంపుతున్నామని వివరిస్తున్నారు.  టెస్టుల కోసం కూడా ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోందని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాంజియోగ్రామ్ టెస్టులకు రూ. వేలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల సీటీ స్కాన్లు, ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ మిషన్లు పనిచేయట్లేదు. పాతవి రిపేర్ చేయడం, కొద్దిరోజులకే అవి మూలకు పడటం సాధారణమైపోయింది. మేమే కొనుక్కుంటున్నం షుగర్​ బాగా ముదరడంతో మా అన్నను వారం కింద గాంధీలో జాయిన్​ చేసినం. పుండు పెద్దది కావడంతో కాలు తీసేశారు. మొత్తం మందుల్లో సగమే ఇస్తున్నరు. మిగిలిన సగం డబ్బులు పెట్టి కొంటున్నం. మాలాంటి పేదలకు అన్ని మందులు డాక్టర్లే ఇస్తే బాగుంటది. – బండారి నర్సింహులు, పెద్ద శివనూర్ పైసలుంటే గింత దూరం ఎందుకొస్తం రెండు వారాల సంది ఛాతీల నొప్పి వస్తుందని వచ్చిన. డాక్టర్ చూసి ఈసీటీ టెస్టు రాసిండు. ఆ టెస్టు రిపోర్టు చూసినంక.. ఇంకో టెస్టు బయట చేసుకుని రమ్మన్నడు. అప్పటిదాకా ఏసుకొమ్మని మందులు రాసిండు. ఆ మందులు బయటనే తీసుకోవాలన్నరు. టెస్టులు, మందులకు పైసలున్నంక ప్రైవేటుకు పోతను, గింత దూరం ఎందుకొస్త. – కృష్ణ, సూరారం హార్ట్​ ప్రాబ్లమ్స్​ వస్తే ప్రైవేట్​కే గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో మాత్రమే హార్ట్​ఆపరేషన్లకు వీలైన క్యాథల్యాబ్స్‌, ఇతర సదుపాయాలు ఉన్నాయి. కార్డియాలజీ ప్రొఫెసర్లు, పీజీ డాక్టర్లు ఉన్నా పది నెలలుగా ఈ రెండు హాస్పిటళ్లలో ఒక్క హార్ట్ సర్జరీ చేయలేదు. ఉస్మానియాలోని ల్యాబ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. పాత మెషీన్లు కావడం, సరిగా పనిచేయకపోవడంతో మార్చిలో ఈ ల్యాబ్ ను మూసేశారు. ఛాతీ నొప్పి, గుండె సంబంధిత రోగాలతో వచ్చేవారికి కేవలం ఓపీ చూసి పంపిస్తున్నారు. ఇక గాంధీ హాస్పిటల్​ అయితే ఈ ఏడాది మార్చి నుంచి పూర్తిగా కరోనా ట్రీట్‌మెంట్‌కే పరిమితమైంది. ఇటీవల నాన్ కరోనా సేవలు మొదలైనా.. కార్డియాలజీ సేవలు ప్రారంభించలేదు. ఇక్కడి క్యాథల్యాబ్​లో బ్యాటరీలు పాడయ్యాయని, మైనర్ రిపేర్లు ఉన్నాయని.. మానిటర్లు, ఎకో మిషన్లు లేవని డాక్టర్లు చెప్తున్నారు. వాటికి రిపేర్లు చేయించేదాకా ఆపరేషన్లు చేయలేమని అంటున్నారు. ఉన్న రెండు దవాఖాన్లలోనూ మెషీన్లు పనిచేయకపోవడంతో పేద రోగులు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లాల్సి వస్తోంది. మాలాంటోళ్లు ఏడికిపోవాలె? బాగా నడుం నొప్పి రావడంతో కరీంనగర్‌‌లో ఓ ప్రైవేట్‌ డాక్టర్‌‌ దగ్గర చూపించుకున్న. స్కానింగ్  తీసి హిప్‌  రిప్లేస్‌మెంట్ చేయాలన్నరు. అందుకు 4 లక్షల దాకా ఖర్చయితదన్నరు. కరీంనగర్‌‌ సివిల్ హాస్పిటల్​లో అడిగితే.. గాంధీకి పొమ్మన్నరు. గాంధీలో ఎంక్వైరీ చేస్తే.. కరోనా కారణంగా ఆ సర్జరీ చేయడం లేదన్నారు. ఇంకో నెల రోజులు పడుతుందని చెప్పారు. ఉస్మానియాలో కూడా ఇప్పుడు చేయలేమని చెప్తున్నరు. మాలాంటోళ్లు ఏడికిపోవాలె? – శ్రీనివాస్‌, పెద్దపల్లి