ఆరోగ్యశాఖ ఔట్​సోర్సింగ్ స్టాఫ్ ను పట్టించుకోని ప్రభుత్వం

ఆరోగ్యశాఖ ఔట్​సోర్సింగ్ స్టాఫ్ ను పట్టించుకోని ప్రభుత్వం

నిరుడు కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ఆరోగ్యశాఖ సిబ్బందిని కరోనా వారియర్స్​ అని పొగిడారు. కానీ, ఆ ఆరోగ్య శాఖలోనే పనిచేస్తున్న కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ సిబ్బంది సమస్యలను మాత్రం సర్కారు పట్టించుకోవట్లేదు. పర్మనెంట్​ ఉద్యోగులకు, వీరికి మధ్య వేతనాల్లో తేడాలున్నా.. వాటిని సరిచేస్తామని ఏడేండ్ల కిందట సీఎం హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అవి నెరవేరలేదు. కొంతమందికైతే నెలనెలా జీతాలే రావడం లేదు. రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నా.. ఒకట్రెండు నెలలవి పెండింగ్​లో పెడుతున్నారు. ఇందులో ఎక్కువగా ఉన్నది నోరు విప్పలేని ఎస్సీ, ఎస్టీ, బీసీలే.

నిరుడు ఇదే సమయంలో కరోనా మహమ్మారి దేశంలో విజృంభించింది. ఏం జరుగుతోందో తెలియక ప్రజలంతా లాక్​ డౌన్​లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు వివరించలేనివి. ఇందుకు భిన్నంగా ఆరోగ్యసిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు పూర్తిస్థాయిలో డ్యూటీలు చేశారు. పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలున్నా ఆరోగ్య సిబ్బంది మాత్రం కరోనా బాధితుల మధ్యే డ్యూటీలు చేయాల్సి వచ్చింది. అసలు వైరస్​ ఎక్కడ ఎలా వ్యాపిస్తోందో.. ఎవరికి సోకుతోందో.. ఎలా ట్రీట్​మెంట్​ చేయాలో తెలియని భయంకర పరిస్థితుల మధ్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి చేసిన సేవలను ప్రపంచమంతా కొనియాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా డాక్టర్లు, సిబ్బందిని దేవుళ్లతో పోల్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే కోవలో మెచ్చుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​, కొన్ని పార్టీలూ స్పందించి ప్రోత్సాహకాలు ప్రకటించాయి. అయితే ఆరోగ్యశాఖ సిబ్బందికున్న అసలు బాధలను, వేతనాలు ఇవ్వడంలో వ్యత్యాసం లాంటివాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవీ పట్టించుకోలేదు.

ఒకే పని.. మూడు రకాలుగా వేతనాలు!

తెలంగాణలో గాంధీ, టిమ్స్​, నిమ్స్​ లాంటి ఆసుపత్రులను ప్రత్యేకంగా కరోనా రోగుల కోసమే కేటాయించారు. డాక్టర్లందరికీ పర్మనెంట్​ ఉద్యోగాలు కావడంతో అన్ని హక్కులూ లభించాయి. కానీ, అక్కడ పనిచేసే మిగతా సిబ్బంది మధ్య తేడాలుండడమే దారుణం. నర్సింగ్​ స్టాఫ్​, టెక్నీషియన్లు, ల్యాబ్​ ఆపరేటర్లు, వార్డు బాయ్స్​లలో కొందరే పర్మనెంట్​ఉద్యోగులుగా ఉన్నారు. మరికొంత మంది కాంట్రాక్టు జీవో నెంబర్​ 14 ఔట్​ సోర్సింగ్​ సిబ్బంది, వారితో పాటు మరో రకం కాంట్రాక్ట్​ వర్కర్లూ ఉన్నారు. ఈ విధంగా ఉద్యోగుల మధ్య విభజన రేఖ గీసి ప్రభుత్వం శ్రమశక్తిని దోచుకుంటూ వారి జీవితాలతో ఆడుకుంటోంది. పర్మనెంట్​ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో స్కేల్​, హెచ్​ఆర్​ఏ, డీఏ అన్నీ వర్తిస్తాయి. నిత్యావసరాల ధరలు పెరగడంతో డీఏ పెంచాలని, పీఆర్సీ ఇవ్వాలన్న డిమాండ్​ ఉంది. దానిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీవో నెంబర్​ 14 ద్వారా నియమించిన కాంట్రాక్ట్​ ఔట్​ సోర్సింగ్​ సిబ్బందిలో కొంతమందికి పర్మనెంట్​ ఉద్యోగులతో పాటు జీతాలు పెంచే అవకాశం ఉంది. ఇందులో ప్రస్తుతం రెగ్యులర్​ నర్సింగ్​ సిబ్బందికి రూ.50 వేలకుపైనే వేతనాలు వస్తుండగా, కాంట్రాక్ట్​ ఔట్​ సోర్సింగ్​ నర్సులకు మాత్రం రూ.25 వేల లోపే ఉంటోంది. పర్మనెంట్​ ల్యాబ్​ టెక్నీషియన్స్​కు రూ.40 వేల దాకా జీతాలుంటే.. కాంట్రాక్ట్​ వారికి మాత్రం రూ.15,500 ఇస్తున్నారు. వార్డు బాయ్​లకు రెగ్యులర్​ వాళ్లకు రూ.25 వేల వేతనాలుండగా.. కాంట్రాక్ట్​ సిబ్బందికి రూ.12 వేలే ఇస్తున్నారు. ఒకే పనిచేస్తున్న సిబ్బంది మధ్య వేతనాల్లో ఇంత తేడాలుండడం వివక్షకు నిదర్శనం. 

థర్డ్​ పార్టీ వర్కర్ల పరిస్థితి దారుణం 

దోపిడీకి గురవుతున్న థర్డ్​ పార్టీ కాంట్రాక్ట్​ వర్కర్లు ఇంకా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆపరేషన్​ థియేటర్లు, బాత్రూంలు, ఓపెన్​ ఏరియా, హాల్స్​లో ఏరియాను లెక్కించి పరిశుభ్రతకు వర్కును కేటాయిస్తారు. మొదట కాంట్రాక్టర్​ తక్కువ మందిని పెట్టి పనిచేయిస్తారు. వారికి ఇచ్చిన పని ఆధారంగా డబ్బులు చెల్లిస్తారు. అసలు నిలువు దోపిడీ ఇక్కడే జరుగుతోంది. శానిటేషన్​ సిబ్బందికి రూ.10 వేలు, పేషెంట్​ కేర్​ సిబ్బందికి రూ.9,400, సెక్యూరిటీ సిబ్బందికి రూ. 9,800 మేర చాలీచాలని జీతాలు ఇస్తున్నారు. 

నెలనెలా జీతాలియ్యట్లె

ఔట్​ సోర్సింగ్​ సిబ్బందిని మొదటి రకమని పిలుస్తుంటారు. హైదరాబాద్​లో దాదాపు 2,000 మంది దాకా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్​ కమీషన్ల ఆధారంగా మరో 2 వేల మంది పనిచేస్తున్నారు. ఈ రెండు రకాల సిబ్బందికీ కాంట్రాక్టర్లు నెల నెలా వేతనాలు ఇవ్వరు. మూడు, నాలుగు నెలలకోసారి మాత్రమే చెల్లిస్తారు. అందులోనూ రెండు నెలలు ఇచ్చి మొదటి రెండు నెలల జీతాలను పెండింగ్​లో పెడుతున్నారు. జబ్బుపడిన ప్రజలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సేవ చేస్తున్న వైద్య సిబ్బంది పట్ల ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ప్రధాన ప్రశ్న. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరరేషన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల జీతాలను రూ.17 వేలకు పెంచిన రాష్ట్ర సర్కారు.. ఆరోగ్యశాఖలోని సిబ్బందికి ఎందుకు పెంచట్లేదు? ఈనిర్ణయాలను చూస్తే వైద్య సిబ్బంది, కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  

ఏడేండ్లు గడిచినా అమలు కాలే

2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదటి ఎన్నికల్లో టీఆర్​ఎస్​ మేనిఫెస్టోను విడుదల చేశారు కేసీఆర్​. అందులో కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ సిబ్బందిని పర్మనెంట్​ చేస్తానని ప్రకటించారు. గత పాలకులు కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ పథకాలు ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఆఖరికి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్​ పరం చేస్తారా అంటూ కేసీఆర్​ ఎగతాళి మాటలు మాట్లాడారు. అయితే, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. కేసీఆర్​ మనసులో పడితే మాత్రం నూటికి నూరుపాళ్లు అమలు చేస్తాడు. ఉద్యోగులకు, సిబ్బందికి పండుగ వాతావరణం కల్పిస్తాడు. లేకపోతే ఎండుగ చేస్తాడు. ఇది ఆయన నైజం. కేసీఆర్​కు వైద్య సిబ్బంది పట్ల ఎప్పుడు కనికరం వస్తదో చెప్పలేం. మరొక ప్రధాన అంశమేమిటంటే అనేక జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కాంటింజెంట్​ వర్కర్లు పనిచేస్తుంటారు. కాంటింజెంట్​ ఫండ్​ నిధులు విడుదల అయినప్పుడు మాత్రమే వీరికి వేతనాలు వస్తాయి. ఆ కాంటింజెంట్​ ఫండ్​ రెండు, మూడేండ్లకోసారి విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఆరోగ్యశాఖ నిర్వాకానికి అద్దం పడుతున్నది. ఎక్కువ మంది నోరులేని ఎస్సీ, ఎస్టీ, బీసీలు వైద్యశాఖలో పనిచేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. 

ఇప్పటికైనా ఆదుకోండి

ఆరోగ్యశాఖ మంత్రిగారిని కలిస్తే అన్నీ వింటారు. ప్రయత్నం చేస్తానంటారు. కొన్నింటికి పరిష్కారం లభించినా, చాలా వరకు పరిష్కారం కాకుండా పెండింగ్​లో ఉండడం ఉద్యోగ సంఘాల నాయకులు, సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్​ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లోనైనా ఆరోగ్యశాఖకు నిధుల కేటాయింపులు పెంచి, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సిబ్బందికి కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం మంచిది. సీఎం హామీ ఇచ్చినట్టు కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ సిబ్బందిని రెగ్యులరైజ్​ చేస్తే మరింత న్యాయం చేసినవారవుతారు. ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందికి ఆర్థిక అనారోగ్యం ఉంటే ఆరోగ్యాలు నీరసించి పూర్తిగా అనారోగ్యానికి గురౌతారు. ఒకే శాఖలో పనిచేస్తున్న సిబ్బందిలో వివక్ష ఉండటం అన్యాయం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి, సత్వర చర్యలు తీసుకోవాలి. 
                                                                                                                        ....చాడ వెంకట్ రెడ్డి,సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి