సర్కారీ దవాఖానల్లో మరిన్ని ఐవీఎఫ్​ సేవలు

సర్కారీ దవాఖానల్లో మరిన్ని ఐవీఎఫ్​ సేవలు
  • మండలిలో మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
  • గత సర్కారు జీఓలు తెచ్చింది తప్ప ఐవీఎఫ్  కేంద్రాలు ఏర్పాటు చేయలేదు
  • కాంగ్రెస్  సర్కారు వచ్చాకే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సంతానలేమితో బాధపడుతున్న దంపతుల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో  సంతాన సాఫల్య కేంద్రాలను (ఐవీఎఫ్) మరింత విస్తరిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. రాష్ట్రంలో సంతానలేమి సమస్య తీవ్రంగా ఉందని, తాజా అధ్యయనాల ప్రకారం 26 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో ఐవీఎఫ్  సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. గురువారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమ

యంలో కాంగ్రెస్​ సభ్యులు టి.జీవన్​ రెడ్డి, మహేశ్  కుమార్​ గౌడ్​ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ‘‘గాంధీ, పేట్లబురుజు దవాఖానల్లో ఇన్​విట్రో ఫెర్టిలైజేషన్​(ఐవీఎఫ్​) కేంద్రాల ఏర్పాటుకు గత బీఆర్ఎస్  ప్రభుత్వం 2018లో జీఓ ఎంఎస్​520 మంజూరు చేసినా 2023 వరకూ అది సాకారం కాని విషయం వాస్తవమేనా? ఐవీఎఫ్​ కేంద్రాలు మరిన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనలు ఉన్నాయా?” అని జీవన్  రెడ్డి, మహేశ్  కుమార్  అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఎంతో మంది దంపతులు సంతానం కోసం ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ రూ.లక్షలు ఖర్చుచేసినా ఫలితం రాకపోవడంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు.  

‘‘రాష్ట్రంలో 358 ప్రైవేట్  ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. గాంధీ, పేట్లబురుజు, వరంగల్  ఎంజీఎంలో సర్కారు ఆధ్వర్యంలో ఐవీఎఫ్  సెంటర్ల ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం జీవో 520 విడుదల చేసింది తప్ప సెంటర్ల ఏర్పాటు మాత్రం జరగలేదు. డాక్టర్లు, డ్రగ్స్  లేకుండానే 2023 అక్టోబరులో గాంధీలో ఓ సెంటర్  ప్రారంభించారు. డాక్టర్లు, మందులు లేకపోవడం వల్ల ఒక్కరికీ కూడా ఐవీఎఫ్  చేయలేదన్నారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోని ఐవీఎఫ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంబ్రయాలజిస్ట్‌‌‌‌‌‌‌‌, గైనకాలజిస్ట్, ఇతర డాక్టర్లను నియమించాం.  

ఏఆర్టీ యాక్ట్  ప్రకారం అనుమతులు తీసుకొచ్చి, అక్టోబరు 15వ తేదీన గాంధీలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాం. పేట్లబురుజు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోనూ ఎంబ్రయాలజిస్ట్‌‌‌‌‌‌‌‌ను నియమించాం. అక్కడ కూడా ఐవీఎఫ్  సేవలను ఈనెల 9 నుంచి  అందుబాటులోకి తీసుకువచ్చాం. ఫాలిక్యులర్  స్టడీ, ఐయూఐ, ఐవీఎఫ్  వంటి సేవలు అందిస్తున్నాం” అని మంత్రి దామోదర వివరించారు. అలాగే, వరంగల్‌‌‌‌‌‌‌‌  ఎంజీఎంలోనూ ఐవీఎఫ్  సెంటర్  ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని మంత్రి దామోదర తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లోనూ ఐవీఎఫ్​ సెంటర్లు ఏర్పాటు చేయాలని జీవన్​రెడ్డి సూచించారు.