గుడ్ న్యూస్..హైదరాబాద్లో అన్నిచోట్లా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

గుడ్ న్యూస్..హైదరాబాద్లో  అన్నిచోట్లా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
  • ఎక్కడికక్కడ ఈవీ చార్జింగ్
  • మాల్స్, పెట్రోల్​ బంక్​లు, మార్కెట్లు, స్టేడియాలు,
  • హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటుకు  రవాణా శాఖ ప్రతిపాదనలు
  • రెడ్కోకు సిఫారసు చేసే యోచన.. పీపీపీ పద్ధతిలో భూ సేకరణ 
  • ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల జాగాల్లో ఏర్పాటుపైనా దృష్టి

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రానిక్ వెహికల్స్ (ఈవీ) పాలసీ అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈవీ చార్జింగ్​ స్టేషన్లపై దృష్టిసారించింది. హైదరాబాద్​లోని సెక్రటేరియెట్, స్టేడియాలతో పాటు విశాల స్థలం ఉన్న పెట్రోల్ బంక్స్, పెద్ద షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, నేషనల్, స్టేట్ హైవేల పక్కన వీటిని  ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని  రవాణా శాఖ ఆలోచిస్తున్నది. ఇక జిల్లా కేంద్రాల్లో అయితే కలెక్టరేట్లు, మార్కెట్ కమిటీలు, పెట్రోల్ బంక్ లతో పాటు ఇతర ప్రభుత్వ,  ప్రైవేట్  సంస్థల జాగాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఆర్టీసీ బస్​ స్టేషన్లు, డిపోల్లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలోని రెండు, మూడు ఆర్టీసీ డిపోల్లో, సూర్యాపేట హైటెక్ బస్​ స్టేషన్​లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు కొనసాగుతున్నాయి.

 సెక్రటేరియెట్, కలెక్టరేట్ వంటి వాటిలో ఏర్పాటు చేస్తే వందలాది మంది ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు విధుల్లో ఉండనున్నందున..ఈ లోపు వారి వెహికల్స్ చార్జ్​​అవుతాయని అధికారులు  ఆలోచిస్తున్నారు. 

షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ లో ఇవి ఏర్పాటు చేస్తే  వాహనదారులు షాపింగ్ చేసేలోపు, భోజనం, బస చేసే సమయంలో వెహికల్స్​ చార్జింగ్​ చేసుకునే వీలు కలుగుతుందని అంటున్నారు. ఇక వాణిజ్యపరమైన వెహికల్స్ మాత్రం పెట్రోల్ బంక్ ల వద్ద, మార్కెట్ కమిటీల్లో, స్టేడియాల వద్ద చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. 

హైదరాబాద్ ఎల్బీ స్టేడియం, శంషాబాద్ విమానాశ్రయంలో క్యాబ్  పార్కింగ్ వద్ద కూడా ఇప్పటికే ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. కొన్నిచోట్ల  పెద్ద స్టార్ హోటల్స్ వద్ద కూడా వీటిని ఏర్పాటు చేశారు. 

స్థలాల ఎంపికలో రెడ్కో నిమగ్నం

రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీని పెంచడం, ప్రోత్సహించడం కోసం దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈవీ సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ( పీపీపీ పద్ధతిలో ) ఇక్కడ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు రెడ్కో అన్ని చర్యలు తీసుకుంటున్నది. 

అయితే, రాష్ట్రంలో ఈవీ పాలసీని ప్రభుత్వం ప్రకటించడంతో పీపీపీ పద్ధతిలో అదనంగా మరో 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఎంపిక చేసేందుకు రెడ్కో రెడీ అవుతున్నది. ప్రస్తుతం ఒలెక్ట్రా, ఈట్రియో, ఈ రైడ్, పలు ఆటో మొబైల్ కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను తయారు చేస్తున్నాయి. 

టాటా మోటార్స్, మహీంద్రా వంటి  పెద్ద కంపెనీలు సైతం తమ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు  చేశాయి. అయితే, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన అనువైన స్థలం పొందాలంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నది. 

దీంతో రాష్ట్రంలో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రస్తుతం భూ కేటాయింపులు అనేది  సమస్యగా మారింది. రెడ్కో అధికారుల లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 700 ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్లాన్ చేశారు. కానీ ఇందులో కేవలం 150 ప్రాంతాలు మాత్రమే అనువైనవిగా గుర్తించారు. 

ఇందులో కేవలం 70 చార్జింగ్ స్టేషన్లను మాత్రమే ఏర్పాటు చేశారు. మరో 80 స్టేషన్ల ఏర్పాటుకు చిన్న చిన్న సమస్యలను అధిగమించాల్సి ఉంది.  ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్నది.  ఇలా భారీగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఈవీ వినియోగం పెరిగినా వాహనాల చార్జింగ్ సమస్య తలెత్తదని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఢిల్లీ పరిస్థితి రావొద్దని ఈవీ పాలసీ తెచ్చాం: మంత్రి పొన్నం ప్రభాకర్ 

ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యంతో స్కూళ్లు బంద్ చేశారని, రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితి రావొద్దనే ఉద్దేశ్యంతో ఈవీ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విరివిగా వినియోగించాలని కోరారు. 

ఈవీ వాహనాలపై రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు100శాతం మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 ఏండ్లు  దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ చేయాలని కోరారు. హైబ్రిడ్ వాహనాలకు కూడా పన్ను రాయితీ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని,  ప్రజలు ఈవీ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు.